ఎండాకాలం వచ్చిందంటే చాలు బయటకెళ్లడానికే భయపడతాం. కాస్త ఉన్నవాళ్లయితే ఇంట్లో ఎంచక్కా ఏసీ పెట్టుకుంటారు. మరి బయటకెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇదే ఆలోచనతో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ ఓ కొత్త పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ (ఏసీ)ని తీసుకొచ్చింది. దీనికి ఆ కంపెనీ ‘రియాన్ పాకెట్’గా నామకరణం చేసింది. ఈ పాకెట్ ఏసీ సైజు మనం నిత్యం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ కంటే చిన్నదిగా ఉండడం గమనార్హం. దీని కోసం ప్రత్యేకంగా లోపల ధరించే టీషర్ట్‌ను కూడా ఆ కంపెనీ తీసుకొచ్చింది. బ్యాటరీతో నడిచే ఈ పాకెట్ ఏసీ స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్లూటూత్ ఉపయోగించి నియంత్రిచొచ్చు. బ్లూటూత్ 5.0తో ఇది పనిచేస్తుంది. రెండు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 90 నిమిషాల పాటు వాడుకోవచ్చు. రియాన్ పాకెట్ ప్రాజెక్ట్‌ను సోనీ కంపెనీ కింద క్రౌడ్‌ఫండింగ్ ప్రోగ్రామ్ కింద తీసుకొస్తోంది. 6.6 కోట్ల యెన్ (జపాన్ కరెన్సీ) లక్ష్యంగా పెట్టుకోగా.. 2.8 కోట్ల యెన్‌లు ఇప్పటి వరకు సమకూరాయి. ఇంతకీ ఈ పోర్టబుల్ ఏసీ ధర గురించి చెప్పలేదు కదూ.. అక్షరాల 14,080 యెన్‌లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.8,992 అన్నమాట. లోపల ధరించే టీషర్ట్‌తో కలిపి ఈ ధరకు కంపెనీ విక్రయిస్తోంది. లోపలి టీషర్ట్ S,M,L సైజుల్లో లభిస్తాయి. అయితే ఇది కేవలం పురుషులకు మాత్రమే. వాటర్ ప్రూఫ్‌తో ఇది వస్తోంది. ఇంకెందుకు ఆలస్యం కొనేద్దామని అనుకుంటున్నారా? ఆగండాగండి.. ప్రస్తుతం ఇది జపాన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. భారత్‌కు తీసుకొచ్చేదీ లేనిదీ తెలియాల్సి ఉంది.
ఇది ఏసీ టీషర్టు
Related tags :