Health

మూడో రోజుకు తెలంగాణా జుడాల ఆందోళన

మూడో రోజుకు తెలంగాణా జుడాల ఆందోళన-Telangana Junior Doctors Continue Protests

జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్లులో అభ్యంతరకరంగా ఉన్న సెక్షన్ 32, సెక్షన్ 50లను తొలగించటం సహా తమ డిమాండ్లను పూర్తి చేసే వరకు విధులకు హాజరుకాబోమని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న నిరసనలు మూడోరోజూ కొనసాగాయి. వెయ్యి మందికి పైగా జూడాలు సమ్మెలో పాల్గొంటున్నారు. మరోవైపు నిమ్స్ ఆస్పత్రిలో జూడాలు ఓపీ సేవలను బహిష్కరించారు. ఎన్ఎంసీ బిల్లు పేద విద్యార్థులు, రోగులకు వ్యతిరేకంగా ఉందని..తక్షణమే బిల్లులో ప్రతిపాదించిన విషయాలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి నిమ్స్ రెసిడెంట్ వైద్యుల బృందం ధర్నాచేపట్టింది. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ చేపట్టారు. బిల్లుకు సంబంధించి రెసిడెంట్ వైద్యుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక అందిచనున్నట్టు జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు. జూడాల సమ్మెతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.