*రెండోసారి కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంట్ చరిత్రలోనూ మరో రికార్డును సృష్టించింది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో రికార్డు స్థాయిలో బిల్లుల్ని ఆమోదించారు. 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ రెండు డజన్లకుపైగా బిల్లుల్ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ సమావేశాల్లో ఇంత పెద్దసంఖ్యలో బిల్లులు సభలో ప్రవేశపెట్టడం 15 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జులై 26 వరకు(శుక్రవారం) తీసుకుంటే మోడీ ప్రభుత్వం లోక్‌సభలో 30 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. వీటిలో 20 బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. 14 బిల్లుల్ని లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదించాయి. 14వ లోక్‌సభ (2004) నుంచి16వ లోక్‌సభ (2014) వరకు మొదటి సమావేశాల్లో ఎలాంటి లెజిస్లేచర్ కార్యకలాపాలు జరగలేదు. జులై 5 నుంచి ఆగస్టు 26 వరకు సాగిన 2004 నాటి బడ్జెట్ సమావేశాల్లో కేవలం ఆరు బిల్లులు మాత్రమే పాస్ అయ్యాయి. 15వ లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో ఎనిమిది, 16వ లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో 12 బిల్లులకు మాత్రమే సభ ఆమోదం తెలిపింది .
*భద్రాద్రి కొత్తగూడెం లంచం తీసుకుంటూ ఇల్లందు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ అనీల్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్ట్ బుక్స్ ప్రాసెసింగ్‌లో సంపత్ కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి ఏఈ లంచం డిమాండ్ చేశాడు. రూ.75 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.
*తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్‌ఎంలు ఆందోళనకు దిగారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్లో తమకే ప్రాధాన్యం ఇవ్వాలని.. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఎంహెచ్‌వో కార్యాలయాల ముట్టడికి ఏఎన్‌ఎంలు యత్నించారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ పొరుగు, ఒప్పంద ఏఎన్‌ఎంలు చేసిన ధర్నా కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది.
*సరిహద్దులో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సుందర్బానీ సెక్టార్‌లో పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. తంగ్‌ధర్ – కేరాన్ సెక్టార్‌లో కూడా పాక్ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇద్దరు పాక్ రేంజర్లను భారత సైన్యం మట్టుబెట్టింది.
*తాము పెట్టిన అర్జీ చెత్తబుట్టలోకి పోవడం లేదు… వాటిని కలెక్టర్లు పరిశీలిస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ నమ్మకంతోనే స్పందన కింద వస్తున్న దరఖాస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతీ కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని సూచించారు. కలెక్టర్లు ధ్యాస పెడితేనే వివిధ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కలిశారు. దాయాది పాకిస్తాన్ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించాలని ఆయనను కోరారు. జాలర్లతో వారి కుటుంబసభ్యులు మాట్లాడేందుకు దౌత్య అనుమతి ఇప్పించాలని కేంద్రమంత్రిని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోసం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి గుజరాత్ వెళ్లిన 21 మంది మత్స్యకారులు అరేబియా సముద్రంలో పాకిస్థాన్ గస్తీ దళాలకు చిక్కిన విషయం తెలిసిందే.
*సంగం డెయిరీలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. అతని వద్ద నుంచి రూ.44 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వట్టి చెరకూరు మండలం కుర్నూతల వాసిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అతడు వినియోగించిన గ్యాస్ కట్టరే పట్టించింది. కట్టర్‌పై తన పేరు రాసుకోవడంతో పోలీసులు నిందితుడిని సులభంగా గుర్తించారు. అయితే నిందితుడు దొరికిన విషయాన్ని మాత్రం పోలీసులు అధికారికంగా ధృవీకరించట్లేదు
* మహారాష్ట్రలోని ముంబై నగరంలో నేడు, రేపు అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, విదర్బ, మధ్యప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ, మండీ, కాంగ్రా, బిలాస్‌పూర్, సిరామావూర్, సోలన్, సిమ్లా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నాగాడ్, మిజోరం, మణిపూర్, త్రిపుర ప్రాంతాల్లో భారీవర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు.
* ఎమ్మార్పీఎస్ నేతల చలో అసెంబ్లీ నేపధ్యంలో రాజధాని ప్రాంతానికి వచ్చే అన్ని వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు.
