DailyDose

కూకట్‌పల్లిలో చిరుత కలకలం-తాజావార్తలు-07/31

Leopard In Kukatpally-Telugu Breaking News Today-july312019 - కూకట్‌పల్లిలో చిరుత కలకలం-తాజావార్తలు-07/31

కూకట్ పల్లిలో చిరుత కలకలం – తాజా వార్తలు – 07/31
*భాగ్యనగరంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కూకట్‌పల్లి పరిధిలో చిరుత ప్రత్యక్షమైంది. ప్రగతినగర్‌-గాజులరామారం మధ్య చిరుత సంచరిస్తున్నట్లుగా సమాచారం. చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రగతినగర్‌ వాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు…
* వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో ప్రముఖ సినీనటి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ఆమె ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా..? ఇంకెవరు నటి హేమ. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ ఇకపై పొలిటికల్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. 2014లోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ అది అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు.తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని హేమ నిర్ణయించుకున్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. త్వరలో తాను వైసీపీలో చేరతానేమోనంటూ క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్ 3 నుంచి ఎలిమినేట్ అవ్వడం, బిగ్ బాస్ హౌస్ లో నటి హేమపై జరిగిన వ్యవహారంపై ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే హేమ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు పలికారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో కలిసి తన మద్దతు ప్రకటించారు. కానీ వైసీపీలో మాత్రం చేరలేదు. అయితే త్వరలోనే ఆమె వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే తన సొంత జిల్లా అయిన తూర్పుగోదావరిలో ఇల్లు సైతం కొనుగోలు చేసింది. ఇకపై తన సొంత జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని హేమ భావిస్తోంది. ఇకపోతే నటి హేమ 2014 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్రపార్టీలో చేరారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు హేమ.
*ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 17, 18 తేదీల్లో భూటాన్లో పర్యటించనున్నారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో ప్రధాని పర్యటించడం ఇది రెండోసారి కానుంది. మోదీ పర్యటన సందర్భంగా 4 అవగాహన ఒప్పందాలపై ఉభయ దేశాలూ సంతకాలు చేస్తాయని భూటాన్ ప్రధాని లొటే షేరింగ్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటనకు వెళ్తున్నారు. రేపు గురువారం హైదరాబాద్ నుంచి ఆయన జెరూసలేం పర్యటనకు వెళ్తారని పార్టీ నాయకులు చెప్పారు.ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తారు జగన్. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30కు బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ ఆఫీస్ కు వెళ్తారు. తన పర్యటనపై అక్కడ చర్చిస్తారు. ఈ రాత్రి లోటస్ పాండ్ లోని తన ఇంట్లో బస చేస్తారు. రేపు సాయంత్రం హైదరాబాద్ నుంచి జెరూసలేం పర్యటనకు బయల్దేరి వెళ్తారు. తిరిగి ఆగస్ట్ 5 సోమవారం నాడు హైదరాబాద్ వస్తారు.
* ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ విఠల్ గోకర్న్ స్వల్ప అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ప్రధాన ఆర్థిక సలహా మండలి సభ్యులు షమికా రవి ట్విటర్‌ లో ఈ సమాచారాన్ని అందించారు. సుబీర్‌ గోకర్న్‌ మరణంపై మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సహా పలువురు ఆర్తికవేత్తలు, కేంద్రమంత్రులు, ఇతర రాజకీయవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.
* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పరమేశ్వర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి మంగళశారం నాడు సిట్ అదుపులోకి తీసుకొని విచారించింది. పరమేశ్వర్ రెడ్డి నుండి సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు సిద్దమయ్యారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం సీఎం జగన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు.
* రుమలగిరి మండల టీఆర్ఎస్ నేత సాగవు రాఘవరెడ్డి చేతి వాటం చూపించారు. ఫోర్జరీ సంతకం, నకిలీ డాక్యుమెంట్లతో రెండున్నర కోట్లు టోకరా కొట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా.. తన పార్టనర్ పూజిత కృష్ణా రెడ్డిని మోసం చేశారు రాఘవరెడ్డి.గతంలోనే చెక్ ఫోర్జరీ కేసుకింద వీరిని పోలీసులు హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇప్పుడు సంతకం ఫోర్జరీ నిజమేనని తేల్చారు ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు. గతంలో ఎల్ఐసీలోనూ భారీ స్కాంకు పాల్పడ్డారని తెలిపిన పోలీసులు..రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
* ఒడిశా సచివాలయం పేరును ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ మార్చారు. ఇప్పటి వరకు ‘సచివాలయ’గా పిలుచుకున్న ఈ పేరును ‘లోక్ సేవా భవన్’గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడిన ఆయన… ఒడిశా ప్రజలకు మరింత సేవ చేసేందుకు కష్టపడి పని చేయాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని… వారికి సేవ చేయడానికే తామంతా ఎన్నుకోబడ్డామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సచివాలయానికి పేరు మార్చినట్టు తెలిపారు సీఎం నవీన్ పట్నాయక్.
* తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న విభజన తగవులను తేల్చుదాం రమ్మంటూ రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం -2014లోని అపరిష్కృత అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో ఆగస్టు 8న ఎనిమిది పాయింట్ల ఎజెండాతో సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్రం పది రోజుల కింద రెండు ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ మేరకు, ఢిల్లీలో నార్త్‌ బ్లాక్‌ లోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఆగస్టు 8న మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల అధికారుల భేటీ జరుగనుంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఏపీ భవన్, ఆప్మేల్, డిస్కంలకు బకాయిలు, ఫైనాన్స్కార్పొరేషన్, తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన, తదితర సమస్యలపై వివాదం కొనసాగుతోంది.
* జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెర్చుకున్నాయి. ఈ ఉదయం ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి కిందకు నీళ్లు వదిలారు అధికారులు. ఉదయం 1లక్ష 67వేల 370 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగింది.జూరాల ప్రాజెక్టులో 318.420 మీటర్ల నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 9.459 టీఎంసీలు. ప్రాజెక్టుకు 1 లక్షా 50వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నిలకడగా కొనసాగుతోంది.
* పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 39 అడుగులకు చేరుకున్నందున దిగువన వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువన కాఫర్‌ డ్యాం వద్ద 28 మీటర్ల మేర నీటిమట్టం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
* భాగ్యనగరంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కూకట్‌పల్లి పరిధిలో చిరుత ప్రత్యక్షమైంది. ప్రగతినగర్‌-గాజులరామారం మధ్య చిరుత సంచరిస్తున్నట్లుగా సమాచారం. చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రగతినగర్‌ వాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు…
* ఏపీ, తమిళనాడు సరిహద్దు జిల్లాల ఎస్పీలతో చిత్తూరు పోలీసులు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఈ సమావేశం జరుగుతోంది. తిరువన్నామలై, వేలూరు, ఇతర జిల్లాల ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అక్రమ రవాణాలపై, శాంతిభద్రతల అంశాలపైన, వేలూరు ఎంపీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలపై కూడా ఇరు రాష్ట్ర పోలీసులు చర్చిస్తున్నారు.
*రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకూ 24 గంటల పాటు అత్యవసర సేవలు మినహా ఇతర వైద్యసేవలు లభించవు.
*గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు ప్రవాహం పెరుగుతోంది. జులై నెలాఖరు వరకు పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నా, గత రెండు రోజులుగా గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది.
*వినియోగదారుల హక్కులను బలోపేతం చేసే బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది. వారి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయడమే వినియోగదారుల రక్షణ బిల్లు 2018 ఉద్దేశమని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాస్వాన్ అన్నారు.
*కఠినమైన పరిస్థితుల్లోనూ సంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల రైతులు పొడి భూముల్లో చేస్తున్న వ్యవసాయం వారికి ఆహార భద్రత కల్పిస్తోందని, ఆహార ధాన్యాల కోసం వారెప్పుడూ బయటి వనరులపై ఆధారపడడం లేదని ఇంటర్ఫేసింగ్ ఫార్మల్ సెల్స్ అధ్యయనం తేల్చింది.
*ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ప్రశాంతి కుటుంబానికి రూ.లక్ష ఇవ్వడం ద్వారా అండగా నిలుస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు రమణ తెలిపారు. ఆయన మంగళవారం ఒక ప్రకటన వెలువరిస్తూ, ఆమె తండ్రి డి.కొమురయ్యకు బుధవారం ఎన్టీఆర్ భవన్లో అఖిలపక్ష నేతలతో కలిసి ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.
*తెలంగాణ, మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్లను ఎత్తడంతో భారీగా వరద నీరు దిగువకు వెళ్తోంది.
*ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి 51 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 10 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన, 18 స్టాఫ్ నర్సుల పోస్టులను, 4 ఏఎన్ఎం, 3 ఫార్మాసిస్టు, 3 ల్యాబ్ టెక్నీషియన్, 1 రేడియోగ్రాఫర్, 1 డార్క్ రూమ్ అసిస్టెంట్, 2 ల్యాబ్ అటెండెంట్, 2 థియేటర్ అసిస్టెంట్, 3 జూనియర్ అసిస్టెంట్, 2 ఎంఎన్ఓ, 2 ఎఫ్ఎన్ఓ పోస్టులను పొరుగు సేవల విధానంలో భర్తీ చేసుకోవడానికి అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
*దేశవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన సీబీఎస్ఈ నిర్వహించిన సెంట్రల్ టెట్(సీటెట్)లో 3,51,830 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 29,22,227 మంది దరఖాస్తు చేయగా, వారిలో 23,77,031 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో పేపర్-1లో 2,14,658 మంది, పేపర్-2లో 1,37,172 మంది కృతార్థులయ్యారు.
*కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షవర్గ సభ్యుడు, ఆచార్య అనిల్ సద్గోపాల్ తెలిపారు. బిల్లు తేవొద్దని ఆగస్టు 9న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
*తెలంగాణలోని కార్మిక, వైద్యారోగ్య శాఖల్లో పనిచేసే 22 మంది ఉన్నతాధికారులకు, అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు లభించాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా అధ్యక్షతన జరిగిన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ మంగళవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
*కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా తెలంగాణ పర్యావరణ ప్రభావ మదింపు సాధికార సంస్థను ఏర్పాటుచేసింది. దీనికి ఆచార్య ఎం.ఆనందరావును ఛైర్మన్గా, డాక్టర్ బి.నరసయ్యను సభ్యుడిగా, రాష్ట్ర పర్యావరణ-అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శిని సభ్యకార్యదర్శిగా నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.
*వైఎస్సార్ పింఛను కానుక పథకానికి 2019-20 బడ్జెట్ నుంచి రూ.414.40 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు పింఛను సాయం అందించేందుకు ఈ మొత్తం విడుదలకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా సీట్ల భర్తీ కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆగస్టు 2, 3 తేదీల్లో విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనుంది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇతర విద్యార్థులు, వీరికి కలిపి కౌన్సెలింగ్ జరపనున్నారు.
*బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఎడ్సెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 20వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 14నుంచి 22వ తేదీ వరకు కాలేజీలకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 6న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.500.