*తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైందా..? ఆగష్టు మెుదటి వారంలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా…? ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఎవరెవరికి బెర్త్ లు దక్కనున్నాయి..? మంత్రి పదవికి దూరమైన హరీష్ రావుకు ఈసారి బెర్త్ కన్ఫమ్ అయ్యే అవకాశం ఉందా…?టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విస్తరణలో ఛాన్స్ లభించే అవకాశం ఉందా..? గతంలో ఇద్దరి మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తానన్న కేసీఆర్ ఈ విస్తరణలోనైనా తన మాట నిలబెట్టుకుంటారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రి వర్గంలో నలుగురికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 6న మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండొచ్చని పార్టీ కార్యాలయం వద్ద గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి కేబినెట్ విస్తరణలో సీనియర్ నేతలకే బెర్త్ లు కన్ఫమ్ చేసినట్లు తెలుస్తోంది.టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను కూడా కేసీఆర్ మంత్రి వర్గంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరి బెర్త్ లు దాదాపు కన్ఫమ్ అయిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.ఇకపోతే కేసీఆర్ మంత్రి వర్గంలో పార్టీ సీనియర్ నేత హరీష్ రావుకు స్థానం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కొందరు నేతలు సైతం హరీష్ రావును మంత్రి వర్గంలో తీసుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎంను చేసేందుకే హరీశ్ ను మంత్రి వర్గంలో తీసుకోవడం లేదని అటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వాదనలపై టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉంది.అయితే హరీశ్ రావు అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి హరీశ్ రావును మంత్రి వర్గంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. మెుత్తానికి ఈసారి కేబినెట్ విస్తరణలో నలుగురు సీనియర్ నేతలకు స్థానం కల్పించనున్నట్లు సమాచారం.ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ తోపాటు 12 మంది మంత్రులు ఉన్నారు
*ఎపిలో బిజెపి ప్లాన్: చంద్రబాబు కార్నర్, వైఎస్ జగన్ టార్గెట్……….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడానికి బిజెపి నాయకత్వం పక్కా ప్లాన్ రచించి అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రణాళికను రచించి అమలు చేస్తోంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోందితమ ప్రణాళికలో భాగంగా బిజెపి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేస్తుంది, ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకుంది. జగన్ కు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా బిజెపి నేతలు విమర్శల జడివాన కురిపిస్తున్నారు.
* పవన్ కల్యాణ్ కమిటీల్లో నో చాన్స్: జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై?
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్తా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు ద్వారా లక్ష్మినారాయణ హీరో అయ్యాడు. ఆయనకు గ్లామర్ పెరిగింది కూడా ఆ కేసులతోనే. ఆ తర్వాత ఆయన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. తన పదవికి రాజీనామా చేసి ఆయన నిరుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సొంత పార్టీ పెడుతారని, లోకసత్తాకు నాయకత్వం వహిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది
* రాబోయే ఎన్నికలకు పవన్ కసరత్తు: భవిష్యత్ పై మూడు రోజులపాటు సమీక్షించనున్న జనసేనాని
ఏపీలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మూడు రోజులపాటు పార్టీ సమీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈనెల 29 నుంచి 31 వరకు పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టే కార్యక్రమాల నిర్వహణ గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్.
*ఎపిలో బిజెపి ప్లాన్: చంద్రబాబు కార్నర్, వైఎస్ జగన్ టార్గెట్……….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడానికి బిజెపి నాయకత్వం పక్కా ప్లాన్ రచించి అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రణాళికను రచించి అమలు చేస్తోంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోందితమ ప్రణాళికలో భాగంగా బిజెపి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేస్తుంది, ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకుంది. జగన్ కు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా బిజెపి నేతలు విమర్శల జడివాన కురిపిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన నేపథ్యంలో వారిని కూడా వాడుకుని తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో బిజెపి నేతలు ఉన్నారు. తద్వారా చంద్రబాబును కార్నర్ చేసి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయం కావాలని చూస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బిజెపి నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఓడిపోయి, జగన్ గెలవడం పల్ల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లయిందని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రజల విశ్వాసం కోల్పోయారని దగ్గుబాటి పురంధేశ్వరి అప్పుడే ప్రభుత్వంపై తీర్పులు చెప్పే వైఖరిని తీసుకున్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా అంతే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
*సీఎంగా యడియూరప్ప ప్రమాణం, మెుక్కులు చెల్లించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దాదాపు మూడు వారాలుగా రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి రెండు రోజుల క్రితం ముగింపు పలికింది. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ శాసన సభాపక్ష నేత యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కర్ణాటక రాజకీయాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఇప్పుడు స్పీకర్ ను కొనసాగించాలా వద్దా అన్న చర్చ జరుగుతోంది.
