గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దుండగులు డెయిరీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి రెండో అంతస్తులో ఉన్న లాకర్‌ను పగలగొట్టి సుమారు రూ.44లక్షలు ఎత్తుకెళ్లారు. వరుసగా శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులో జమ చేయాల్సిన నగదంతా కార్యాలయంలోనే ఉంచాల్సి వచ్చింది. అయితే, ఈ రోజు సోమవారం కావడంతో బ్యాంకులో జమచేయాలని భావించినప్పటికీ ఈలోపే దొంగలు ఆ డబ్బులు దోచుకెళ్లడం కలకలం రేపింది. ఈ రోజు సిబ్బంది విధుల్లోకి వచ్చాక లాకర్ విరగ్గొట్టి వుండటంతో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఉండే గదిపైనే వున్న లాకర్‌లో ఈ నగదును ఉంచారు. అయితే, లాకర్‌లో ఉన్న ఆ సొమ్మును ఎవరు తీసుకెళ్లారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. దుండగులు ఎవరైనా వచ్చారా? లేదంటే సంస్థలో ఉన్న సిబ్బంది పాత్రేమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భద్రత ఉన్నప్పటికీ ఇంత పెద్ద చోరీ జరగడం డెయిరీ నిర్వాహకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చోరీ ఎలా జరిగిందనే దానిపై సిబ్బంది విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ చోరీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పలు ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అక్కడ ఉన్న సిబ్బందిని ఆరా తీయడంతో పాటు వారి వేలిముద్రలను సైతం సేకరిస్తున్నారు.
ధూళిపాళ్ల సంస్థ నుండి ₹44లక్షలు మాయం
Related tags :