ప్రముఖ వ్యాపారవేత్త, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రక్రియలో భాగంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేఫ్ కాఫీ డే గ్రూపు(సీసీడీ)కి చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు కొందరు బోగస్ పత్రాలు సమర్పించి తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.145 కోట్ల మేర అడ్డదారిలో రుణాలు పొందినట్లు తాజాగా ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు గుర్తించారు. వీజీ సిద్ధార్థ మరణాంతరం సీసీడీకి చెందిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీసీడీకి చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు అన్నదాతల పేరుతో నకిలీ పత్రాలు సమర్పించి కోట్ల రూపాయల రుణాలు పొంది వీజీ సిద్ధార్థకు చెందిన ఇతర కంపెనీలకు అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. కాగా వీజీ సిద్ధార్థ మరణాంతరం సీసీడీ బోర్డులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఓ ఉన్నతాధికారి సైతం ఇదే విధంగా రుణం తీసుకున్నట్లు ఆదాయపన్ను శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ‘కర్ణాటకలోని చిక్‌మగళూర్‌లో కాఫీ సాగు చేస్తున్న రైతులుగా పేర్కొంటూ సీసీడీ గ్రూపు అందించినట్లుగా నకిలీ విక్రయ హామీ పత్రాలను బ్యాంకులో సమర్పించారు. సీసీడీ గ్రూపు అందించినట్లుగా ఉండడంతో బ్యాంకు వర్గాలు ఏ మాత్రం ఆలోచించకుండా రుణాలు మంజూరు చేశాయి. ఈ నగదును ఇతర మార్గాల ద్వారా సీసీడీ గ్రూపునకు చెందిన ఇతర కంపెనీలకు తరలించినట్లు భావిస్తున్నాం’ అని ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కెఫే కాఫీడే పేరిట ₹145కోట్ల భారీ కుంభకోణం
Related tags :