పులి చూపే ఒక గాంభీర్యం. పులి నడకే ఒక రాజసం. పులి ఒక సాహస సంకేతం. పులుల ఉనికి అడవికే ఒక అందం. పులుల మనుగడ ఇప్పుడొక ప్రశ్నార్థకం..*పులులు తారసపడితే ఒకప్పుడు మనుషులు భయంతో వణికిపోయి హడలి చచ్చేవారు. వీలైనంత వరకు పులుల కంటబడకుండా వాటికి దూరంగా ఉండేవారు. క్రమంగా కాలం మారింది. పులులకు భయపడే మనుషులే ఎలాంటి జంకుగొంకు లేకుండా వాటిని వేటాడటం మొదలైంది. నాగరికత ముదిరి ఆధునికత విస్తరించడంతో అడవుల నరికివేత నిత్యకృత్యంగా మారింది. పులులకు సహజ ఆవాసాలైన అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో అడవుల్లో పులుల సంఖ్య దారుణంగా క్షీణించింది. మనుషుల విచక్షణారాహిత్యం ఫలితంగా పులుల్లోని కొన్ని ఉపజాతులు ఇప్పటికే పూర్తిగా అంతరించిపోయాయి.
*ప్రపంచంలో ఇంకా మిగిలి ఉన్న పులులు పూర్తిగా అంతరించిపోకుండా ఉండటానికి వివిధ దేశాల ప్రభుత్వాలు నిషేధాజ్ఞలను అమలులోకి తెచ్చాయి. నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాక పులుల శరీరభాగాలకు, వాటి చర్మానికి మరింతగా గిరాకీ పెరిగింది. నిషేధాలు లేనికాలంలో స్వేచ్ఛగా సాగే పులుల వేట నిషేధాలు అమలులోకి వచ్చాక దొంగచాటుగా సాగుతోంది. పులుల చర్మాలు, గోళ్లు, ఇతర శరీరభాగాలు అక్రమమార్గాల్లో దేశదేశాలకు తరలిపోతున్నాయి. పులుల పరిరక్షణ కోసం దేశదేశాల ప్రభుత్వాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, పులుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది.
***ులులు జంతుజాలంలోని ‘ఫెలిడే’ కుటుంబానికి చెందుతాయి. పిల్లులు కూడా ఇదే కుటుంబానికి చెందుతాయి. ‘ఫెలిడే’ కుటుంబంలో పరిమాణంలో భారీగా కనిపించే నాలుగుజాతుల జంతువుల్లో ఒకటి పులుల జాతి. పులి శాస్త్రీయనామం ‘పాంథెరా టైగ్రిస్’. పులిని ఇంగ్లిష్‌లో ‘టైగర్’ అంటారు. ఈ మాటకు మూలం గ్రీకుపదమైన ‘టైగ్రిస్’. చరిత్రపూర్వ యుగంలో పులులు ఆసియాలోని కాకసస్ నుంచి కాస్పియన్ సముద్ర తీరం వరకు, సైబీరియా నుంచి ఇండోనేసియా వరకు విస్తరించి ఉండేవని వివిధ శాస్త్ర పరిశోధనల్లో తేలింది. పంతొమ్మిదో శతాబ్ది నాటికి పశ్చిమాసియాలో పులులు పూర్తిగా అంతరించాయి. ప్రాచీన పులుల శ్రేణి విడిపోయి పశ్చిమాన భారత్ నుంచి తూర్పున చైనా, ఇండోనేసియా ప్రాంతాల వరకు విస్తరించాయి. పులుల సామ్రాజ్యానికి పడమటి సరిహద్దు సైబీరియాలోని అముర్ నదికి చేరువలో ఉంది. ఇవరయ్యో శతాబ్దిలో ఇండోనేసియాలోని జావా, బాలి దీవుల్లో పులులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పులులు అత్యధిక సంఖ్యలో మిగిలి ఉన్న దీవి సుమత్రా మాత్రమే.
