DailyDose

ఫుడ్ డెలివరి వ్యాపారంలోకి అమెజాన్-వాణిజ్య-07/30

Amazon enters food delivery-telugu business news today-july 302019 - ఫుడ్ డెలివరి వ్యాపారంలోకి అమెజాన్-వాణిజ్య-07/30

*అమెజాన్- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని ఆన్ లైన్ వినియోగదారుడు లేడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా అత్యధిక డిస్కౌంట్లను ఇస్తూ అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే ఆన్ లైన్ పోర్టల్ గా ప్రాజాదరణ చూరగొంది. ఇప్పుడు ఈ ఆన్ లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఒకవైపు ఉబర్ ఈట్స్ ను అమెజాన్ కొనుగోలు చేయబోతుంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ అందులో నిజం ఎంతుందో మాత్రం తెలీదు. అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంటర్ అవనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఉద్యోగులను నియమించుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే మార్కెట్లో ఇప్పటికే టాప్ ప్లేయర్లుగా ఉన్న స్విగ్గీ, జొమాటోలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.ఇప్పటికే ఒకరితో ఒకరు పోటీపడుతూ కోట్ల రూపాయలను మార్కెట్లో డిస్కౌంట్ల రూపంలో, యాడ్స్ రూపంలో కుమ్మరించారు. ఓలా కంపెనీ మరో ఫుడ్ డెలివరీ కంపెనీ ఫుడ్ పాండా ను కొనుగోలు చేయడంతో, మార్కెట్లో ఇక లేదు అనుకున్న ఫుడ్ పాండా కొత్త ఊపిరి పోసుకుంది. ఇప్పటికే మార్కెట్లో అనేక కంపెనీలతో చాల పోటీ నెలకొని ఉన్న తరుణంలో, ఇలా అమెజాన్ ఎంట్రీ ఇవ్వనుందన్న వార్తలతో ఆల్రెడీ ఉన్న కంపెనీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి.ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి చెందిన మరో కంపెనీతో కలిసి భారత్ లో తమ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని ప్రారంభించాలని అమెజాన్ భావిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ దసరా దీపావళి పండుగ సీజన్ ప్రారంభానికి ముందే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉంది.దీనివల్ల కొత్త ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం మాత్రమే కాకుండా, కొత్త కస్టమర్లను ఆమెజాన్ వైపు ఆకర్షితులను కూడా చేసి తమ కస్టమర్ బేస్ ను పెంచుకోవాలని కంపెనీ భావిస్తుంది. ఇందుకోసం త్వరలోనే తమ యాప్ లోనే దీన్ని కూడా చేర్చి అన్నీటికీ ఒకటే యాప్ ని వినియోగదారులకు అందించనుంది. ఇలా చేయడం ద్వారా వినియోగదారులకు సేవలను సులభతరం చేయవచ్చని అమెజాన్ ఆలోచిస్తుంది.ఇప్పటికే అత్యధిక డిస్కౌంట్లను అందిస్తుంది అని పేరున్న అమెజాన్ ఇదే స్ట్రాటజీని కొనసాగించి సక్సెస్ అవ్వాలని భావిస్తుంది. ఏది ఏమైనా, ఇప్పటికే నెలకొని ఉన్న కాంపిటీషన్ వల్ల ఇబ్బడి ముబ్బడిగా డిస్కౌంట్లు ఆఫర్లు ఇస్తున్న ఫుడ్ డెలివరీ కంపెనీలు మరిన్ని డిస్కౌంట్లను మాత్రం కస్టమర్లకు అందించక తప్పదురాబోయే మరి కొన్ని నెలలపాటు వినియోగదారులు అతి తక్కువ ధరలకే తమకు నచ్చిన రెస్టారెంట్ల నుండి తమకు తినాలనిపించిన ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు వెయిటింగ్ ??? ఎంజాయ్ ఆర్దరింగ్…
* మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ వస్తోంది..
వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి మాస్‌ మార్కెట్‌ లక్ష్యంగా రూపొందించిన చిన్న ఎస్‌యూవీ ‘ఎస్‌–ప్రెస్సో’ త్వరలో రోడ్డెక్కనుంది. సెప్టెంబరులో ఈ కారు విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్‌ నోయిడాలో గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పో సందర్భంగా మారుతి సుజుకి కాన్సెప్ట్‌ కారును ప్రదర్శించింది. కంపెనీ నుంచి ఇదే అతి చిన్న ఎస్‌యూవీ కావడం గమనార్హం. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వితారా బ్రెజ్జా కంటే ఇది చిన్నగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ కోరుకునేవారికి ఇది బెస్ట్‌ చాయిస్‌గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. బీఎస్‌–6 ప్రమాణాలతో 1.2 పెట్రోల్‌ ఇంజన్, 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకుంది. ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) మోడల్‌ కూడా రానుంది. సీఎన్‌జీ వేరియంట్‌ను సైతం రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనుంది. బేస్‌ వేరియంట్‌ రూ.5 లక్షల లోపు ఉండే అవకాశముంది. వేరియంట్‌నుబట్టి ధర రూ.8 లక్షల దాకా ఉండొచ్చు. యువతను దృష్టిలో పెట్టుకుని మోడర్న్‌ స్టైలింగ్, క్యాబిన్‌ ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఆధునిక టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్‌ వంటివి అదనపు హంగులు.
*మనదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌‌బీఐ..ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లపై (ఎఫ్‌‌డీ)లపై వడ్డీ రేట్లును తగ్గించింది. పెద్ద డిపాజిట్లకూ కోత వర్తిస్తుందని తెలిపింది. 7–45 రోజుల మధ్య ఎఫ్‌‌డీలపై వడ్డీరేటును 75 బేసిస్‌‌ పాయింట్ల వరకు తగ్గించింది. మిగతా కాలపరిమితుల ఎఫ్‌‌డీల వడ్డీరేట్లను 20 బేసిస్‌‌ పాయింట్ల వరకు తగ్గించింది. వచ్చే నెల నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. రూ.రెండు కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన ఎఫ్‌‌డీలపై ఇది వరకు ఎక్కువ వడ్డీ ఇచ్చారు. ఇక నుంచి వీటికి కూడా సాధారణ డిపాజిట్ల వడ్డీయే చెల్లిస్తారు. ఏడాది–రెండేళ్ల కాలపరిమితి గల బల్క్‌‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను మాత్రం మార్చలేదు. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెరగడం, వడ్డీరేట్లు తగ్గడంతో ఎస్‌‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల ఆర్‌‌బీఐ రెపోరేటును 25 బేసిస్‌‌ పాయింట్ల తగ్గించడం తెలిసిందే. దీంతో ఐసీఐసీఐ, కోటక్‌‌, ఆక్సిస్‌‌ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి.
*కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. ఈ కామర్స్ సంస్థ ప్లిప్‌కార్ట్‌లో పలు స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. జులై 31 వరకు అందుబాటులో ఉన్న ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు బంపరాఫర్లు పొందవచ్చు. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.8,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.19,999. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో 5 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 5.9 అంగుళాల స్క్రీన్, డ్యూయెల్ రియల్ కెమెరా (16ఎంపీ+2 ఎంపీ), డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా (13 ఎంపీ+2 ఎంపీ),3340 ఎంఏహెచ్ బ్యాటరీ, కిరిన్ 659 ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుదారులు 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి కూడా 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అదే ఎక్సేంజ్ రూపంలో ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే రూ.8,900 వరకు తగ్గుతుంది. కాగా, నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌పై 60 శాతం వరకు తగ్గింపు ధరకు అందిస్తోంది. నోకియా 6.1 ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.7,999గా ఉంది. దీని అసలు ధర రూ.20,095.
*కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేములలో విషాదం చోటుచేసుకుంది. విషగ్రాసం తిని 25 ఆవులు మృతి చెందాయి. మరో 200 ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. శ్రీను అనే రైతుకు మూడు వందల ఆవులు ఉండగా కృష్ణా నదీ తీరంలో మేతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషగ్రాసం తిన్న ఆవుల్లో 25 స్పాట్‌లోనే చనిపోయాయి. ఎవరో కావాలనే విషం కలిపి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
* 20శాతం కుంగిన కాఫీ డే షేర్లు
నేటి ట్రేడింగ్‌లో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 20శాతం కుంగాయి. దీంతో లోయర్‌ సర్క్యూట్‌ మార్కు అయిన 154.05ను తాకింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ సోమవారం అదృశ్యం కావడంతో మదుపర్లలో ఆందోళన వ్యక్తమైంది. ఉదయం 9.50 సమయంలో స్టాక్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. నిన్న సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తర్వాత కన్పించకుండా పోయారు. దీంతో ఆయన ఏమయ్యారన్నది అంతు చిక్కకుండా పోయింది.
*ఆగస్టు 12న జియోఫైబర్‌ వివరాలు?
