యూపీలోని ఆగ్రాలో కారుకు దారివ్వలేదని పోలీస్ కానిస్టేబుల్ చేత యూనిఫారం విప్పించిన జడ్జికి హైకోర్టు మొట్టికాయ వేసింది.
యూపీ డీజీపీ ఈ ఉదంతాన్ని ట్వీట్ చేయడానికి తోడు ఆగ్రా ఎస్ఎస్పీ ఈ ఘటనను హైకోర్టుకు విన్నవించిన నేపధ్యంలో సదరు జడ్జిపై బదలీ వేటు పడింది.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మయంక్ కుమార్ జైన్ వెలువరించిన ఆదేశాల మేరకు అడిషినల్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ యాదవ్‌కు బదలీ జరిగింది.
ఆయన పోలీస్ కానిస్టేబుల్ చేత యూనిఫారం విప్పించిన ఘటనను హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది.
దీంతో యాదవ్‌కు మహోబాలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి పూర్తికాలపు సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.
అలాగే ఈ ఆదేశాలు వెంటనే అమలు చేసి, దీనిపై రిపోర్టు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఆగ్రాలో పోలీస్ కానిస్టేబుల్(డ్రైవర్)గా పనిచేస్తున్న ఘూరేలాల్ కోర్టు రూమ్ లోపల తన యూనిఫారం విప్పి, అరగంటపాటు ఉండాల్సి వచ్చింది.
కోర్టుకు వెళ్లే సమయంలో జడ్జి కారుకు దారి ఇవ్వనందుకు ప్రతిగా ఘూరేలాల్ పై ఆగ్రహం వ్యక్తిం చేసిన జడ్జి సంతోష్ కుమార్ యాదవ్ అతనికి ఈ విధమైన శిక్ష విధించారు.
అయితే ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో యూపీ డీజీపీ దీనిపై చర్యలు చేపట్టారు.
సమాచారాన్ని అలహాబాద్ హైకోర్టుకు అందించారు. ఈ నేపధ్యంలో సదరు జడ్జి సంతోష్ కుమార్ యాదవ్‌పై బదలీ వేటు పడింది.