*యడియూరప్ప తర్వాత నేనే: బాంబు పేల్చిన ఎమ్మెల్యే శ్రీరాములు
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన యడియూరప్పకు కేబినెట్ కూర్పు కత్తిమీద సామే అన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కుమార స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీకి కేబినెట్ కూర్పు పెద్ద సవాల్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే కేబినెట్ కూర్పుపై మెలకాల్మూరు ఎమ్మెల్యే బి.శ్రీరాములు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. తాను ఆ పదవిని ఆశించడం లేదని స్పష్టం చేశారు.బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. తనకు పదవులపై ఎలాంటి ఆశలు లేవని చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ కోరుతున్నారని ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే అభిమానులు కోరుకోవడంలో తప్పులేదన్నారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి తాను కొన్ని దశాబ్ధాల కాలంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుకే రాష్ట్రంలో యడియూరప్ప తర్వాత తన పేరే బీజేపీలో వినిపించడానికి కారణమన్నారు. ఇకపోతే పార్టీ నాయకత్వం తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి అనేకమంది కష్టాపడ్డారని, ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే పార్టీలో ప్రతి ఒక్కరు అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పుకొచ్చారు. యడియూరప్ప ముఖ్యమంత్రి కావాలన్నదే తన ఆకాంక్ష అని అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని శ్రీరాములు తెలిపారు.
* లంగాణలో అమిత్ షా సభ్యత్వం……..
బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. హైదరాబాద్ లో కానీ లేదా చుట్టుపక్కల జిల్లాల్లో ఆయన సభ్యత్వం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కాగా… తెలంగాణతో ఎలాంటి సంబంధం లేని ఆయన ఇక్కడ సభ్యత్వం తీసుకోవాలని అనుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడమే అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఇప్పుడు అమిత్ షా కూడా ఇక్కడే సభ్యత్వం తీసుకోనుండటం విశేషం.
* టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు
గుంటూరు జిల్లా పొనుగుపాడులో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. పొనుగుపాటులో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా రోడ్డును నిర్మించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోడ నిర్మాణాన్ని పరిశీలించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ అక్కడికివెళ్లింది. అయితే గ్రామ శివార్లలోనే కమిటీని పోలీసులు అడ్డుకున్నారు.కమిటీ సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాలి గిరి, తెనాలి శ్రావణ్‌కుమార్, అశోక్‌బాబుతోపాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులును అరెస్టు చేశారు. టీడీపీ నేతల్ని నరసరావుపేటకు తరలించారు. అటు.. పొనుగుపాడులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నరసరావుపేట వెళ్లాక RDOతో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సమావేశం అయింది. త్వరలో గ్రామంలో విచారించి నిర్ణయం తీసుకుంటామన్నారు RDO.
* ఆ పదాలు నీ డిక్షనరీలో డిలీట్ చేయ్, సొంతవారినే మోసం చేశావ్: తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు……
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వానికి మాట తప్పడం, మడమ తిప్పడం దిన చర్యగా మారిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత అనే పదాలు వాడొద్దని సూచించారు. అన్నదాతలు, రైతన్నల విషయంలో ఏపీ సర్కార్ మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 12,500 ఇస్తామని జగన్ మేనిఫెస్టోలో పెట్టారని అది ఇప్పుడు రూ.6,500కు మాత్రమే రాష్ట్రప్రభుత్వం ఇస్తుందని మిగిలిన రూ.6000 కేంద్రం ఇస్తుందని జగన్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.
పీఎం కిసాన్ యోజన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకమని దానికి రాష్ట్రప్రభుత్వానికి ఏం సంబంధం అని నిలదీశారు. సున్నా వడ్డీ వ్యవసాయ రుణాలు అంటూ నానా హంగామా చేసిన సీఎం జగన్ తీరా బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించి రైతులను మోసం చేశారని విమర్శించారు. సీఎం హోదాలో రూ. 3,500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.100 కోట్లు ఇస్తారా అంటూ మండిపడ్డారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులని ఆరోపిస్తూ విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాలో జలదీక్ష చేసిన విషయం గుర్తుందా అంటూ ప్రశ్నించారు. జలదీక్షలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను హిట్లర్ తో పోల్చిన జగన్ ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.
