బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచిత్రమైన కేసు నమోదైంది. తిరుమలగిరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాజేశ్వరి తాను పెంచుతున్న వాటిలో బ్లెస్సీ అనే పిల్లి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన పిల్లి అదృశ్యమైందని, జీవహింస చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. మహిళ ఫిర్యాదుతో ఒకింత ఆశ్చర్యపోయిన పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీశారు. తిరుమలగిరిలోని తన నివాసంలో రకరకాల పెంపుడు జంతువులు, పక్షులను రాజేశ్వరి అనే మహిళ పెంచుకుంటోంది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 3లోని శ్రీనికేతన్‌కాలనీలో నివాసం ఉండే వ్యక్తికి ఈ నెల 13న ఫేస్‌బుక్ ద్వారా దత్తతకు ఇచ్చింది. కాగా.. ఈ నెల 20న పిల్లికి వ్యాక్సిన్ వేయించాల్సి ఉండటంతో అతడికి ఫోన్ చేసింది. దత్తత తీసుకున్న వ్యక్తి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మూడు రోజుల పాటు అతడి ఇంటి చుట్టూ తిరిగింది. చివరికి పిల్లి విషయంపై నిలదీయగా.. అది పారిపోయిందని సమాధానం చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. తన ఏడాదిన్నర వయసు ఉన్న పిల్లిని అప్పగించాలని ఆమె కోరుతోంది. పిల్లిని అప్పగించిన వారికి రూ.10వేల నగదు బహుమతి ఇస్తానని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
బంజారాహిల్స్‌లో పిల్లి పోయిందని పోలీసు ఫిర్యాదు
Related tags :