Editorials

వారికి డబ్బులిస్తే మూర్ఖత్వం వాపస్ వస్తుంది

వారికి డబ్బులిస్తే మూర్ఖత్వం వాపస్ వస్తుంది - Indian Army Chief General Bipin Rawat Warns Pakistan

ఆర్థిక సాయం కోసం పాక్‌ ఎంతకైనా తెగిస్తుందని భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ సందర్భంగా శుక్రవారం అమరులైన సైనికులకు నివాళులర్పించిన అనంతరం ఆయన స్పందించారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారంపై అమెరికా మధ్యవర్తిత్వంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘చర్చలకు, చర్యలకు మధ్య తేడా ఉంది. పాకిస్థాన్‌లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆ దేశాన్ని ఏ శక్తులు నియంత్రిస్తున్నాయో కూడా మనకు తెలుసు. నిధుల కోసం పాకిస్థాన్‌ ఎంతకైనా తెగిస్తుంది. ఒక్కసారి ఆర్థిక సాయం అందాక మళ్లీ వారిలో మార్పేమీ కనిపించదు.’’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ మళ్లీ భారత్‌లోకి చొరబడాలని ప్రయత్నిస్తే ఈ సారి వారి శవాలను వెనక్కి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని దాయాది దేశానికి చురకలంటించారు. ఎందుకంటే భారత బలగాలు సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉన్నాయని అన్నారు. ఆ దేశం ఎలాంటి దుస్సాహసం చేసేందుకు పాల్పడవద్దని హితవు పలికారు. మన సైనికులకు ఆయుధాల ఆధునికత విషయంలో కొన్ని చిన్న డిమాండ్లు ఉన్నాయని బిపిన్‌ రావత్‌ అన్నారు. ‘‘యుద్ధ సమయంలో శత్రువును కనిపెట్టేందుకు కొన్ని రకాల నిఘా పరికరాలు, మట్టుబెట్టేందుకు ఆధునిక ఆయుధాలు అవసరం. మన బలగాల వద్ద ఆయుధాలను ఆధునీకీకరించే ప్రయత్నంలోనే ఉన్నాం. కానీ ఇది రాత్రికి రాత్రి సాధ్యం కాదు.’’ అని వివరించారు.