ఒకప్పుడు అది అక్రమ ప్రాజెక్టు అని ఆరోపించిన జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో పాల్గొనడం తన జన్మ ధన్యమైందని చెప్తున్నారంటూ దుయ్యబుట్టారు. ఎన్నికల ప్రచారంలో 20మంది ఎంపీలు ఇస్తే కేంద్రంను ఆడిస్తా అంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు నిటూర్పులు ఊదుతున్నారంటూ విరుచుకుపడ్డారు.
*జగన్ గెలవడానికి కారణం ఆయనే: కోట్ల
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీనే అని టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. మోదీ సపోర్టు తోనే జగన్ గెలవగలిగారని అన్నారు. ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందని దేశ వ్యాప్తంగా జరుగుతోందన్నారు. మోసాలతో గెలిచిన పార్టీలు ఎక్కువ కాలం ఉండవని వ్యాఖ్యానించారు. శనివారం జిల్లా టీడీపీ సమన్వయం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కోట్ల.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. వైసీపీ దాడులకు టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. వచ్చే జమిలి ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. శ్రీశైలం నీటిని దోచుకుంటున్న కేసీఆర్‌ను జగన్ మంచోడు అని కీర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
* జనసేన బలోపేతంపై పవన్ దృష్టి!-29 నుంచి నేతలతో వరుస భేటీలు
జనసేనను సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా నిన్న పొలిట్‌బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీలను ప్రకటించిన పవన్.. ఈ నెల 29 నుంచి పార్టీ కమిటీలు, నేతలు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు శనివారం మధ్యాహ్నం ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ నిర్మాణంలో భాగంగా క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు.
* వైసీపీ పాలనపై విమర్శల వర్షం కురిపిస్తున్న బీజేపీ
ఎన్నికల ముందు వైసీపీ నేతలను ఒక్క మాట అనని బీజేపీ ఇప్పుడు రూటు మార్చింది. మొన్నటి వరకు టీడీపీ పేరు ఎత్తితేనే భగ్గుమనే రాష్ట్ర బీజేపీ నేతలు.. ప్రస్తుతం వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ సీఎంగా బాధ్యలు చేపట్టి కేవలం రెండు నెలలే అవుతున్నా.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మొన్న కన్నా లక్ష్మి నారాయణ, ఇప్పుడు పురంధేశ్వరి ఇలా కీలక నాయకులంతా వైసీపీని టార్గెట్ చేస్తూ మాటల దాడి పెంచారు.ఏపీ ప్రభుత్వంపై దూకుడు పెంచింది బీజేపీ. వరుస ఆరోపణలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏపీలో బలోపేతమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ఏపీ బీజేపీ కీలక నేతలంతా వరుసగా వైసీపీ పాలనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిని భరించలేకే ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతోందని చెప్పారు.
* కర్ణాటకలో కొత్త ప్రభుత్వం.. బలపరీక్షకు సిద్ధమైన యడియూరప్ప
కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పతనమైన తర్వాత వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించినా.. ఈ దిశగా ఎలాంటి అడుగులూ పడకపోవడంతో రెండు రోజులుగా సందిగ్ధం నెలకొంది. అయితే శుక్రవారం పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ యడియూరప్ప గవర్నర్ వాజుభాయి వాలాను కలిశారు. ఆయన విజ్ఞప్తికి గవర్నర్ సమ్మతించడంతో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.
* అన్ని మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి – కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల కోసం కేడర్ పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని సూచించారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభ్యత్వ నమోదులో ఎక్కడా అలసత్వం చూపొద్దని హెచ్చరించారు. ప్రక్రియ సాగుతున్న తీరుపై అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎక్కడా బీజేపీని లైట్ తీసుకోవద్దన్నారు. బీజేపీ ఒక్క మున్సిపాల్టీలో గెలిచినా కాలర్ ఎగరేసే పరిస్థితి ఉన్నందున.. అన్ని మున్సిపాల్టీల్లో TRS జెండా ఎగరవేయాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని మున్సిపాల్టీల్లో, తాండూరు మున్సిపాల్టీలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణులను హెచ్చరించారు. బీజేపీ బలంగా ఉన్న మున్సిపాలిటీల్లో సభ్యత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
* మొద్దు నిద్రలో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి – చంద్రబాబు
వైసీపీ నేతల దౌర్జన్యకాండపై మరోసారి నిప్పులు చెరిగారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వైసీపీ నాయకుల దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. మొద్దు నిద్రలో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలపై 285 దాడులు జరిగాయన్నారు. 65 ఆస్తుల్ని ధ్వంసం చేశారని, 11 భూకబ్జాలు చేశారన్నారు. 24 చోట్ల కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఏడు హత్యలు జరిగాయని ఆరోపించారు చంద్రబాబు.
