* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది. మంగళవారం నాడు అసెంబ్లీ లాబీల్లో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు ఎదురుపడ్డారు. ఈ సమయంలో వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. రోజా ప్రసంగాల్లో మునుపటి ఫైర్ లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. అయితే సభలో చంద్రబాబునాయుడు లేకపోవడం వల్లే తన ప్రసంగంలో వాడి తగ్గిందని రోజా అభిప్రాయపడ్డారు.సభలో చంద్రబాబు ఉంటే ఆటోమెటిక్ గా తన స్పీచ్ ఫ్లో పెరుగుతుందని రోజా పయ్యావులకు చెప్పారు. అదే సమయంలో పయ్యావులపై రోజా సరదాగా కామెంట్స్ చేశారు. సభలో చంద్రబాబు లేని సమయం చూసి సీఎం జగన్ ను పయ్యావుల కేశవ్ పొగిడారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తమ పార్టీ తీసుకురావాలనుకొన్న బిల్లును తెచ్చినందునే తాను ఆ రకంగా మాట్లాడానని పయ్యావుల కేశవ్ చెప్పారు. ఇదిలా ఉంటే రోజా మౌనం వెనుక మరేదైనా కారణం ఉండి ఉండొచ్చని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు.
1. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 14 రోజులపాటు జరిగిన సమావేశాల్లో 20 కీలక బిల్లులపై సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. మంగళవారం వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రసంగం అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. పేద ప్రజల సంక్షేమమే ప్రధానంగా సాగిన అసెంబ్లీ ఈ సమావేశాలు ఎంతో చారిత్రాత్మకమైనవని అన్నారు. సమావేశాల్లో బిల్లులపై సభ్యులంతా సుధీర్ఘంగా చర్చించడం శుభపరిణామం అన్నారు.
2. పార్లమెంట్ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్- అసెంబ్లీలో మంత్రి అవంతి శ్రీనివాస్ రావు
పార్లమెంట్ నియోజకర్గానికి ఒక స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు. చివరి రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి సెల్ఫ్ గోల్ చేసుకోవడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చేవరకు టీడీపీకి నిరుద్యోగ భృతి గుర్తుకు రాలేదన్నారు. ఏపీలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, 4 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించారన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు.
2.ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రభుత్వ భూముల అక్రమాలపై సభా సంఘం ఏర్పాటు చేయాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండు చేశారు. పీలేరులో ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, అధికారులు కలిసి రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. పీలేరులో భూములు ఎకరా రూ.3, 4 కోట్లు పలుకుతుందని, దీని వెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉందన్నారు. టీడీపీ నేతలు నకిలీ పట్టాలతో డబ్బులు వసూలు చేశారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని కోరారు. ఎయిర్‌పోర్టుకు ప్రభుత్వ,ప్రైవేట్ భూములు తీసుకున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
3.7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు
గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఏంఏవై) కింద 7లక్షల ఇళ్లను మంజూరు చేసుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టిందని మంత్రి బొత్ససత్యానారాయణ తెలిపారు. చివరి రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడారు. 3 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టినప్పటికి ఒక్క ఇళ్లు కూడా లబ్దిదారుడికి అందలేదన్నారు. 300,325,430 ఎస్‌ఎప్టీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. వీటి నిర్మాణానికి షేర్‌వాల్ టెక్నాలజీకి గరిష్టంగా చదరపు అడుగుకు రూ.2,311 చెల్లించారని తెలిపారు. ఈ తరహా విధానాలతో పేదలపై రుణభారం పడిందన్నారు. గృహ నిర్మాణంలో మూడు కంపెనీలకే అత్యధిక కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారని, వీటిపై రివర్స్ టెండరింగ్ వెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ పాదయాత్రలో చెప్పిన విషయాలు వాస్తవమని తెలిపారు. ఈ విషయంలో సభ్యులకు సందేహాలుంటే సంబంధిత ఫైల్స్ కూడా చూపిస్తామన్నారు. పీఏంఏవై పథకం కింద పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు.
4.ఫైబర్ గ్రిడ్ పేరిట వందల కోట్ల అవినీతి
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఫైబర్ గ్రిడ్, అన్నా క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపించారు. చివరి రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ సభ్యుడు రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ‘అన్నా క్యాంటీన్ల’ అవకతకలను సభలో ప్రస్తవించారు. అన్నా క్యాంటీన్లను పెట్టి టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని, వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ.. పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, అన్నా క్యాంటీన్లను మూసివేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, మార్చురీ పక్కన కూడా పెట్టారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిపై పూర్తి ప్రక్షాళన జరిపి ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు బోత్స తెలిపారు. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఉన్నాయన్నారు.
