‘మెగాస్టార్’ చిరంజీవి నుంచి కొత్త సినిమా వస్తుందంటే అభిమానులకు సంక్రాంతి పండగ వచ్చినట్లే. థియేటర్లన్నీ కళకళలాడిపోతాయి. ఒకప్పుడైతే టికెట్ల కోసం అభిమానులు థియేటర్ల ఎదుట తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాసేవారు. చిరు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన డ్యాన్స్‌లు, ఫైట్స్. మాస్‌లో ఆయనకు ఎనలేని క్రేజ్ ఉంది. చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మాస్ మసాలా సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటి. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి తన సినిమాలకు సంబంధించి కథ, కథనం, డ్యాన్స్‌లు, ఫైట్స్ తప్ప మిగిలిన విషయాల్లో పెద్దగా తలదూర్చరు. అయితే, ‘గ్యాంగ్ లీడర్’లో కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. సీనియర్ నటుడు నారాయణరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ‘‘విజయ బాపినీడు-చిరంజీవి ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆ సమయంలోనే ‘గ్యాంగ్ లీడర్’ కథ సిద్ధమైంది. అందులో చిరు స్నేహితుడిగా నాకు మంచి వేషం ఇచ్చారు. దాదాపు సగం సినిమా చూసిన తర్వాత చిరు రషెస్ వేసుకుని చూశారు. ‘అనుకున్న దానికంటే బాగా రాలేదు బాపినీడుగారు’ అని చిరంజీవి అంటే, ‘మీరు కూడా ఓ చేయి వేస్తే బాగుంటుంది’ అని బాపినీడు కోరారు. నాకు తెలిసి అప్పటివరకూ చిరంజీవి డ్యాన్స్‌లు, ఫైట్లు తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. కథ విన్నప్పుడే మార్పులు చేర్పులు చెప్పేసేవారు. కానీ, ‘గ్యాంగ్ లీడర్’ సినిమా దాదాపు 40శాతం చిరంజీవి రీషూట్ చేశారు. మురళీమోహన్‌ను హత్య చేసే సన్నివేశం, ఆయన స్నేహితులమైన మమ్మల్ని వెంటాడి చంపే సీన్లు అవన్నీ చిరు తీశారు. అప్పటివరకూ గొప్ప నటుడు ఉన్నాడని మాత్రమే నాకు తెలుసు. కానీ, అది చూసిన తర్వాత ఆయనలో ఓ గొప్ప దర్శకుడు కూడా ఉన్నాడని అర్థమైంది. ఈ విషయం ఎక్కడా ఎవరికీ చెప్పుకోలేదు. ఆ తర్వాత నేను కూడా చాలా సార్లు డైరెక్షన్ చేయాలని చెప్పా. తనకు ఇష్టం లేదని చెప్పేవారు. ఒక విధంగా చెప్పాలంటే తెర మీద పేరు పడని దర్శకుడాయన’’ అని చెప్పుకొచ్చారు.
గ్యాంగ్‌లీడర్‌లో మురళీమోహన్ హత్యకు దర్శకత్వం చిరుదే
Related tags :