ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. వైయస్ జగన్ సర్కార్ ప్రజల్లో విశ్వాసం కల్పించలేకపోయిందని విమర్శించారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో అవే తప్పులు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ అవినీతిని గ్రహించిన ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినా సీఎం జగన్ మాత్రం పదేపదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని అది సరికాదన్నారు.
విభజన చట్టంలోని అంశాలను 90 శాతం కేంద్రం అమలు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఇసుక పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందన్నారు.
భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను తరలించే విషయంలో జగన్ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయంగా రామయపట్నాన్ని ప్రతిపాదించాలని దగ్గుబాటి పురంధేశ్వరి హితవు పలికారు.