5.ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’
చదువుకోవడం పిల్లల హక్కు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యాహక్కుచట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. చదువు అనేది పేదరికం నుంచి బయటపడేసే ఆయుధమని తెలిపారు. సోమవారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఈ అంశంపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీలో 33 శాతం మంది నిరాక్ష్యరాసులు ఉన్నారని.. జాతీయ సగటుతో పొల్చితే ఇది ఎక్కువగా ఉండటం బాధకరం. గత ప్రభుత్వం పద్దతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను నీరుగారుస్తూ వచ్చింది. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లను మూసేశారు. ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం ఫీజులు పెంచినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకుల బిల్లులు 8 నెలల పాటు చెల్లించని పరిస్థితి.
6.ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి
టీడీపీ నాయకులు ప్రజావేదిక గురించి మరిచిపోవడమే మంచిదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రజా వేదిక గురించి మాట్లాడటం వల్ల టీడీపీకి ఏమైనా మేలు జరుగుతుందని అనుకుంటే అది పొరపాటే అవుతుందని పేర్కొన్నారు. శాననమండలి ప్రశ్నోత్తరాల సమయంలో భవానీ ద్వీపం అభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ.. భవానీ ఐలాండ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చే ప్రతి భక్తుడు భవానీ ద్వీపాన్ని సందర్శించుకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే విమానం నిలిపివేశామని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారు. కానీ బాబు ప్రభుత్వం ఆ విమాన సంస్థకు 2 కోట్ల బకాయి పడి.. దానిని చెల్లించలేకపోవడం వల్లే రద్దు చేశాం’ అని తెలిపారు.
7.ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌లోని ప్రతి రూపాయిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుందని, ప్రజా సంక్షేమమే ప్రాధాన్యంగా రూపొందిన ఈ బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్యవినిమయ బిల్లును మనసాక్షి కలిగిన ఎవరూ వ్యతిరేకించబోరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ శ్రీమతి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి.. ప్రజా పథకాలను ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని అభినందించారు.
8. కేసీఆర్ ధన సాయానికి జగన్ జల సాయం’
ఏపీ అసెంబ్లీని భజనసభగా మార్చారని తెదేపా శాసనసభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. 14 రోజుల సభ వైకాపా కార్యాలయంలో చర్చలా సాగిందని వ్యాఖ్యానించారు. మంగళవారం తెదేపా సభ్యులు అసెంబ్లీ బయట మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కనుసైగలతో సభ సాగుతోందని.. ప్రతిపక్షాల గొంతు నొక్కినసభలా మిగిలిందన్నారు. తెలంగాణ భూభాగంలో మన ప్రాజెక్టులు కట్టడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ధనసాయం చేశారనే జలసాయం చేసేందుకు సిద్ధమయ్యారని.. ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకోనే అని ఆరోపించారు. అమ్మ ఒడిని ఆంక్షల ఒడిగా మార్చారని నిమ్మల మండిపడ్డారు. ఒకే ప్రశ్నకు అసెంబ్లీలో ఒకలా.. మండలిలో మరోలా జవాబు చెప్పారన్నారు. బీసీలకు చేసిన కేటాయింపులతో వారిపై ప్రేమ లేదని తెలుస్తోందన్నారు. మద్యపానం నిషేధం అంటూనే రెట్టింపు ఆదాయంపై దృష్టిసారించారని రామానాయుడు విమర్శించారు.
9. ట్రిపుల్ తలాక్ బిల్లుకు మేం వ్యతిరేకం: వైకాపా
ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును పునఃపరిశీలించాలని ఆయన కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకమని విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ‘‘తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించడం, అతనికున్న చట్టబద్ధమైన హక్కుకు వ్యతిరేకం.మూడేళ్ల పాటు జైలుకు పంపడం వల్ల అతడు పునరాలోచించే అవకాశం లేకుండా పోతుంది.ఈ కాలంలో భార్యకు ఏ విధంగా జీవనభృతి అందించగలడు. సామాజిక సమస్య అయిన ట్రిపుల్ తలాక్‌ను నేరపూరితంగా మార్చడం వల్ల పరిష్కారం లభించదు. అందువల్ల ఈ బిల్లును పునఃపరిశీలించాలని మంత్రిని కోరుతున్నా. చివరగా మేం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.
రోజా పయ్యావుల కేశవ్‌ల మధ్య సెటైర్లు–నేటి అసెంబ్లీపై TNI కధనాలు
Related tags :