Politics

వైకాపాపై పురంధేశ్వరి విమర్శలు

Daggubati Purandheswari Slams YSRCP Government - వైకాపాపై పురంధేశ్వరి విమర్శలు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడిని పెంచుతోంది బీజేపీ. ఆరు నెలలపాటు వైసీపీకి సమయం ఇస్తామని చెప్పిన బీజేపీ 50 రోజులు దాటకుండానే దాడి మెుదలెట్టేసింది. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతోంది.

సభ్యత్వ నమోదు పేరుతో బీజేపీ నేతలు ఏపీలో తిష్టవేసి మరీ వైసీపీని తిట్టి పోస్తున్నారు. అదేకోవలో చేరిపోయారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

తెలుగుదేశం ప్రభుత్వ అవినీతిని భరించలేకే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే పంథాలో పోతుందని విమర్శించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతుందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు తరహాలోనే జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. గోదావరి జలాల పంపకం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడటం సరైంది కాదని హితవు పలికారు.

నదీజలాల పంపకాల విషయంలో ఏపీ ప్రజలు, రైతు సంఘాలు, అఖిలపక్షం నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పీపీఏలలో అవినీతి జరిగితే సమీక్షించడం మంచిదే కానీ రద్దు చేయడం మాత్రం సబబు కాదంటూ దగ్గుబాటు పురంధేశ్వరి హితవు పలికారు.