గన్నవరం సమీపంలో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం
* రిజర్వేషన్ల వర్గీకరణపై వైకాపా ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలంటూ ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతితోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా కొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. అసెంబ్లీకి వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
* ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి(ఏపీఈఆర్పీ) ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయం కొనసాగుతుందని అందులో పేర్కొంది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అదేశాలు జారీ చేశారు
* ఒడిశా ప్రజలకు, శ్రీక్షేత్ర వాసుడు జగన్నాథునికి అతిప్రియమైన మిఠాయి రసగుల్లాపై ఎట్టకేలకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) ఒడిశా రాష్ట్రానికే లభించింది. ఒడిశా రసగుల్లాగా గుర్తింపునిస్తున్నట్లు భారత జీఐ రిజిస్ట్రేషన్ సంస్థ చెన్నై కార్యాలయం సోమవారం ప్రకటించింది.
*రైల్వేలో సక్రమంగా విధులు నిర్వర్తించని ఉద్యోగులతో ముందుగానే పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2020 జనవరి-మార్చి నాటికి 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు, 55 ఏళ్ల వయసు నిండినవారిలో అనర్హులను గుర్తించి దీన్ని వర్తింపజేయనుంది. ఇలాంటి వారిని గుర్తించాలని కోరుతూ ఈ నెల 27న రైల్వేబోర్డు అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖలు రాసింది.
*గ్రామ పంచాయతీ నిధులను ఖర్చు పెట్టే సమయంలో.. చెక్కులపై సర్పంచితో పాటు ఉప సర్పంచి సంతకం కనిపించక తప్పదు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనను పొందుపర్చి.. ఉత్తర్వులను సైతం వెలువరించినందున.. ఎక్కడైనా సంయుక్త సంతకాల విధానం అమలుకాకుంటే అధికారులపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది.
*జమ్మూకశ్మీర్లో పాలనా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వులతో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై కేంద్రం పెద్ద నిర్ణయం తీసుకోబోతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. శ్రీనగర్లోని అన్ని మసీదుల జాబితాను, వాటి నిర్వహణ కమిటీల వివరాలను సేకరించాలంటూ రాష్ట్ర పాలనా యంత్రాంగం నగరంలోని ఐదు జోనల్ ఎస్పీలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
*రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 1.06 కోట్ల వాహనాలుంటే అందులో 21.46 లక్షలు ఇవే. 15 ఏళ్ల గడువు తీరిన వాహనాలను కట్టడి చేసి కాలుష్యాన్ని నియంత్రించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
*జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భారతి సిమెంట్స్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన రూ.746.17 కోట్లకు సంబంధించి అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రైబ్యునల్ సవరించింది.
*తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్గా అల్లం నారాయణను మరో ఏడాది కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయిదేళ్లుగా అకాడమీ ఛైర్మన్గా ఉన్న ఆయన పదవీకాలం జూన్ 30తో ముగిసింది.
*విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కుమార్ వచ్చే నెల 8న సమావేశం నిర్వహించనున్నారు. దిల్లీ నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో ఈ ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
*రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మూడో విడత ప్రవేశాల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. సోమవారం ప్రవేశ ప్రకటన జారీ చేయాలని తొలుత కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు నిర్ణయించారు. రెండో విడత ప్రవేశాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయలేదంటూ ఫిర్యాదులు రావడంతో ప్రకటనను వాయిదా వేశారు.
*పదో తరగతి, ఇంటర్లో ఉత్తీర్ణులు కానివారు జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ(ఎన్ఐఓఎస్)లో చేరేందుకు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు ప్రాంతీయ సంచాలకుడు అనిల్కుమార్ తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన పరీక్ష కేంద్రాన్ని, తేదీని ఎంచుకొని ఆ మేరకు రాయవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.nios.ac.in వెబ్సైట్ను సందర్శించాలని సోమవారం ప్రకటనలో ఆయన సూచించారు.
* రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. డీజీ, అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులు నలుగురు, అదనపు ఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారులు ఏడుగురిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
*శాసనసభ సోమవారం ఆమోదం తెలిపిన ‘ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2019’ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. ఆయన ఆమోదం అనంతరం బిల్లు అమలుకు సంబంధించి పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
*కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్లాల్ కటారియా పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలను రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు.
*ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఛైర్మన్ పదవిలో కొనసాగుతారని అందులో స్పష్టం చేసింది.
*పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించడంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ సోమవారం ట్విటర్ వేదికగా స్పందించారు.
*నూతన మద్యం విధానంలో భాగంగా రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.
*ప్రస్తుత సంవత్సరంలో వైఎస్ఆర్ బీమా పథకం పునరుద్ధరణకు పాత ప్రీమియంనే కొనసాగించాలని రాష్ట్ర కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి కేంద్ర అధికారులను కోరారు.
*విశాఖపట్నం జిల్లా చిట్టివలస జూట్ మిల్లు కార్మికుల బకాయిలను ఏడాదిలో రెండు దఫాలుగా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు మంత్రులు అవంతి శ్రీనివాస్, జయరామ్లు వెల్లడించారు. సచివాలయంలో పరిశ్రమ యాజమాన్యం, కార్మిక సంఘాల నేతలతో సోమవారం మంత్రులు సమావేశం నిర్వహించారు.
*గుంటూరు జిల్లాలోని పొనుగుపాడు గోడ వివాదంపై ముగ్గురు మంత్రులు, శాసనమండలి చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా చర్చించారు. దీనిపై సోమవారం శాసనమండలిలో దుమారం రేగడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు.
*మార్కెట్కమిటీల గౌరవ ఛైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమించేలా ఇప్పటికే బిల్లును ఆమోదించారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లాభదాయక పదవులు చేపడితే అనర్హతకు గురవుతారని చట్టంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు గౌరవ ఛైర్మన్లుగా ఉంటే అనర్హతకు గురికాకుండా ఏపీ జీతాలు, పింఛను, అనర్హతల తొలగింపు రెండో సవరణ బిల్లును శాసన సభ ఆమోదించింది.
*చుక్కల భూముల సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్రెడ్డి కోరారు. అయిదేళ్లలో చంద్రబాబు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతురథం పథకం కింద ఇచ్చిన ట్రాక్టర్ల ధరలో రూ.1.03లక్షల తేడా సొమ్ము ఏమైపోయిందో తేలాలన్నారు.
*గత 60 రోజుల్లో తెదేపా నేతలపై 288 కేసులు పెట్టారని, 68 దాడులు జరిగాయని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ధ్వజమెత్తారు. 11చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారని, 24చోట్ల అల్లర్లకు దిగారని విమర్శించారు.
*విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కుమార్ వచ్చే నెల 8న సమావేశం నిర్వహించనున్నారు. దిల్లీ నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో ఈ ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 9, 10 షెడ్యూళ్ల పరిధిలోని సంస్థల విభజన, గిరిజన విశ్వవిద్యాలయం, విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిలు, రాష్ట్ర ఆర్థిక సంస్థ ఆస్తుల పంపిణీ, ఏపీ భవన్ విభజన, ఏపీలోని ఆప్మెల్ తదితర అంశాలను చర్చించనున్నారు. విభజన సమస్యలపై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కానున్నారు.
* హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఏడు రోజుల క్రితం అపహరణకు గురైన యువతి ఆచూకీ లభ్యమైంది. యువతిని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ రవిశేఖర్ వదిలి వెళ్లాడు. అనంతరం తాను అద్దంకిలో ఉన్నట్లు పోలీసులు, తల్లిదండ్రులకు పక్కన ఉన్నవారి ఫోన్ నుంచి యువతి సమాచారం ఇచ్చింది. తెల్లవారుజామున అద్దంకి నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఎంజీబీఎస్ వద్ద దిగగానే యువతిని హయత్‌నగర్ పీఎస్‌కు పోలీసులు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం యువతిని కుటుంబసభ్యులకు అప్పజెప్పనున్నారు. యువతిని కడప, కర్నూలు, చిత్తూరు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
*మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించడానికి మంగళవారం ఉదయం బందరుకు బయలుదేరిన సెకండ్ ఎఎన్‌ఎం లను జి.కొండూరు పోలీసులు కట్టుబడిపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నారు.
5 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మోడీ సర్కార్-తాజావార్తలు–07/30
Related tags :