Food

చిగుళ్ల ఆరోగ్యానికి ఆకుకూరలు

Leafy Greens Are Good For Gum Health - చిగుళ్ల ఆరోగ్యానికి ఆకుకూరలు

ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా వుంటాయి. అందుకే వాటిని రక్షక ఆహారంగా, సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఆకుకూరల్లో ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, రైబోఫ్లొనివ్ యాసిడ్లు పుష్కలంగా వుంటాయి. బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లకోసం ఆకుకూరలు తినాలి.
* విటమిన్ ఎ: ఆకుకూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా వుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల కళ్ల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ తప్పనిసరి. శరీరంలో తగిన మోతాదులో విటమిన్ ఎ లేనట్లయితే కనుగుడ్లు తేమను కోల్పోయి, తెల్లగా కనబడతాయి. పొడిబారతాయి. ఒక్కోసారి కంటిలోని కార్నియా దెబ్బతిని శాశ్వతంగా అంధత్వం లభిస్తుంది. విటమిన్ ఎ కేవలం జంతు సంబంధ ఉత్పత్తులైన వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, గుడ్డులోని పసుపు కాలేయం వంటి వాటిలోనే వున్నప్పటికీ, ప్రకృతి మనకు దానిని బీటా కెరోటిన్ రూపంలో ఆకు కూరల ద్వారా మనకు అందించి రక్షణనిస్తుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. అంతేకాదు పిల్లల్లో శారీరక పెరుగుదలను అధికం చేసి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
* ఇనుము: మన శరీరంలో ఇనుము లోపిస్తే రక్తహీనతకు గురవుతాం. అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. ముఖ్యంగా స్ర్తిలలో, పిల్లలలో రక్తహీనత ఎక్కువగా వుంటుంది. రక్తహీనతవల్ల శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. నెలలు నిండకముందే ప్రసవం జరగడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఇతర శారీరక రుగ్మతలు కలుగుతాయి. కళ్లు తిరగడం, చర్మం పాలిపోవడం, గోళ్లు, ముఖం, నాలుక, పెదవులు పాలిపోవడం వంటివి రక్తహీనతలకు చిహ్నాలు. ఆకుకూరల్లో ఇనుము లభిస్తుంది.
* పీచుపదార్థాలు: ఆహారంలో తీసుకునే పీచు పదార్థాలకు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలున్నాయి. ఆకుకూరల్లో వుండే పీచు పదార్థాలు మలవిసర్జనను సులభం చేసి మలబద్ధకం రాకుండా నివారిస్తాయి.
* గుండె జబ్బుల వంటి సంబంధ వ్యాధులనుండి ఆకు కూరలు మనల్ని కాపాడతాయి.
* రోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా వుండేలా చూసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతికూర, మునగ ఆకులు, ముల్లంగి ఆకులు వంటి ఆకుకూరలు దేశమంతటా భుజిస్తారు.
* ఆకుకూరలు సన్నగా తరిగి, పిండితో కలిసి చపాతీలు, పరాఠాలు చేయవచ్చు.
* ఆకుకూరలు పప్పుతో ఉడికించి తింటే ఆహారంలో మాంసకృతులు పరిమాణం పెరుగుతుంది.
* ఆకుకూరలను వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత తక్కువ నీటిలో, తక్కువ సేపు వుడికించాలి. ఎక్కువగా ఉడికించడంవల్ల వీటిలోని పోషక విలువలు తగ్గుతాయి.
ఇన్ని ఉపయోగాలున్న ఆకుకూరలు మనకు చాలా చవగ్గా లభిస్తాయి. అంతేకాదు చిన్న చిన్న కుండీల్లో, పెరట తోటల్లో పెంచుకోవచ్చు.