**పులులు ఏనాటివంటే..?
‘ఫెలిడే’ కుటుంబానికి చెందిన ‘పాంథెరా పాలియోసినేన్సిస్’ అనే జంతువులు ఒకప్పుడు చైనా, జావా ప్రాంతాల్లో ఉండేవి. ప్రస్తుతం ఉండే పులుల కంటే పరిమాణంలో ఇవి కొంత చిన్నగా ఉండేవి. ఇవి దాదాపు ఇరవై లక్షల ఏళ్ల కిందట భూమ్మీద సంచరించేవని చైనా, జావాల్లో లభించిన వీటి శిలాజాలను పరీక్షించిన శాస్త్రవేత్తల అంచనా. ‘ట్రినిల్ టైగర్’ (పాంథెరా టైగ్రిస్ ట్రినిలెన్సిస్) అనే ఉపజాతి చైనా, సుమత్రా అడవుల్లో పన్నెండు లక్షల ఏళ్ల కిందట సంచరించేవి. ఇప్పటి పులులకు బహుశా ఇవే పూర్వీకులు కావచ్చు. పూర్వ భౌగోళిక యుగం చివరి దశలో పులులు తొలుత భారత్‌లోను, అక్కడి నుంచి ఉత్తరాసియా, పశ్చిమాసియా ప్రాంతాల్లోను అడుగుపెట్టాయి.
*ఇరవయ్యో శతాబ్ది ప్రారంభమయ్యే నాటికి ఎనిమిది ఉపజాతులకు చెందిన పులులు మిగిలినా, వాటిలో రెండు ఉపజాతులు అంతరించిపోయాయి. 20వ శతాబ్దిలో అంతరించిపోయిన పులుల ఉపజాతుల్లో బాలి పులి, జావా పులి ఉన్నాయి. చిట్టచివరి బాలి పులి 1937 సెప్టెంబరు 27న వేటగాళ్ల చేతిలో బలైపోయింది. అది మధ్యవయసులోనున్న ఆడపులి. జావాపులి చివరిసారిగా 1979లో చూసినట్లు అధికారికంగా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 1990లలో కూడా కొందరు ఈ పులిని చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత జావాపులి జాడ కనిపించలేదు. ఇప్పటికి మిగిలి ఉన్న పులుల జాతుల్లో బెంగాల్ పులి (రాయల్ బెంగాల్ టైగర్), ఇండో చైనీస్ పులి, మలయా పులి, సుమత్రా పులి, సైబీరియన్ పులి, దక్షిణ చైనా పులి మాత్రమే ఉన్నాయి.
**బెంగాల్ పులి
బెంగాల్ పులులు ఎక్కువగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లలో కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో కనిపించే పులుల కంటే ఉత్తరభారత్, నేపాల్‌లలో కనిపించే పులులు పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలి పాతికేళ్లలోనే దేశంలోని పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పులుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం 1972 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ కింద చర్యలు ప్రారంభించింది. దీని అమలు కోసం జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థను (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ప్రారంభించింది.బెంగాల్ పులుల సంఖ్య మన దేశంలో దాదాపు రెండువేల వరకు ఉన్నట్లు వన్యప్రాణుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు భావిస్తున్నా, వీటి సంఖ్య 1411 మాత్రమేనని 2014లో పులుల జనాభా సేకరణ చేపట్టిన జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అధికారికంగా ప్రకటించింది. మన దేశంలో పులుల జనాభాను నాలుగేళ్లకు ఒకసారి లెక్కిస్తారు. ఆ లెక్కన 2018లో కూడా పులుల జనాభా సేకరణ జరిపినా, ఇంతవరకు తాజా లెక్కలను ప్రకటించలేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలోని పులుల సంఖ్యపై ప్రకటనలు చేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది.
*దీంతో తాము అధికారికంగా వెల్లడించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలేవీ పులుల సంఖ్యపై ప్రకటనలు చేయరాదంటూ జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అన్ని రాష్ట్రాలకూ తాఖీదులు పంపింది. ఇదిలా ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిసరాల్లో అణు విద్యుత్తు ఉత్పాదన కోసం యురేనియం తవ్వకాలను తలపెట్టింది. యురేనియం తవ్వకాలు ఇక్కడి పులుల మనుగడకు ముప్పు కలిగించే ప్రమాదం ఉంది. మహారాష్ట్రలో ఇటీవల ఒక రైతు కుక్కలను చంపడానికి చనిపోయిన ఆవుదూడపై విషం చల్లితే, దానిని తిన్న మూడు పులులు మృత్యువాత పడ్డాయి. తెలిసీ తెలియని పొరపాట్లు, విచక్షణలేని చర్యలు పులుల మనుగడకు సవాలు విసురుతున్నాయి.
