Movies

విలేఖరుల పోరు పడలేక

Bigg Boss 3 Eliminated Hema Calls For Press Meet - విలేఖరుల పోరు పడలేక

బిగ్‌బాస్‌ సీజన్‌-3 హౌస్‌లోని వారిలా తనకు నాటకాలు ఆడటం రాదని నటి హేమ అన్నారు. కొత్త జనరేషన్‌ తనను సరిగా అర్థం చేసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో తొలివారం ఓట్ల ఆధారంగా హేమను ఎలిమినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని షో వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున ప్రకటించడంతో ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడారు. కాగా హౌస్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత హేమ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. హౌస్‌లో జరిగిన విషయాల గురించి ప్రస్తావించారు. ‘నాకు చాలా మంది వ్యక్తిగతంగా ట్వీట్లు, మెసేజ్‌లు చేశారు. కొందరు మద్దతు తెలిపారు. చాలా సంతోషంగా అనిపించింది, ఎనర్జీ వచ్చింది. నేను హౌస్‌లో ఉన్న వారం రోజుల్లో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఒకవేళ పూర్తిగా గేమ్‌లోకి వెళ్లి ఉంటే తప్పు చేసేదాన్నేమో. కానీ ముందే బయటికి వచ్చేశాను. కొన్ని విషయాల్ని బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు చూపించలేదు. నాకు వంట సెక్షన్‌ ఇచ్చారు. నేను సరుకుల్ని పొదుపుగా వాడి, అందరికీ భోజనం పెట్టాలి. దీంతో వంటగదిలోకి రావొద్దని మిగిలిన వారికి చెప్పా. అది వాళ్లకు నచ్చలేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్‌ పిల్లలు మనం చెప్పింది వినరు, అర్థం చేసుకోరు. 14 మందికి వండాలి. వాళ్లంతా నాకు సలహాలు ఇస్తుంటే నేనెలా సక్రంగా చేయాలి. అక్కా అక్కా అంటూ నన్నే టార్గెట్‌ చేశారు (నవ్వుతూ). నాకైతే హౌస్‌పైన ఫిర్యాదులు లేవు. మిగిలిన వారిలా నాకు నటించడం రాలేదు’. ‘బిగ్‌బాస్ మొదటి సీజన్‌కి రమ్మని నన్ను అడిగారు. రానని చెప్పా. రెండో సీజన్‌లో పాల్గొనమని నా వద్దకు రాలేదు. మూడో సీజన్‌కు వచ్చారు. నేను పారితోషికం డిమాండ్‌ చేసే హౌస్‌లోకి వెళ్లాను. ఇలాంటి షోనే ఎదుర్కోలేకపోతే ఎలా అనుకుని వెళ్లా. కేవలం ఒక వారంలో ఎంతో నేర్చుకున్నా. ఎలా మాట్లాడాలి, నటించాలో అర్థమైంది. వారి ముందు నా 30 ఏళ్ల నటనా జీవితం వృథా (నవ్వుతూ). వాళ్ల ముందు నేను జీరో అని అర్థమైంది. అది బిగ్‌బాస్‌ హౌస్‌.. ఏమైనా జరగొచ్చు. నేను హౌస్‌లోనూ నటిస్తే జనాలు నన్ను తిడుతారు. హౌస్‌లోని వారు గేమ్‌ ఆడి, గెలవాలి అనుకుంటున్నారు. అందులో తప్పులేదు. అది షో మాత్రమే’. ‘నాకు బిగ్‌బాస్‌ హౌస్ నచ్చింది. పిల్లలు (కంటెస్టెంట్స్‌) కూడా నచ్చారు. నాగార్జున గారు ఇంకా నచ్చారు. ఎలిమినేట్‌ చేసినందుకు నేనేమీ ఏడ్వలేదు. నాకు మీరు అంత సమయం కూడా ఇవ్వలేదు. హౌస్‌ నుంచి బయటికి రావడం ఆలస్యం ఇంటర్వ్యూలని (మీడియాను ఉద్దేశిస్తూ) వెంటపడ్డారు. అందుకే మీ అందరి కోసం ఒకేసారి ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాను’. అనంతరం ఓ విలేకరి.. వైకాపాలో చేరుతున్నారా? అని ప్రశ్నించగా.. ‘ఆ విషయం త్వరలోనే ప్రకటిస్తా. నాకు జగన్‌ అంటే ఇష్టం. నేను మానసికంగా ఇంకా బలంగా తయారు కావాలి. అప్పుడే దేన్నైనా ఎదుర్కోగలను. ఆ తర్వాతే పార్టీలోకి వెళ్తాను. ఒక్కసారి ముందుకు వెళ్లిన తర్వాత మళ్లీ వెనక్కి రాకూడదు. నేను సినిమాల్లో నటించడం మానేస్తున్నానని వార్తలు వచ్చాయి. నేనెందుకు మానేస్తా. కొన్ని రోజులు షూటింగ్‌ చేస్తా. మరికొన్ని రోజులు నా పనులు చేసుకుంటా. ఇంటి బాధ్యతల్ని నా కుమార్తెకు అప్పగించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తాను’ అని చెప్పారు.