ScienceAndTech

డిసెంబరు నాటికి వాట్సాప్ చెల్లింపులు

WhatsApp Payments To Begin Starting December 2019 --- డిసెంబరు నాటికి వాట్సాప్ చెల్లింపులు

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ చెల్లింపు సేవలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులైనా ఇది ఆచరణలోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో అది ఎప్పుడనే దానిపై ఆ కంపెనీ గ్లోబల్‌ హెడ్‌ విల్‌ కాత్‌కార్ట్‌ స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది చివరికల్లా పేమెంట్‌ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన బుధవారం వెల్లడించారు. ఒకసారి దీనికి సంబంధించి అనుమతులు వచ్చాక దేశంలోని వినియోగదారులందరికీ ఈ ఏడాది చివరికల్లా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చి డిజిటల్‌ ఎకానమీలో భాగస్వాములు అవుతామని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తమ మెసేజింగ్‌ సేవల్లానే సులభంగా డబ్బును ఇతరులకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది.. భారత్‌లో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పటికే దేశంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటివి ఇప్పటికే ఈ సేవలను అందిస్తున్నాయి. వాట్సాప్‌ వీటికి పోటీకి రానుంది. అయితే, డేటా స్టోరేజీ తదితర అంశాల విషయంలో వాట్సాప్‌ చెల్లింపు సేవల ప్రారంభం నిలిచిపోయింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు నేపథ్యంలో ఈ సేవలు ఆలస్యమవుతున్నాయి. దీంతో పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను భారత్‌లోనే భద్రపరిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ గతేడాది వెల్లడించింది. ఆర్‌బీఐ నిబంధనలు అమలు చేయకుండా పేమెంట్‌ సేవలు ప్రారంభించబోమని సుప్రీం కోర్టుకు ఈ ఏడాది మేలో తెలియజేసింది.