**ఇండో చైనీస్ పులి
ఇండో చైనీస్ పులులు ఎక్కువగా కంబోడియా, చైనా, లావోస్, బర్మా, థాయ్‌లాండ్, వియత్నాంలలో కనిపిస్తాయి. వీటి జనాభా 1200 నుంచి 1800 వరకు ఉండవచ్చని అంచనా. బెంగాల్ పులుల కంటే పరిమాణంలో ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. వీటికి ఆవాసాలుగా ఉన్న అరణ్యాలు తగ్గిపోవడంతో పాటు, చైనా సంప్రదాయక ఔషధాల తయారీ కోసం ఎడాపెడా వేటాడుతూ పోవడంతో ఇండోచైనీస్ పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
*మలయ పులి
మలయ ద్వీపకల్పంలోని దక్షిణ భాగంలోనే మలయ పులులు కనిపిస్తాయి. ప్రధాన భూభాగపు పులుల ఉపజాతులన్నింటిలోనూ మలయ పులులే పరిమాణంలో చిన్నవి. ఇప్పటికి జీవించి ఉన్న అన్ని పులుల ఉపజాతులనూ తీసుకుంటే, అతిచిన్న పులుల్లో ఇవి రెండోస్థానంలో నిలుస్తాయి. వీటి సంఖ్య దాదాపు 600 నుంచి 800 వరకు ఉండవచ్చని అంచనా. మలయ పులిని మలేసియా ప్రభుత్వం జాతీయ చిహ్నంగా ఉపయోగించుకుంటోంది.
*సుమత్రా పులి
ప్రస్తుతానికి భూమ్మీద మిగిలిన అన్ని పులుల ఉపజాతుల్లోనూ సుమత్రా పులులు అతి చిన్నవి. ప్రస్తుతం ఇవి దాదాపు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వీటి సంఖ్య ప్రస్తుతం 400 నుంచి 500 వరకు ఉండవచ్చని అంచనా.
*సైబీరియన్ పులి
తూర్పు సైబీరియాలోని అముర్–ఉస్సురి ప్రాంతంలో ఇవి సురక్షితంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో మిగిలి ఉన్న అన్ని పులుల ఉపజాతుల్లోనూ ఇవే అతిపెద్దవి. వీటి సంఖ్య దాదాపు 450 నుంచి 500 వరకు ఉంటుందని అంచనా.
*దక్షిణ చైనా పులి
దక్షిణచైనా పులులు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అంతరించిపోయే దశకు చేరుకున్న పది జంతువుల జాబితాలో దక్షణచైనా పులిని కూడా చేర్చారు. పులుల వేటను అరికట్టడానికి 1977లో చైనా ప్రభుత్వం చట్టాన్ని తెచ్చినా, ఈ పులుల ఉపజాతి క్షీణించిపోవడాన్ని నిరోధించలేకపోయింది. దక్షిణ చైనాలో ఈ ఉపజాతికి చెందిన 59 పులులను నిర్బంధంలో ఉంచారు. ఇవి ఆరు పులుల సంతానానికి చెందినవి కావడంతో, వీటిలో జన్యు వైవిధ్యం తక్కువేనని, అందువల్ల ఇవి నశించిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి జనాభాను పెంచేందుకు తిరిగి వీటిని అడవుల్లోకి విడిచిపెట్టాలని వారు సూచిస్తున్నారు.
*తెల్లపులి
తెల్లపులులు ప్రత్యేకమైన ఉపజాతికి చెందినవేమీ కావు. తల్లి పులిలోనూ తండ్రి పులిలోనూ ఒక అరుదైన జన్యువు ఉన్నట్లయితే, వాటికి తెల్లపులులు పుడతాయి. దాదాపు పదివేల పులుల్లో ఒకటి తెల్లగా పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. తెల్లపులులకు జనాకర్షణ ఎక్కువగా ఉండటం వల్ల జంతుప్రదర్శనశాలల్లో సంకరం చేయడం ద్వారా తెల్లపులుల పునరుత్పత్తి కొనసాగేలా చూస్తున్నారు. తెల్లపులులు మామూలు పులుల కంటే తక్కువకాలం జీవిస్తాయి. వీటిలో తరచుగా అంగిలి చీలి ఉండటం, వెన్నెముక వంకరటింకరగా ఉండటం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి.