*కమ్యూనిస్ట్ పార్టీపై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కమ్యూనిస్ట్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది’ అంటూ తన ట్విటర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. కేశినేనికి చెందిన ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాత బకాయిలు చెల్లించాలని శుక్రవారం నిరసస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది.ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయనపై కమ్యూనిస్ట్‌లు భగ్గుమంటున్నారు. కేశినేని వ్యాఖ్యలను వెనక్కితీసుకుకోవాలని విజయవాడ నగర సీపీఐ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నాని.. తమ పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కార్మికులకు న్యాయం చేసేంత వరకు తమ పారాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా మొన్నటి వరకు టీడీపీ నేతలపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించిన నాని.. తాజాగా కమ్యూనిస్ట్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
*తెదేపాపై బురద చల్లటమే పనిగా సీఎం జగన్ పాలన: కళా
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెదేపాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం పాదయాత్ర సమయంలో మహిళలకు 45 ఏళ్లకు పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాన్ని అమలు చేయమని అడుగుతుంటే ప్రతిపక్షంపై దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఆయనలో అసహనం పెరుగుతోంది. సీఎం స్థాయిలో ఆయన మాట్లాడడం లేదు’అని ఆయన చెప్పారు.
*తెరాస, భాజపా ఒక్కటే: రేవంత్రెడ్డి
తెరాస, భాజపా ఒక్కటేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. భాజపా, మజ్లిస్ పార్టీల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఏ విధమైన లాభం చేకూరుతుందని స.హ.చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభలో తెరాస మద్దతు ఇచ్చిందో చెప్పాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. శుక్రవారం రేవంత్రెడ్డి అసెంబ్లీ మీడియాహాలులో మాట్లాడారు. పారదర్శక పాలన అందించే లక్ష్యంతో యూపీయే సర్కారు తీసుకువచ్చిన స.హ.చట్టం సవరణను మొదట వ్యతిరేకించిన తెరాస..కేసీఆర్కు అమిత్షా ఫోన్ చేసిన వెంటనే ఎలా మనసు మార్చుకున్నారని ప్రశ్నించారు. స.హ.చట్టం కమిషనర్లను గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం సవరణ చేసిందని ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో తెరాస ఎంపీ సంతోష్ కుమార్, కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్లు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో రెండు పార్టీల మధ్య బంధం మరింత బలపడినట్లు అర్థమవుతోందన్నారు.
*ఏపీ భవిష్యత్తు తెలంగాణకు తాకట్టు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సీఎం జగన్ మ్యాచ్ఫిక్సింగ్కి పాల్పడ్డారని ప్రతిపక్షనేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల ఖర్చులకు కేసీఆర్ తనకు నిధులిచ్చినందుకు రాష్ట్ర భవిష్యత్తునే తెలంగాణకు తాకట్టు పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారని మండిపడ్డారు. దీన్ని క్విడ్ప్రోకోగా అభివర్ణించారు. ఆయన గురువారం విజయవాడలోని ఒక హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాలను తెలంగాణ భూభాగం మీదుగా శ్రీశైలం, నాగార్జునసాగర్లకు తీసుకెళ్లాలన్న ప్రతిపాదనను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు రాష్ట్రాల మధ్యా గోదావరి, కృష్ణా జలాల పంపకాలు జరగకుండానే కేసీఆర్ ఇష్టానుసారం జలాల్ని వినియోగిస్తున్నారంటూ, ఆయనను హిట్లర్గా అభివర్ణిస్తూ గతంలో కర్నూలులో జగన్ చేసిన ప్రసంగం వీడియోక్లిప్పింగ్ని ప్రదర్శించారు.
*అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి
ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని..భాజపా ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. వారు దిల్లీలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ, కరీంనగర్లో ఇటీవల అక్బరుద్దీన్ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు.సీఎం స్పందించకుంటే ఆ వ్యాఖ్యలను ఆయన సమర్ధిస్తున్నట్లే అవుతుందన్నారు. తెరాస, ఎంఐఎంలు ఓటు బ్యాంకు కోసమే మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రానున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ స్థానాన్ని ఎంఐఎంకు అప్పగించేందుకే తెరాస యత్నిస్తోందన్నారు. ఎంఐఎం ఉప మేయర్ ఉండగా కరీంనగర్లో గతంలో జరిగిన అరాచకాలను ఎవరూ మర్చిపోలేదన్నారు.హైదరాబాద్లోనూ ముస్లింలను ఎంఐఎం మభ్యపెడుతోందని ఎంపీలిద్దరూ విమర్శించారు.
*ఖమ్మం మేయర్కు వ్యతిరేకంగా 37 మంది సంతకాలు
ఖమ్మం మేయర్ పాపాలాల్కు వ్యతిరేకంగా అధికారపక్ష కార్పొరేటర్లు గురువారం కూడా రహస్య మంతనాలు కొనసాగించారు. నగర పాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. 42 మంది తెరాసకు చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్కు వ్యతిరేకంగా రాత్రి నిర్వహించిన సమావేశానికి 37 మంది హాజరయ్యారు. మేయర్ పాపాలాల్ను గద్దె దించాలని తీర్మానిస్తూ 37 మంది సంతకాలు చేశారు. సమావేశానికి రాని మరో కార్పొరేటర్ తీర్మానంపై శుక్రవారం సంతకం చేస్తానని వెల్లడించినట్లు తెలిసింది.
*రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు
రాష్ట్ర ముఖ్యమంత్రి, శాసనసభాపతి కలిసి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రోహిత్రెడ్డి తెరాసలో చేరిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలంటూ స్థానిక కార్యకర్తలు మూడు రోజులుగా చేస్తున్న నిరసన దీక్ష ముగింపు కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు.
*‘ఇంటింటికి కాంగ్రెస్’ను విజయవంతం చేయండి: ఉత్తమ్
మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు చేపట్టనున్న ఇంటింటికి కాంగ్రెస్, వాడవాడలా కాంగ్రెస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త వారు ఉపయోగించే వాహనాలకు కాంగ్రెస్ జెండా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యకర్తలు ఈ నాలుగు రోజులు వారి ఇళ్లపైన, వాడవాడలో కాంగ్రెస్ జెండాలను ఆవిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
*ఏపీకి ప్రత్యేక రాయితీలు కుదరవు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పన్ను రాయితీలివ్వడం కుదరదని కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసే విధానాలు దేశమంతటికీ ఒకేలా వర్తిస్తాయని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం అమలుచేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలనిచ్చి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తారా? అని గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కడప ఎంపీ అవినాశ్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఏపీలో ఉపాధి కల్పనతోపాటు అభివృద్ధికి మద్దతిస్తాం. ఏపీ నుంచి ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా అన్నింటినీ సానుకూల దృష్టితో స్వీకరిస్తూ ప్రాధాన్యమిస్తాం.
*సర్పంచుల హక్కులను కాలరాస్తున్న కేసీఆర్: డీకే అరుణ
రాష్ట్రంలో సర్పంచుల హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ విమర్శించారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ సర్పంచి, ఉప సర్పంచికి సంయుక్తంగా చెక్ పవర్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసి నెలలు అవుతున్నా ఈ ప్రక్రియ పూర్తి కాలేదని ఆమె నిరసన వ్యక్తం చేశారు
*సవరణ బిల్లు స్వేచ్ఛను హరించదని నమ్ముతున్నా
రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు స్వేచ్ఛను హరించదని తాను నమ్ముతున్నానని తెరాస ఎంపీ కేశవరావు తెలిపారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం సవరణ బిల్లును తొలుత వ్యతిరేకించానని, కేంద్రమంత్రులతో మాట్లాడి అభిప్రాయాలను వివరించానన్నారు. అనంతరం బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
*మున్సిపల్ బిల్లుకు సవరణలు చేయాలి: కె.లక్ష్మణ్
మున్సిపల్ బిల్లుకు గవర్నర్ నరసింహన్ సూచించిన సవరణలను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆర్డినెన్సు రూపంలో మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదన్నారు. చింతమడక గ్రామంలో మాదిరిగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదున్నరేళ్లుగా గ్రామాల్లో సరైన రోడ్డు సదుపాయం లేదని, గర్భిణులను డోలీలలో ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులున్నాయని విమర్శించారు. రెండు పడకగదుల ఇళ్ల కోసం వచ్చిన అంకాపూర్ గ్రామ ప్రజలను అరెస్టు చేయడం తగదని, వారికి వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలని లక్ష్మణ్ సూచించారు.
