Movies

పాస్‌పోర్టు లాగేసుకున్నారు

పాస్‌పోర్టు లాగేసుకున్నారు - The sad cringy past of nora fatehi during her early days -

సినీ కెరీర్‌ ప్రారంభించడానికి ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీ గుర్తు చేసుకున్నారు. ఆమె 2014లో ‘రోర్: టైగర్స్‌ ఆఫ్‌ సుందర్‌బన్స్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తర్వాత అనేక ప్రత్యేక గీతాల్లో సందడి చేశారు. తెలుగులో ‘టెంపర్‌’, ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘షేర్‌’, ‘లోఫర్‌’ తదితర చిత్రాల్లోని ప్రత్యేక గీతాలతో అలరించారు. ఇటీవల నోరా నటించిన ‘బాట్లా హౌస్‌’లోని రీమిక్స్‌ గీతం ‘ఓ సాకీ సాకీ..’కు విపరీతమైన ఆదరణ లభించింది. కాగా ఈ భామ తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెనడాకు చెందిన తను భారత్‌లో ఎదుర్కొన్న సమస్యలు, మోసాల గురించి ప్రస్తావించారు.

‘భారత్‌లో విదేశీయులు జీవించడం చాలా కష్టం. మేం తెలియని వారితో పరిచయాలు ఏర్పరచుకోవాల్సి వస్తుంది. వాళ్తు డబ్బులు లాక్కుంటుంటారు. ఇలాంటి ఘటన నాకూ ఎదురైంది. నన్ను కెనడా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన ఏజెన్సీ చాలా దురుసుగా ప్రవర్తించేది. వారి ద్వారా నేను సరైన మార్గంలో వెళ్తున్నట్లు నాకు అనిపించలేదు. అందుకే వారి నుంచి దూరంగా వచ్చేశా. దీంతో ‘నీ డబ్బులు తిరిగి ఇవ్వం’ అనేశారు. అప్పుడు ప్రకటనల ద్వారా నేను సంపాదించుకున్న రూ.20 లక్షలు నష్టపోయా’.

‘తర్వాత ఎనిమిది మంది అమ్మాయిలతో కలిసి అపార్ట్‌మెంట్‌ను షేర్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కొన్ని సంఘటనలు నన్ను షాక్‌కు గురి చేశాయి. నా రూమ్‌మేట్స్‌ నా పాస్‌పోర్ట్‌ దొంగిలించారు. నేను హిందీ నేర్చుకునేందుకు ప్రయత్నించాను. కానీ, ఆడిషన్స్‌ నన్ను చాలా డిస్టర్బ్‌ చేశాయి. మానసికంగా సిద్ధం కాకుండానే ఆడిషన్స్‌కు వెళ్లాను. నేర్చుకున్న కాస్త హిందీ మాట్లాడా. నేనేదో సర్కస్‌ చేస్తున్నట్లు నా ముఖం చూసి అందరూ నవ్వేవారు. కొంచెం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించారు. దీంతో ఆడిషన్స్‌ నుంచి ఇంటికి వెళ్తూ ఏడ్చేదాన్ని. ఓ క్యాస్టింగ్‌ ఏజెన్సీ.. ‘నువ్వు మాకు అవసరం లేదు.. తిరిగి మీ దేశానికి వెళ్లిపో’ అంది. దాన్ని నేను జీవితంలో మర్చిపోలేను’ అని చెబుతూ నోరా ఆవేదన చెందారు.