*బంగారు మచ్చల పులి
బంగారు మచ్చల పులులు కూడా ప్రత్యేకమైన ఉపజాతికి చెందినవి కావు. బెంగాల్ పులుల్లోని ఒక అరుదైన జన్యు పరివర్తనం వల్లనే ఇలాంటి పులులు పుడతాయి. వీటి ఒంటిపై లేత బంగారు రంగులోని ఉన్ని, వెలిసిపోయిన కాషాయ చారలు ఉంటాయి. తెల్లపులులు, బంగారు మచ్చల పులులే కాకుండా, చాలా అరుదుగా నీలం పులులు కూడా కనిపిస్తాయి.
**అడవి పులుల్లో టాప్ – 5
భారత్ 2,226
రష్యా 433
ఇండోనేసియా 371
మలేసియా 250
నేపాల్ 198
(అడవుల్లో సంచరించే పులుల సంఖ్యపై ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ 2014 నాటి లెక్కల ఆధారంగా వెల్లడించిన వివరాలు ఇవి. తిరిగి 2018లో పులుల జనాభా లెక్కల సేకరణ జరిపినా, ఆ లెక్కలను ఇంతవరకు వెల్లడించలేదు.)పులుల సంఖ్యను రెట్టింపు చేసే దిశగా చాలా దేశాలు చర్యలు ప్రారంభించాయి. వీటిలో కొన్ని కొంత పురోగతిని కూడా సాధించా**ి. 2010 నాటి లెక్కలతో పోలిస్తే, భారత్‌లో పులుల సంఖ్య అదనంగా 520 వరకు పెరిగింది. ఇదే కాలంలోరష్యాలో పులుల సంఖ్య అదనంగా 73 మేరకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో సంచరించే పులుల సంఖ్య 2014 నాటి లెక్కల ప్రకారం 3,980 వరకు ఉంది.
**పులుల వేట
రాచరికాలు ఉన్నప్పటి నుంచి పులుల వేట కొనసాగేది. వేటగాళ్లు ఏనుగులు, గుర్రాలపై అడవుల్లోకి వెళ్లి బాణాలు, బల్లేలతో పులులను వేటాడేవారు. వేటాడి చంపి తెచ్చిన పులుల చర్మాలను ఇంటి గోడలకు విజయ చిహ్నాల్లా వేలాడదీసేవారు. పంతొమ్మిది, ఇరవయ్యో శతాబ్దాల్లో పులుల వేట మరింత ఉధృతంగా సాగింది. తుపాకుల వంటివి అందుబాటులోకి రావడంతో సంపన్నులైన కొందరు పులుల వేటను సాహస క్రీడగా సాగించేవారు. మన దేశంలో బ్రిటిష్ హయాంలో పులుల వేట విపరీతంగా కొనసాగేది. వేటాడిన పులుల కళేబరాలను పక్కన పెట్టుకుని ఫొటోలు దిగడం అప్పటి కులీనులకు ఫ్యాషన్‌గా ఉండేది. పులులు జనావాసాల మీద దాడి చేయడం కూడా పరిపాటిగా ఉండేది. జనావాసాలకు పులుల బెడద తప్పించడానికి కూడా పులులను వేటాడేవారు. పులులను వేటాడిన వారికి సమాజంలో భయభక్తులతో కూడిన గౌరవం కూడా ఉండేది.
**భారత్‌లో పులుల వేట ఎంతగా కొనసాగిందంటే కేవలం వందేళ్ల వ్యవధిలోనే పులుల జనాభా 40 వేల నుంచి 1800కు పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్ల తర్వాత ప్రభుత్వం మెలకువ తెచ్చుకుని పులుల సంరక్షణకు నడుం బిగించిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రభుత్వాలు పులుల వేటపై నిషేధాజ్ఞలను అమలులోకి తెచ్చినా, దొంగచాటుగా పులుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. పులుల ఎముకలు, ఇతర శరీర భాగాలను తూర్పు ఆసియా దేశాల్లోని సంప్రదాయ వైద్య చికిత్సల్లో వాడుతుండటమే ఈ వేటకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సంప్రదాయ ఔషధాలను తయారు చేసేవారు ఎంత ధరనైనా చెల్లించి పులుల శరీర భాగాలను కొనుగోలు చేస్తున్నారు. వాటితో తయారు చేసే ఔషధాలను రెట్టింపు లాభాలకు అమ్ముకుంటున్నారు.