*ఎన్నికల ప్రతిఫలమేనా ఈ అప్పగింత?
విభజనానంతర సమస్యలు పరిష్కారం కాకుండానే రాష్ట్రానికి చెందిన ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడమేమిటని తెదేపా శాసనసభ్యులు గురువారం శాసనసభలో నిలదీశారు. ‘అక్కడ జరుగుతుంది ద్వైపాక్షిక సంప్రదింపులా? గత ఎన్నికల్లో సాయానికి ప్రతిఫలంగా ఒప్పందాలా?’ అని ప్రశ్నించారు. విభజన చట్టంలో దక్కిన ఆస్తులను తెలంగాణకు ఏపీ ధారదత్తం చేసిందని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనిపై చర్చ- తెదేపా సభ్యుల వాకౌట్కు దారి తీసింది.
*జగన్ కోసం 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఉన్నాం: ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కోసం తలలు తీసి యజ్ఞగుండంలో వేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ..60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామంటూ వ్యాఖ్యానించారు. మరి మిగిలిన 90మంది ఎమ్మెల్యేల సంగతేంటని విలేకరులు ప్రశ్నించగా జగన్పై ప్రేమ ఉన్న వారిలో హెచ్చుతగ్గులుంటాయని చెప్పారు. చంద్రబాబు, తెదేపా పెట్టిన ఇబ్బందులను తాము మరచిపోలేం అని చెప్పారు.
*చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తే.. నేనూ క్షమాపణ చెబుతా : కోటంరెడ్డి
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ‘ఖబడ్దార్’ అంటూ శ్రీధర్రెడ్డి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అసెంబ్లీ లాబీలో విలేకరులతో శ్రీధర్రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఖబడ్దార్ వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ఎమ్మెల్యే పైవిధంగా స్పందించారు. ‘‘చంద్రబాబుకు క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధం. అయితే.. గత సభలో జగన్మోహన్రెడ్డిపై అప్పటి మంత్రులు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు అడ్డగోలుగా చేసిన వ్యాఖ్యలు సరికావని చంద్రబాబు విచారం వ్యక్తం చేయాలి’’ అన్నారు.
*విద్యారంగంలో మార్పు అవసరం: జేపీ
విద్యారంగంలో మార్పులు ఎంతో అవసరమని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ(జేపీ) అభిప్రాయపడ్డారు. గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. విద్యారంగంలో మార్పుల కోసం మదనపల్లె సమీపంలోని రిషివ్యాలీ పాఠశాల నుంచే విద్యాయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అనుభవజ్ఞులు, ఆసక్తి, నిబద్ధత కలిగినవారు స్వచ్ఛందంగా పనిచేస్తారన్నారు. ప్రారంభంలో 25 మంది ఛాంపియన్లతో కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
*జగన్ది ప్రతీకార ధోరణి: కృష్ణమాదిగ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంతృత్వ, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానం చేశారని, ఆయన మరణానంతరం వర్గీకరణపై సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ విజయమ్మ మద్దతు పలికారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటీవల శాసనసభలో చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న ఏపీ అసెంబ్లీని ముట్టడిస్తామని మందకృష్ణ తెలిపారు.
*పోలవరంపై వైకాపా విష ప్రచారం
‘పోలవరం నిర్మాణంలో కాంట్రాక్టు వ్యవస్థపై అసెంబ్లీలో వైకాపా నాయకులు విషప్రచారం చేస్తున్నారు. నేను 1978 నుంచి కాంట్రాక్టు రంగంలో ఉన్నా. యనమల రామకృష్ణుడు మా బంధువైనంత మాత్రాన అదనపు డబ్బులు ఎందుకిస్తారు? అసలు ఆయనకు దీంతో ఏం సంబంధం ఉంది? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే మేం పనులు చేశాం. వైకాపా నాయకులు చేస్తున్న ప్రచారం సత్యదూరం’ అని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షుడు పుట్టా సుధాకర్యాదవ్ స్పష్టం చేశారు. కడపలోని తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
* స్పీకర్ అనర్హత వేటు… సుప్రీం కోర్టుకి రెబల్ ఎమ్మెల్యేలు……..
కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న రెబల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలని రెబల్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు వారు సుప్రీం కోర్టు ను ఆశ్రయించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్. శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్ కుమటహళ్లిలను కర్ణాటక స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ ముగ్గరు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు.