Sports

కొత్తగా కాదు…చెత్తగా ఉంది

Adam GIlchrist Says New Names And Numbers Looks Worst

ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఈ సిరీస్‌ నుంచే టెస్టు జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు కొనసాగిస్తున్నారు. మైదానంలో అభిమానులు ఆటగాళ్లను గుర్తించేందుకు ఐసీసీ కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కూడా ఈ సిరీస్‌ నుంచే ప్రారంభమైంది. అయితే టెస్టు జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు చెత్తగా ఉన్నాయని ప్రముఖ ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. ట్విటర్‌ వేదికగా.. ‘ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. మనమింకా పోటీలో ఉన్నాం. ఇలా చెబుతున్నందుకు మన్నించండి. కానీ.. జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు నచ్చడం లేదు’ అని ఒక ట్వీట్‌ చేశాడు. వెంటనే మరో ట్వీట్‌లో ‘నిజం చెప్పాలంటే నా క్షమాపణల్ని వెనక్కి తీసుకుంటున్నా. పేర్లూ, నంబర్లు చెత్తగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ యాషెస్‌ను ఆస్వాదించండి’ అని పేర్కొన్నాడు. 142 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో గురువారం తొలిసారి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు తమ జెర్సీలపై నంబర్లు, పేర్లతో మ్యాచ్‌ ఆడారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గతేడాదే వెల్లడించిన నేపథ్యంలో.. యాషెస్‌ సిరీస్‌ నుంచే ప్రారంభించారు. మొత్తం తొమ్మిది జట్లు 71 మ్యాచ్‌ల్లో 27 ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు ఆడనున్నాయి. ప్రతీ జట్టూ మిగిలిన ఎనిమిది జట్లలో ఏవైనా ఆరు జట్లతో తలపడతాయి. అందులో మూడు సిరీస్‌లు స్వదేశంలో ఆడగా మిగతా మూడు విదేశాల్లో ఆడే అవకాశం ఉంది.