Health

హైదరాబాద్‌లో మలేరియా తగ్గింది. డెంగీ పెరిగింది.

Hyderabad sees increased cases of dengue in rainy season

రాష్ట్రంలో వానలైతే కురుస్తలేవు గానీ వానాకాలంలో వచ్చే రోగాలు మాత్రం ముసురుతున్నాయి. డెంగీ, మలేరియా, డయేరియా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది నుంచి డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా 2018లో 6,362 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి సర్కారీ దవాఖానాల్లో 953 కేసులను గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఖ్య 1,200 దాటిందని అధికారులు చెబుతున్నారు. ‘ప్రైవేటు’ను కలిపితే సంఖ్య డబుల్‌ అవుతుందంటున్నారు. గతేడాది ఎక్కువ కేసులు నమోదవడం, ఈ ఏడాదీ బాధితులు పెరుగుతుండటంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ఈమధ్యే రాష్ర్టానికొచ్చారు. హైదరాబాద్‌లోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌‌ కార్యాలయంలో రాష్ర్ట అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. విష జ్వరాలను అరికట్టేందుకు సలహాలు, సూచనలు చేశారు. 2022 నాటికి రాష్ట్రంలో మలేరియా, డెంగీ జ్వరాలను నిర్మూలించేందుకు కృషి చేయాలని వాళ్లు సూచించినట్టు తెలిసింది. సీజనల్‌ రోగాలు గ్రామాల్లో కన్నా నగరవాసులనే ఎక్కువ బాధిస్తున్నాయి. గత మూడేళ్లలో రాష్ర్టవ్యాప్తంగా నమోదైన డెంగీ, మలేరియా కేసుల్లో హైదరాబాదే టాప్‌‌లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి 953 డెంగీ కేసులు నమోదైతే హైదరాబాద్‌‌లో 225 కేసులు గుర్తించారు. 104 కేసులతో రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది. 2018లో రాష్ర్టంలో 6,362 కేసులు నమోదైతే హైదరాబాద్‌‌లో 1,086, రంగారెడ్డిలో 400, మేడ్చల్‌‌లో 320 కేసులను గుర్తించారు. 2017లో రాష్ర్టవ్యాప్తంగా 3,817 కేసులకు గాను హైదరాబాద్‌‌లో అత్యధికంగా 869 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌‌, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 460 కేసులు నమోదయ్యాయి. ఇలా ఏటా నగరంలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో ఈ ఏడాది వానాకాలం ప్రారంభంలోనే బల్దియా అధికారులతో వైద్యారోగ్య అధికారులు సమావేశమయ్యారు. దోమ లార్వా నాశనం చేయాలని, మురికి వాడల్లో రోడ్లపై, డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినా ఫలితం కనిపించడం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 2015లో అత్యధికంగా 11,880 మలేరియా కేసులు నమోదయ్యాయి. సర్కారు గట్టి చర్యలు తీసుకోవడంతో 2016లో కేసుల సంఖ్య 3,575కు తగ్గింది. గతేడాది 1,792, ఈ ఏడాది జూన్ చివరి వరకు 588 కేసులు నమోదయ్యాయి. 2022 నాటికి రాష్ర్టంలో మలేరియాను నిర్మూలించాలని రాష్ర్ట సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని వైద్యారోగ్య అధికారులు చెబుతున్నారు. ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.