WorldWonders

బీమా డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య

Telugu guy kills parents for insurance money in Darshi of Prakasam District - బీమా డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య

ప్రకాశం జిల్లా దర్శిలో ఇన్సూరెన్స్  డబ్బుల కోసం తల్లిదండ్రులను కొడుకు దారుణంగా హత్య చేశాడు. అయితే గుర్తు తెలియని దుండగులు తమ తల్లిదండ్రులను హత్య చేసినట్టుగా నారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులు నారాయణరెడ్డినే నిందితుడుగా తేల్చారు.

ప్రకాశం జిల్లా దర్శిలో వెంకట్ రెడ్డి,ఆదెమ్మ దంపతులను ఈ నెల 21వ తేదీన  నారాయణరెడ్డి హత్య చేశాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో నారాయణరెడ్డి పనిచేసేవాడు.అయితే తాను పనిచేసే కంపెనీలో కూడ లోన్ రికవరీ చేసే డబ్బులను కూడ ఆయన వాడుకొన్నాడు.

చెడు వ్యసనాలకు కూడ నారాయణరెడ్డి బానిసగా మారాడు. దీంతో పనిచేసే కంపెనీ నుండి  తొలగించారు.గ్రామంలో కూడ ఇతరుల నుండి మరో రూ. 2 లక్షలు అప్పులు చేశాడు. నారాయణరెడ్డి ప్రవర్తన నచ్చని అతని భార్య మూడు మాసాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే పథకం ప్రకారంగా తల్లి ఆదెమ్మ పేరున రూ. 15 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొన్నాడు. తల్లి చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే తన బకాయిలను తీర్చుకోవచ్చని ప్లాన్ చేశాడు.

ఈ నెల 21వ తేదీన నారాయణరెడ్డి తల్లిదండ్రులకు  మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. తెల్లవారే వరకు వాళ్లు  మృతి చెందలేదు. దీంతో వారిని  మంచంపై పడుకోబెట్టి గొంతు నులిమి చంపేశాడు. అప్పటికి చనిపోయారో లేదో అని అనుమానించి మణికట్టును కోసి హత్య చేశాడు.

ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా పోలీసులకు పిర్యాదు చేశాడు.  నారాయణరెడ్డిపైనే పోలీసులకు మొదటి నుండి అనుమానం ఉంది.ఈ విషయమై పోలీసులు నారాయణరెడ్డిని విచారిస్తే అసలు విషయం  వెలుగు చూసింది. శుక్రవారం నాడు నారాయణరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.