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 12వ తేదీన కీలక ప్రకటన చేయవచ్చని బ్యాంక్‌ ఏఎం-మెరిల్‌ లించ్‌ పేర్కొంది. జియో ఫైబర్‌ ప్రారంభం, ప్యాకేజీ ధరల వివరాలను ఏజీఎంలో వెల్లడించే అవకాశం ఉందని తెలిపింది. ‘‘ జియో ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ వ్యాపారానికి సంబంధించిన కీలక సమాచారాన్ని 42వ వాటాదారుల వార్షిక సమావేశంలో వెల్లడించనున్నారని భావిస్తున్నాం. రిలయన్స్‌ కూడా జియో ఫైబర్‌ వాణిజ్య ప్రారంభానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. ’’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా-మెరిల్‌ లించ్‌ పేర్కొంది.
* హోండా కార్ల రీకాల్‌
జపాన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజం హోండా భారత్‌లో 5,088 కార్లను రీకాల్‌ చేసింది. వీటిల్లో పాత తరానికి చెందిన జాజ్‌, సిటీ, సీఆర్‌-వీ, సివిక్‌, అకార్డ్‌ మోడళ్ల వాహనాలు ఉన్నాయి. గతంలో వీటికి అమర్చిన టకాట ఎయిర్‌బ్యాగ్‌లను మార్చడం కోసం వీటిని రీకాల్‌ చేశారు. ఈ విషయాన్ని హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకటించింది. ప్రస్తుతం రీకాల్‌ చేసిన వాహనాల్లో 2007-13 మధ్య తయారు చేసిన 2,099 సిటీ సెడాన్‌ మోడల్‌ , 2003-08 మధ్య, 2011లో తయారు చేసిన సీఆర్‌-వీ మోడల్‌, 2003లో తయారు చేసిన 350 అకార్డ్‌ కార్లు ఉన్నాయి.
*రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే ఆసియాలోనే అపరకుబేరుడిగా నిలిచిన ఆయన.. తాజాగా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంత సారథుల్లో ఒకరిగా చోటు సంపాదించారు. 2019 సంవత్సరానికి సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ ఈ నివేదికను రూపొందించింది.
*తన, తన కుటుంబసభ్యుల ఆధీనంలోని కంపెనీల ఆస్తులు జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను ఆగస్టు 2న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. మాల్యా తరఫున సీనియర్ న్యాయవాది ఎఫ్ఎస్ నారిమన్ వేసిన పిటిషన్ను అనుమతిస్తూ ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ నిర్ణయం తీసుకుంది.
* డిపాజిట్ రేట్లు తగ్గిస్తున్నట్లు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. కొత్తరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 179 రోజుల వరకు ఉన్న వేర్వేరు కాలావధి డిపాజిట్లపై రేటును 50-75 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నామని సోమవారం ప్రకటించింది.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థిరాస్తి దిగ్గజం డీఎల్ఎఫ్ రూ.414.72 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.172.77 కోట్లతో పోలిస్తే ఇది 240 శాతం అధికం కావడం విశేషం. మొత్తం ఆదాయం రూ.1,657.67 కోట్ల నుంచి రూ.1,540.95 కోట్లకు తగ్గింది. రూ.296.51 కోట్ల అసాధారణ ఆదాయం రావడంతో నికర లాభం బాగా పెరిగిందని కంపెనీ పేర్కొంది.
* దేశీయంగా అధికవేగం ఉచిత వైఫై జోన్ల (జిస్టేషన్) ఏర్పాటుకు అమెరికా సాంకేతిక దిగ్గజం గూగుల్, నెట్వర్కింగ్ అగ్రగామి సంస్థ సిస్కో చేతులు కలిపాయి. ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో ఈ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ఇందుకోసం నెట్వర్కింగ్ మౌలిక వసతులను సిస్కో సమకూరుస్తుంది.
*సూచీల లాభాలు ఒక్కరోజు ముచ్చటగా మారింది. విద్యుత్ వాహనాలపై పన్ను తగ్గించడం, పాత, కొత్త వాహన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో వాహన షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సూచీలు మళ్లీ డీలాపడ్డాయి.
*ఇండియాబుల్స్ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం 5-10 శాతం క్షీణించాయి. నేషనల్ హౌసింగ్బ్యాంక్ (ఎన్హెచ్బీ) నిధులు రూ.లక్ష కోట్లకు పైగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ దుర్వినియోగం చేసిందని, రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్నందున, దీనిపై విచారణ జరపాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భాజపా నాయకుడు, పార్లమెంటు సభ్యుడు సుబ్రమణ్య స్వామి లేఖ రాయడం ఇందుకు నేపథ్యం. 14 ఏళ్లకు పైగా ఇండియాబుల్స్ గ్రూప్ నిధులు మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు.
* పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు దాఖలు చేసే పద్ధతిలో ఒక మార్పు చోటుచేసుకుంది. ఇకపై రిటైల్ మదుపరులు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఆధారిత యాస్బా (అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) ద్వారానే పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేసుకోవాలి.
*డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.663 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.