Business

కిలో టీపొడికి ₹50వేలా?

కిలో టీపొడికి ₹50వేలా? - asian manohari tea powder costs 50000 inr for 1 kilo

ఆహా.. ఏమి రుచి.. అనరా మైమరచి.. ఉదయాన్నే ఓ కప్పు కాఫీ లేదా టీ.. వేడి వేడిగా సిప్ చేస్తుంటే ఎంత బావుంటుంది. చాయ్ ప్రియులకు మరింత చక్కని చిక్కని టీ కావాలంటే మా టీ పొడిని ఓ సారి ట్రై చేయమంటున్నారు అసోం వాసులు. రేటు కూడా కిలో జస్ట్ రూ.50 వేలు మాత్రమే పలికిందట వేలంలో.. ఏంటో అంత డిమాండ్ అని ఆరా తీస్తే.. తేయాకు తోటలన్నీ అసోంలోనే ఉన్నా మనోహరి టీ పౌడర్ మరింత స్పెషల్ అంటున్నారు. అసోం టీ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డ్‌ని మనోహరి గోల్డ్ టీ సొంతం చేసుకుంది. మంగళవారం (జులై 30) నిర్వహించిన వేలంలో కిలో అక్షరాలా 50 వేలు పలికింది. 2018లో ఇదే టీ పొడి కిలోకి రూ.39,001 ధర పలికింది. ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్ డాన్ ఈ పోలో టీ ఎస్టేట్‌లో పండించిన గోల్డెన్ నీడిల్ రకం టీ పొడి కిలో రూ.40 వేలు పలికి మనోహరి రికార్డ్‌ని బ్రేక్ చేసింది.తాజాగా గోల్డెన్ నీడిల్ రికార్డుని బద్దలు కొట్టి మనోహరి గోల్డ్ టీ 50 వేలకు విక్రయించబడింది. గువాహటి టీ ఆక్షన్ సెంటర్‌లో ఈ వేలం పాట జరిగింది. దిబ్రూగఢ్ మనోహరీ టీ ఎస్టేట్‌లో పండించే ఈ టీకి మంచి డిమాండ్ ఉంది. 2019 సంవత్సరంలో ఈ రకం టీ కేవలం 5 కిలోలే పండినట్లు మనోహరీ గోల్డ్ టీ సంస్థ యజమాని రాజన్ లోహియా తెలిపారు. సాధారణంగా తేయాకుల నుంచి టీ పొడిని తయారు చేస్తారు. కానీ మనోహరి టీ పొడిని మాత్రం చిన్న చిన్న మొగ్గల నుంచి తయారు చేస్తారు. ఈ పొడిని తయారు చేసే ప్రక్రియ చాలా క్లిష్టమైనదని రాజన్ అన్నారు. పీ-126 అనే ఉత్తమమైన క్లోన్ ద్వారా దీన్ని పండిస్తారు. మే, జూన్ నెలల్లో వచ్చే రెండో కాపులోని మొగ్గలను తెల్లవారుజామున తెంచి ఎండబెడతారు. దీన్నుంచి టీ పొడి తయారయ్యే వరకు జరుగుతున్న ప్రాసెస్ అంతా ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది. అందుకే టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. డిమాండ్‌తో పాటు రేటు కూడా ఎక్కువే అని రాజన్ లోహియా అంటున్నారు.