ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘కేఫ్ కాఫీ డే’ సృష్టికర్త ఆయన. కాఫీ ప్రపంచంలో సరికొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చిన గొప్ప వ్యాపారవేత్త. కాఫీ సాగు కుటుంబంలో పుట్టి ‘కాఫీ కింగ్’ స్థాయికి ఎదిగిన వ్యక్తి.. ఒకప్పుడు సక్సెస్‌కు చిరునామా.. కానీ నేడు తానో విఫల వ్యాపారినంటూ ఆత్మన్యూనతతో కుంగిపోతున్న వ్యక్తి. అనతికాలంలోనే కాఫీ విజయాన్ని రుచి చూసిన వి.జి. సిద్ధార్థ.. నేడు ఊహించని రీతిలో అదృశ్యమయ్యారు.
ఎవరీ సిద్ధార్థ..
కర్ణాటకలోని చిక్‌మగుళూరు జిల్లాలోని ఓ కాఫీ సాగు కుటుంబంలో పుట్టారు సిద్ధార్థ. ఈ కుటుంబం గత 140 ఏళ్లుగా కాఫీ పంటలు పండిస్తోంది. మంగళూరు యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన సిద్ధార్థ.. తన కెరీర్ తొలినాళ్లలో స్టాక్‌మార్కెట్‌లో పనిచేశారు. ముంబయిలోని జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా వ్యవహరించారు. అప్పుడు ఆయన వయసు 24 ఏళ్లు. రెండేళ్ల తర్వాత తిరిగి బెంగళూరు వచ్చిన సిద్ధార్థ.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
తొలుత కాఫీ ఎగుమతి నుంచి..
1984లో శివన్ సెక్యూరిటీస్ అనే సంస్థను కొనుగోలు చేసిన సిద్ధార్థ.. అనతి కాలంలోనే దాన్ని విజయవంతమైన పెట్టుబడి బ్యాంకింగ్‌గా తీర్చిదిద్దారు. అయితే సిద్ధార్థ కుటుంబానికి 12వేల ఎకరాలకు పైగా కాఫీ తోటలు ఉన్నాయి. ఆ కాఫీ గింజలను ఎవరికో అమ్మే బదులు తానే రిటైల్ మార్కెట్లోకి ఎందుకు రాకూడదని అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే అమాల్గమేటెడ్ బీన్ కాఫీ ట్రేడింగ్ కంపెనీ. 1992లో ప్రారంభించిన ఈ సంస్థ.. కాఫీ గింజలను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. రెండేళ్లలోనే దేశంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా ఈ కంపెనీ ఎదిగింది. ఆ తర్వాత 1996లో బెంగళూరులోని అత్యంత రద్దీ అయిన బ్రిగేడ్ రోడ్‌లో ‘కేఫ్ కాఫీ డే’ పేరుతో తొలి రిటైల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు సిద్ధార్థ. అప్పట్లోనే ఇక్కడ ఒక కాఫీ, గంట ఇంటర్నెట్‌కు రూ.100 ఛార్జ్ చేసేవారు. ఈ అవుట్‌లెట్ విశేషాదరణ పొందింది. దీంతో ఇతర ప్రాంతాలకూ దీన్ని విస్తరించారు.
దేశంలోనే అతిపెద్ద కాఫీ చైన్..
ప్రస్తుతం భారత్‌లో కేఫ్ కాఫీ డే పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అన్ని ప్రధాన నగరాల్లో ఈ కంపెనీ అవుట్‌లెట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1700 కెఫేలు, 48,000 వెండింగ్ మిషన్లు ఉన్నాయి. వియన్నా, చెక్ రిపబ్లిక్, మలేషియా, నేపాల్, ఈజిప్టు లాంటి దేశాల్లోనూ కాఫీడే శాఖలు ఉన్నాయి. అలా తక్కువ కాలంలోనే కాఫీ డేకు మంచి గుర్తింపు లభించింది. కాఫీ కింగ్‌గా సిద్ధార్థ్ పేరు మార్మోగింది. కాఫీడేతో పాటు హాస్పిటాలిటీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు.
మైండ్ ట్రీలో వాటాలు..
కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న సమయంలోనే సిద్ధార్థ ప్రముఖ ఐటీ సంస్థ మైండ్ ట్రీలో పెట్టుబడులు పెట్టారు. 1999లో రూ. 340కోట్లతో వాటాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాదే మైండ్‌ట్రీలో వాటాలను రూ.3000 కోట్లకు అమ్మేశారు.
మాజీ సీఎంకు అల్లుడు..
కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం కృష్ణ కుమార్తె మాళవిక కృష్ణను సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మాళవిక.. సిద్ధార్థ కంపెనీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటారు. 2008 నుంచి సిద్ధార్థకు చెందిన హాస్పిటాలిటీ బిజినెస్ పూర్తి బాధ్యతలు ఈమే నిర్వర్తిస్తున్నారు. కాఫీడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోనూ ఆమె ఒక సభ్యురాలు.
పన్ను ఎగవేత ఆరోపణలు..
ఇలా కెరీర్ హాయిగా సాగిపోతున్న సమయంలో సిద్ధార్థ పన్ను ఎగవేత రూపంలో వివాదాల్లో చిక్కుకున్నారు. కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో 2017లో ఆయన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది. ముంబయి, బెంగళూరు, చెన్నై, చిక్‌మగుళూరులోని కాఫీ డే దుకాణాలు, ఎస్టేట్‌లపై అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 650కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరోవైపు కేఫ్ కాఫీ డే గత కొంతకాలంగా నష్టాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీలో కొంత వాటాను కోకాకోలాకు విక్రయించాలని సిద్ధార్థ అనుకున్నారు. ఇందుకోసం చర్చలు కూడా జరిగాయి.
ఐటీ వేధింపులు, ఆర్థిక ఇబ్బందులే అదృశ్యానికి కారణమా..?
సోమవారం సాయంత్రం సిద్ధార్థ ఉన్నట్టుండి కన్పించకుండా పోయారు. సక్లేశ్‌పూర్ వెళ్తున్నాని ఇంట్లో వాళ్లకు చెప్పి బయల్దేరిన ఆయన.. మార్గమధ్యంలో కారును మంగళూరువైపు తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పారు. అక్కడ నేత్రావతి నది వంతెన వద్ద కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆయన అదృశ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. కన్పించకుండా పోవడానికి ముందు సిద్ధార్థ తన కంపెనీ ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. అందులో తాను ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి ఎదుర్కొంటున్నానని పేర్కొనడం గమనార్హం. ప్రైవేటు ఈక్విటీ భాగస్వాముల్లో ఒకరు తనను షేర్ల బైబ్యాక్ చేయాలని బలవంతం చేస్తున్నట్లు సిద్ధార్థ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం తాను ఓ స్నేహితుడి నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఆయనకు ఇచ్చానని తెలిపారు. సుదీర్ఘకాలం సమస్యలతో పోరాడానని, ఇక ఓపిక లేదని సిద్ధార్థ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ అదృశ్యం మిస్టరీగా మారింది.