Politics

బ్రిటన్ నూతన మంత్రివర్గంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

Infosys NarayanaMurthy Son In Law Joins Britain Cabinet - బ్రిటన్ నూతన మంత్రివర్గంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కు యూకే ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. బ్రిటన్‌ నూతన ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్‌ నేత బోరిస్‌ జాన్సన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం కేబినెట్‌ కూర్పు జరిగింది. రిషి సునక్‌ సహా మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు దీనిలో చోటు కల్పించారు. రిషి సునక్‌ను ట్రెజరీ విభాగ చీఫ్‌ సెక్రటరీగా నియమించినట్లు యూకే ప్రధాని కార్యాలయం వెల్లడించింది. 39ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. చీఫ్‌ సెక్రటరీ హోదాలో రిషి కేబినెట్‌ సమావేశాలకు హాజరుకానున్నారు. ఇక రిషితో పాటు భారత సంతతికి చెందిన అలోక్‌ శర్మ, ప్రీతి పటేల్‌కు కేబినెట్‌లో స్థానం దక్కింది. యూపీలోని ఆగ్రాలో పుట్టిన శర్మ.. బ్రిటన్‌లో స్థిరపడ్డారు. 2010 నుంచి రీడింగ్‌ వెస్ట్‌ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు. థెరిసా మే ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా చేసిన అలోక్‌ శర్మ.. తాజా కేబినెట్‌లో ఇంటర్నల్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ కొత్త కేబినెట్‌లో హోం సెకట్రరీగా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి మహిళ ఈమే కావడం విశేషం.