DailyDose

నంబర్ వన్ స్థానంలో జియో-వాణిజ్య-07/27

Jio Ranks Number One - Telugu Business News Today - July 27 2019 - నంబర్ వన్ స్థానంలో జియో-వాణిజ్య-07/27

*అత్యధిక వేగంతో కూడిన 4జీ సేవలతో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో, అంతే వేగంతో మొబైల్‌ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్ని మూడేళ్లలోపే అధిరోహించింది. జూన్‌లో 33.13 కోట్ల మొబైల్‌ కనెక్షన్లతో జియో ఈ ఘనత సాధించింది. 2016 సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. దీని ప్రకారం మూడేళ్లలోపే దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్‌ జియో అవతరించింది.వొడాఫోన్‌ ఐడియా కన్సాలిడేటెడ్‌ నష్టాలు జూన్‌ త్రైమాసికంలో రూ.4,874 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.4,882 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అంటే రూ.8 కోట్ల నష్టాలను తగ్గించుకుంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ రెండూ 2018 ఆగస్ట్‌ 31 నుంచి విలీనమై వొడాఫోన్‌ ఐడియాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికం ఫలితాలతో ఈ ఏడాది *జూన్‌ త్రైమాసికం ఫలితాలను పోల్చి చూడడం సరికాదు. జూన్‌ క్వార్టర్‌లో ఆదాయం మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.11,775 కోట్ల నుంచి రూ.11,270 కోట్లకు తగ్గింది. కొంత మంది కస్టమర్లను కోల్పోవడం, ఉన్న కస్టమర్లలో కొంత మంది తక్కువ విలువ కలిగిన ప్లాన్లకు మారిపోవడం, సగటు యూజర్‌ నుంచి వచ్చే ఆదాయం తగ్గడం (ఏఆర్‌పీయూ) ప్రభావం చూపించాయి. ‘‘మేము చెప్పిన విధానాన్నే ఆచరణలో అమలు చేస్తున్నాం. దీని తాలూకు ఫలితాలు ఇంకా కనిపించలేదు. మా నెట్‌వర్క్‌ అనుసంధానత, కస్టమర్ల డేటా వినియోగ అనుభవం చాలా ప్రాంతాల్లో మెరుగుపడింది’’ అని వొడాఫోన్‌ ఐడియా సీఈవో బాలేష్‌ శర్మ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4జీ కవరేజీ విస్తరిస్తామని, డేటా సామర్థ్యాలను కూడా పెంచుకుంటామని చెప్పారు. జూన్‌ త్రైమాసికంలో రూ.2,840 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టామని కంపెనీ తెలిపింది. కంపెనీ యూజర్ల సంఖ్య 33.4 కోట్ల నుంచి 32 కోట్లకు తగ్గడం గమనార్హం.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ రూ.1,195 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బయోకాన్ ఏకీకృత ప్రాతిపదికన రూ.206.3 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రూ.826.13 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*కంపెనీల చట్టం-2013లోని 16 సెక్షన్లకు సవరణలు చేసి ‘కంపెనీల (సవరణ) బిల్లు’-2019ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
* జూన్తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంబుజా సిమెంట్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.831.75 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో నెలకొల్పిన ప్లాంటు నుంచి తొలి కియా సెల్టోస్ను జులై 31న సిద్ధం చేయనుంది.
*గుండెపోటు, పక్షవాతం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేసే బ్రిలింటా (టికాగ్రెలోర్)కు జెనరిక్ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఉత్పత్తి చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆస్ట్రాజెనెకా అమెరికాలో కేసు వేసింది.
*పంజాబ్ నేషనల్ బ్యాంక్కు కోట్లాది రూపాయలు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ జ్యుడీషియల్ రిమాండ్ను… వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు 22 వరకూ పొడిగించింది.
*బజాజ్ ఫిన్సర్వ్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.845.30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన నికర లాభం రూ.825.80 కోట్లతో పోలిస్తే ఇది 2 శాతం ఎక్కువ.
*గూగుల్, ఫేస్బుక్ సంస్థలపై ఓ కన్నేసి ఉంచాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. భారతీయ వినియోగదారులకు సంబంధించిన ప్రకటనకర్తల నుంచి పొందుతున్న ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నాయని ఈ సంస్థలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అనుమానిస్తోంది.
*మెసేజింగ్ యాప్ వాట్సాప్, చెల్లింపుల సేవలను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. దేశీయంగా 40 కోట్ల మంది చందాదార్లను కలిగిన ఈ సంస్థ, ప్రయోగాత్మకంగా చెల్లింపుల సేవలను గత ఏడాదిలోనే 10 లక్షల మందికి అందుబాటులోకి తెచ్చింది.
*ఎగుమతుల రంగంలో తెలంగాణ వేగంగా పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.56 లక్షల కోట్ల మేర ఎగుమతులతో దేశంలోని మొదటి పది రాష్ట్రాల జాబితాలో నిలిచిందన్నారు.