****పులుల శరీర భాగాలను ఏయే వ్యాధుల చికిత్సలకు వాడతారంటే…
*పులితోక:
పులితోకను స్కిన్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. పులితోకను మూలికలతో నూరి తయారు చేసిన ఆయింట్‌మెంట్ పూసినట్లయితే స్కిన్ క్యాన్సర్ సహా ఎలాంటి మొండి చర్మవ్యాధులైనా నయమవుతాయని సంప్రదాయ చైనా వైద్యుల నమ్మకం.
*పులి ఎముకలు
పులి ఎముకలను నూరి, వైన్‌లో కలిపి తీసుకుంటే టానిక్‌లా పనిచేస్తుందని తైవాన్ సంప్రదాయ వైద్యుల నమ్మకం. పులి ఎముకలను దుష్టశక్తులను పారదోలడానికి భూతవైద్యులు కూడా ఉపయోగిస్తారు.
*పులికాళ్లు
పులి కాళ్లను పామాయిల్‌లో నానబెట్టి, వాటిని గుమ్మానికి వేలాడదీస్తే ఇంట్లోకి దుష్టశక్తులు చొరబడవని తూర్పు ఆసియా దేశాల్లో చాలామంది నమ్మకం.
*పులిచర్మం
పులి చర్మాన్ని విషజ్వరాలకు విరుగుడుగా ఉపయోగిస్తారు. పులి చర్మాన్ని దీర్ఘకాలం ఉపయోగించే వ్యక్తి పులితో సమానమైన శక్తి పొందుతాడని తూర్పు ఆసియా దేశాల్లో నమ్మకం.
*పులి పిత్తాశయం
పులి పిత్తాశయాన్ని, పిత్తాశయంలోని రాళ్లను తేనెలో కలిపి సేవిస్తే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతారు.
*పులి వెంట్రుకలు
పులి వెంట్రుకలను కాల్చితే వచ్చే పొగ జెర్రులను పారదోలుతుందని నమ్ముతారు. జెర్రులు చేరిన ఇళ్లల్లో తరచుగా పులి వెంట్రుకలను కాల్చడం చైనాలోను, పరిసర తూర్పు ఆసియా దేశాల్లోను ఆచారంగా ఉండేది.
*పులి మెదడు
పులిమెదడును నూనెలో వేయించి, మెత్తగా ముద్దలా నూరి తయారు చేసుకున్న లేహ్యాన్ని ఒంటికి పట్టించుకుంటే బద్ధకం వదిలిపోతుందని, మొటిమలు మొదలైన చర్మవ్యాధులు దూరమవుతాయని నమ్ముతారు.
*పులి కళ్లు
పులి కనుగుడ్లను నూరి తయారు చేసిన మాత్రలు జ్వరాలలో వచ్చే సంధిప్రేలాపనలకు విరుగుడుగా పనిచేస్తాయని నమ్ముతారు.
*పులి మీసాలు
పులి మీసాలను పంటినొప్పులకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
*పులి పంజా
పులి పంజాను మెడలో ఆభరణంలా ధరించినా, జేబులో దాచుకుని తిరిగినా భయాలు తొలగిపోయి, గొప్ప ధైర్యం వస్తుందని నమ్ముతారు. పులి పంజా మొత్తం కాకున్నా, పులి గోళ్లను ధరించినా ఇవే ఫలితాలు ఉంటాయని చెబుతారు.
*పులి గుండె
పులి గుండెను తిన్నట్లయితే పులిలో ఉండే ధైర్యం, తెగువ, తెలివితేటలు వస్తాయని నమ్ముతారు.
*పులి పురుషాంగం
పులి పురుషాంగాన్ని వాజీకరణ ఔషధంగా ఉపయోగిస్తారు.
అమ్మా పులి తల్లి…ఒకసారి గట్టిగా పంజా విసురు
Related tags :