Health

వానాకాలం నీటి నిల్వ అరికట్టండి

If you can prevent stagnating water in rainy season you are in good health - వానాకాలం నీటి నిల్వ అరికట్టండి

* ఆహారం అరగాలంటే… వర్షాకాలంలో ఆకలి, జీర్ణశక్తి పనితీరు మందగిస్తాయి. కాబట్టి తేలిగ్గా అరిగే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కాలంలో పచ్చి కూరగాయలు తీసుకోకూడదు. కూరలను బాగా ఉడికించి తినాలి. దుంపలకు దూరంగా ఉండాలి. ఆహారంలో శొంఠి, అల్లం, జీలకర్ర, మిరియాలు, వాము వంటివి చేర్చుకుంటే అజీర్తి సమస్య ఎదురుకాదు. ఇవన్నీ కఫం పెరగకుండా, అతిసారం రాకుండా చేస్తాయి. రోజూ కొద్దిగా తేనె తీసుకుంటే కఫ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. రోడ్డువారన దొరికే ఆహారానికి దూరంగా ఉండాలి. ఇంట్లో పరిశుభ్రంగా వండిన ఆహారం తింటే అతిసారం, టైఫాయిడ్, కామెర్లు రాకుండా చూసుకోవచ్చు.
* స్నానం: వేడి నీటితోనే స్నానం చెయ్యాలి. దానికి ముందు ఒంటికి నువ్వుల నూనె లేదా కొన్నిరకాల ఆయుర్వేద తైలాలతో మర్దన చేసి సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. శారీరక అలసట దూరమవుతుంది. ఒళ్లు నొప్పులూ బాధించవు.
* పరిశుభ్రత ముఖ్యం: ఇంట్లో బూజు లేకుండా చూసుకోవాలి. ఉబ్బసం సమస్య ఉన్నవారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తోలు వస్తువులు, బూట్లు తడిగా లేకుండా చూసుకోవాలి. లేదంటే ఇవే పలు రకాల అలర్జీలకు కారణమవుతాయి. ఇంట్లో సాంబ్రాణి లేదా మూలికలతో ధూపం వేసుకుంటే బూజు, సూక్ష్మజీవుల సమస్య తగ్గుతుంది. ఇంటి పరిసరాల్లో చిన్నచిన్న గుంటల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వీటిలో దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు వృద్ధి చెందుతాయి. నీటి గుంటలున్న చోట కిరోసిన్ చల్లితే వ్యాధికారక జీవులు వృద్ధి చెందవు.
* దుస్తులు: ఎండవేడి లేకపోయినా ఈ కాలంలో చెమట ఎక్కువగానే పడుతుంది. నూలు దుస్తులే మంచిది. సింథటిక్ వస్త్రాల వల్ల చెమట చేరి, చర్మ సంబంధ సమస్యలు రావొచ్చు.
అడపాదడపా చినుకులు పడుతున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే… కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటంటే…
ఈ సమయంలో అతిసారం, టైఫాయిడ్, ఫ్లూ జ్వరాలు, దగ్గు, జలుబు, మలేరియా, కామెర్లు లాంటి అనారోగ్యాలు రావొచ్చు. కీళ్ల నొప్పులు ఉంటే అవి మరింత పెరగొచ్చు. వీటన్నింటినీ అదుపులో ఉంచాలంటే… మనలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా కాచి, చల్లార్చిన మంచినీళ్లను తాగాలి. కనీసం పది నిమిషాలైనా నీళ్లను మరిగించడం వల్ల వాటిలో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి. గోరు వెచ్చని నీళ్లు తాగితే కఫం రాదు. మరిగే నీటిలో కొద్దిగా వాము వేసి తాగితే అజీర్ణం, అతిసారానికి దూరంగా ఉండొచ్చు.
**చిట్కాలు
* కప్పు పాలల్లో అరచెంచా శొంఠి పొడి వేసి కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలిపి తాగాలి.
* శొంఠి, పిప్పళ్లు, మిరియాలను విడివిడిగా మెత్తగా పొడి చేసి సమభాగాల్లో కలుపుకోవాలి. దీన్ని త్రికటు చూర్ణం అంటారు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు, అలర్జీని నిరోధిస్తుంది.
* యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను సమభాగాల్లో కలపి చూర్ణం చేసుకొని భద్రపరుచుకోవాలి. కప్పు నీటిని మరిగించి, ఆ నీటిలో పావు చెంచా పొడి వేసి టీ లా కాచుకోవాలి. చివర్లో ఎనిమిది తులసి ఆకులు వేసి వేడివేడిగానే తాగాలి. ఇలా నిత్యం చేస్తే వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు.