నగర జీవి ‘పచ్చగా’ జీవించేందుకు కొంగొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాడు. వ్యవసాయ భూమి కరవైన నగరాల్లో- బాల్కనీలు, మిద్దెలు, వాడిపడేసిన వస్తువులు, ఇంటి ఆవరణల్నే సేద్యపు నేలగా మలుచుకుంటూ.. పలు రకాల పంటల్ని పండిస్తున్నాడు. సొంతింటి ఆహార అవసరాలు తీర్చుకోవడం, వీధి చివరి మార్కెట్లో విక్రయించి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం, స్థానిక కమ్యూనిటీలతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం ఈ పట్నం సాగు ముఖ్యోద్దేశం. ఈ క్రతువుకు కొన్ని కంపెనీలూ ఆధునిక సాంకేతికతను జోడిస్తూ నగర వ్యవసాయానికి నయా సొబగులద్దుతున్నాయి. ప్రపంచంలోని అనేక నగరాల్లో కొనసాగుతున్న ఈ నూతన ఒరవడిపై ప్రత్యేక కథనం..
కిక్కిరిసిన జనాభాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరాల్లో ఆహార భద్రత పెను సవాలుగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు – నగరాల్లోనే అందుబాటులోఉన్న కొద్దిపాటి స్థలంలో.. మిద్దెలపై, బాల్కనీల్లో, కార్యాలయ ఆవరణల్లో తాజా పండ్లు, కూరగాయలు పండించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత కృషి జరుగుతోంది. ఇలా పండించిన పంటల్ని అమ్ముకోవడానికి ఇళ్ల పరిసరాల్లోనే మార్కెట్‌ను ఏర్పాటుచేస్తున్నారు కాబట్టి.. స్థానిక ఆర్థిక వ్యవస్థా బలోపేతమవుతోంది. వినియోగదారులకు తాజా పండ్లు, కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయాన్ని నగర జీవనంలో భాగంగా చేయడానికి వివిధ దేశాల్లో కంపెనీలు, స్థానిక కమ్యూనిటీలు వినూత్న ప్రయోగాలు, ప్రాజెక్టులతో ముందుకొస్తున్నాయి.
టోక్యో(జపాన్) కార్యాలయ వ్యవసాయం
జపాన్‌లో పసోనా గ్రూపు ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. టోక్యోలోని తన ప్రధాన కార్యాలయంలోనే పండ్లు, కూరగాయల మొక్కల్ని పెంచుతోంది. ఇక్కడ సమావేశ మందిరాల పైకప్పులకు టొమాటో మొక్కలు వేలాడుతూ ఉంటాయి. కొత్తిమీర, కరివేపాకు మొక్కలు సమావేశ మందిరాల్లో పెరుగుతుంటాయి. భవన లాబీల్లో వరి కనిపిస్తూ ఉంటుంది. పని ప్రదేశంలో ఉద్యోగులకు ఉపశమనం కలిగించడం, వ్యవసాయం గురించి కొత్తగా ఆలోచించడం, పంటలపై ఉద్యోగులకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పండే పంటల్ని కంపెనీ క్యాంటీన్‌లోనే విక్రయిస్తారు.
సింగపూర్ స్కై గ్రీన్స్
అత్యధిక జనసాంద్రత కలిగిన సింగపూర్‌లో సేద్యానికి భూభాగం కరువు. అదువల్ల ఇక్కడ జాక్ ఎన్‌జీ అనే పారిశ్రామిక వేత్త ‘స్కై గ్రీన్స్’ అనే కొత్త ప్రాజెక్టు ద్వారా పంటలు సాగుచేస్తున్నారు. సన్నటి, పొడవాటి ట్రేలలో ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. స్టీలు కమ్మీలతో తయారుచేసిన ఒక్కో ఫ్రేములో 32 ట్రేలు ఉంటాయి. ఇవి వృత్తాకారంలో పైకీ కిందికీ కదులుతూ ఉండడం వల్ల ప్రతి ట్రే కూ తగిన మొత్తంలో సూర్యరశ్మి అందుతుంది. ఇక్కడ పండే ఆకుకూరలు, కూరగాయల్ని సింగపూర్ మార్కెట్లో అమ్ముతున్నారు.
లండన్ (బ్రిటన్) పెట్టెల్లో పెంచుదాం
చేపల్ని, మొక్కల్ని ఏకకాలంలో పెంచే ప్రాజెక్టును ‘గ్రోఅప్ అర్బన్ ఫార్మ్స్’ అనే కంపెనీ లండన్ నగరంలో అమలుచేస్తోంది. ఇందుకోసం 20 అడుగుల పొడవు, వెడల్పున్న గాజు పెట్టెల్ని వినియోగిస్తోంది. ఈ పెట్టెల్ని నీటితో నింపి అందులో చేపల్ని వదులుతారు. పెట్టెల అంచుల్లో నిలువుగా ఖాళీ స్తంభాల్లాంటి నిర్మాణాల్ని ఏర్పాటుచేసి.. అందులో మొక్కల్ని పెంచుతారు. చేపల ట్యాంకుల్లోని నీటిని ఈ మొక్కల గుండా ప్రవహింపజేస్తారు. చేపల వ్యర్థాలు మొక్కలకు సమృద్ధిగా పోషకాల్ని అందిస్తాయి.
సావొపాలో(బ్రెజిల్) ఏటవాలు పైకప్పులపై సాగు
ఇంటి పైకప్పులు, బాల్కనీలను సారవంతమైన సాగు నేలలుగా మలచడంలో సావొపాలోలోని వ్యవసాయ సాంకేతిక నిపుణుడు మార్కోస్ విక్టోరియానో విజయం సాధించారు. పైకప్పుపై వేసే టైల్స్‌ను ‘వీ’ ఆకారంలో తయారుచేయించారు. ఇవి పొడవుగా ఉండి, మట్టిని నిలిపి ఉంచుతాయి. నీరు ఎక్కడా వృథా కాదు. తేమను పట్టి ఉంచుతాయి కాబట్టి నీరు పెద్దగా అవసరం ఉండదు. ఈ పైకప్పులపై పండించిన పంటల్ని స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు.
మాంట్రియల్(కెనడా) స్థానికతకు పెద్దపీట
స్థానికంగా ఆహార సరఫరా చైన్‌ను అభివృద్ధిచేయడానికి ‘లుఫా ఫామ్స్’ అనే సంస్థ మాంట్రియల్‌లో దాదాపు 1.75 ఎకరాల స్థలంలో రూఫ్‌టాప్ గ్రీన్‌హౌసెస్(మిద్దె పంట)ను ఏర్పాటుచేసింది. ఇందులో ఆకుకూరలు, కొత్తమీర, కరివేపాకు, మిర్చి, వంకాయలు పండిస్తోంది. వీటిని స్థానికంగా దాదాపు 4వేల మందికి విక్రయిస్తోంది.
డర్హమ్(అమెరికా) వ్యవసాయ భవంతి
భవంతిపై పంట పండించి.. అదే భవనంలోనే విక్రయించే సరికొత్త ప్రాజెక్టును అమెరికా ఉత్తర కరొలినాలోని డర్హమ్ నగరంలో అమలుచేయబోతున్నారు. ఇందుకోసం 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతిని నిర్మిస్తారు. భవనం లోపలి భాగాన్ని ఆహార విక్రయానికి వినియోగిస్తారు. భవనం పైభాగంలో పుట్టగొడుగులు, పండ్లు, కూరగాయల్ని పెంచుతారు. ఇప్పటికే ఇలాంటి చిన్న భవనం ఒకదాన్ని బెంజమిన్ గ్రీన్ అనే వ్యక్తి ఈ నగరంలో వినియోగంలోకి తెచ్చారు.
బెర్లిన్(జర్మనీ) కాదేదీ పంటకు అనర్హం
వాడేసిన పాల డబ్బాలు, బియ్యం ఖాళీ సంచులు, ప్లాస్టిక్ పెట్టెలు.. ఇలా వృథాగా పడి ఉన్న రకరకాల వస్తువుల్ని ఉపయోగించి పంటలు పండించే విధానాన్ని జర్మనీలోని బెర్లిన్ నగరంలో అమలుచేస్తున్నారు. ఈ వస్తువుల్లో మట్టిని నింపి.. ఖాళీ ప్రదేశాల్లో ఉంచి.. కూరగాయలు, పూలమొక్కల్ని పెంచుతున్నారు. దీనికి ‘ప్రిన్జెసినెన్‌గార్టెన్’ అని పేరు పెట్టారు.
సియాటిల్(అమెరికా) స్థానికంగా అమ్ముకోవచ్చు
స్థానిక కమ్యూనిటీలే పంటల్ని పండించి.. వాటిని మార్కెట్ చేసే విధానాన్ని అమెరికాలోని సియాటిల్ నగరంలో అమలుచేస్తున్నారు. దీనికి ‘బీకాన్ ఫుడ్ ఫారెస్’్ట అని పేరు పెట్టారు. నగరంలోని సిటీ పార్కుకు ఆనుకుని 7 ఎకరాల స్థలంలో పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాల మొక్కల్ని పెంచుతున్నారు. మరోవైపు నగర వాసులు తమ విశాలమైన ఇళ్ల ఆవరణల్లో, బాల్కనీలు, పై కప్పులపై పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. తేనెను ఉత్పత్తిచేస్తున్నారు. స్థానికంగా నిర్వహించే ‘ఫార్మర్స్ మార్కెట్’లో వాటిని విక్రయిస్తారు. తద్వారా తాజా పండ్లు, కూరగాయలు స్థానికులకు అందుబాటులోకి వస్తాయి.