Agriculture

రైతన్నా….భూమి మండిపోతోంది

Earth Temperatures Are Hugely Crazy And Rising Constantly - రైతన్నా....భూమి మండిపోతోంది

ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న బూచి గ్లోబల్ వార్మింగ్. అంటే భూమి వేడెక్కడం. ఇక్కడా అక్కడా అన్న తేడాలేం లేవు. ప్రాంతమేదైనా సూర్యుడు మంటెక్కిస్తున్నాడు. మొన్నటి దాకా మనం ఎండాకాలంలో ఎంత వేడిని అనుభవించామో గుర్తుంది కదా. ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి చల్లటి దేశాల్లోనూ సూర్యుడు ప్రతాపం చూపించేస్తున్నాడు. అక్కడా ఎండ 43 డిగ్రీలు దాటేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు విషయానికొద్దాం. కారణాలేవైనా కావొచ్చు గానీ, 2000 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఇప్పుడే భూమి వేడెక్కుతోందని, అది కూడా ఊహించనంత వేగంగా జరుగుతోందని తాజాగా సైంటిస్టులు హెచ్చరించారు. 98 శాతం ప్రపంచం పరిస్థితి ఇదేనంటున్నారు. స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్న్ సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను విశ్లేషించి చెబుతున్న మాట ఇది. 2000 ఏళ్ల 700 వాతావరణ రికార్డులను పరిశీలించారు. మంచు కేంద్రకాలు, చెట్ల నెట్వర్క్, శిలాజాలుగా మారిన పుప్పొడులు, బోరు రంధ్రాలు, పగడపుదీవులు, చెరువులు, సముద్రపు అవశేషాల తీరును పరీక్షించారు. ఆ తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చారు.
**చిన్న మంచు యుగమూ అంత లేదు
1300 నుంచి 1850 సంవత్సరం మధ్య ఏర్పడిన చిన్న మంచు యుగం (లిటిల్‌ ఐస్‌ ఏజ్‌) కూడా ప్రపంచం మొత్తం విస్తరించలేదని సైంటిస్టులు తేల్చారు. 15వ శతాబ్దంలో పసిఫిక్ మహాసముద్రం, 17వ శతాబ్దంలో యూరప్లో దాని ప్రభావం ఎక్కువుందన్నారు. మొత్తంగా 40 శాతం భూమిపై మాత్రమే దాని ప్రభావం ఉందని నిర్ధారించారు. 950 నుంచి 1250 మధ్య నడిచిన మధ్యయుగం నాటి వేడి కాలం కూడా ఇంతగా లేదన్నారు. 250 నుంచి 400 మధ్య ‘రోమన్ వేడి కాలం’లో యూరప్ మొత్తం వేడిగా ఉందని వారి పరిశీలనల్లో గుర్తించారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైంలో వాతావరణం మారిందని వివరించారు. ఒకే టైంలో వాతావరణం ఎప్పుడూ మారలేదని తేల్చారు. పారిశ్రామిక విప్లవం మొదలవడానికి ముందు ప్రపంచం ఎన్నోసార్లు వేడెక్కి చల్లబడిందని, దాదాపు కొన్ని శతాబ్దాలపాటు ఆ ప్రక్రియ కొనసాగిందని సైంటిస్టులు అంటున్నారు.
*మనిషే కారణమని చెప్పలేం
ఇప్పటి పరిస్థితులు పాత కాలం నాటి పరిస్థితులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకకాలంలో 98 శాతం ప్రపంచం వేడెక్కిందని హెచ్చరించారు. ఈ మొత్తం పరిణామాలకు మనిషే కారకుడనీ చెప్పలేమంటున్నారు. ప్రకృతిలో జరిగే మార్పులూ అందుకు కారణమవుతాయంటున్నారు. దానికి ఆజ్యం పోసినట్టుగా మనిషి తీసుకొచ్చిన పారిశ్రామిక విప్లవం ఆ మార్పులను మరింత రెట్టించాయని అంటున్నారు. ఇప్పటి పరిస్థితుల వల్ల పర్యావరణ మార్పుల్లో ఎక్కువగా ప్రభావం పడుతున్నది అగ్నిపర్వతాలపైనేనని గుర్తించారు. వాటిపై సూర్యుడి వేడిలో ఎలాంటి తేడా లేదని కనిపెట్టారు. ‘‘భూమి సహజ వేడి రేటు కన్నా ఇప్పుడు భూమి వేడెక్కడం ఎక్కువైంది. పాత సమాచారాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి చూస్తే అది తేలింది” అని స్టడీకి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ డాక్టర్ రాఫెల్ న్యూకమ్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచం చాలా సార్లు వేడెక్కిందని, కాబట్టి ఇప్పటి పరిస్థితులకు కారణమేంటన్నదానిపై తాము అధ్యయనం చేయలేదని ఆయన వివరించారు. ఓ రకంగా దీనికి కారణం మనిషి తీసుకున్న నిర్ణయాలేనని అన్నారు. అందుకే 2000 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే ఎక్కువ వేడి ఉందని ఆయన వివరించారు. ఇతర సైంటిస్టులూ వారి పరిశోధనను సమర్థించారు.