DailyDose

ఐటీశాఖకు చుక్కలు చూపెడుతున్న ఏపీ GST క్లెయిమ్లు-వాణిజ్యం-08/03

GST Tax Claims From Andhra Shocks IT Officials-Today Telugu Business News-Aug32019 - ఐటీశాఖకు చుక్కలు చూపెడుతున్న ఏపీ GST క్లెయిమ్లు-వాణిజ్యం-08/03

*వాహన రంగానికి వాతావరణం అనుకూలంగా లేదనే విషయాన్ని మరోమారు రుజువు చేస్తూ జులై నెలలో పలు కంపెనీల వాహన విక్రయాలు రెండంకెల క్షీణతను నమోదు చేశాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీతోపాటు హ్యుందాయ్, ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచాయి.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ రూ.2,866 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.97 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 4.7 శాతం పెరిగి, రూ.20,738 కోట్లకు చేరింది.
*మూడేళ్ల నాటి దివాలా స్మృతి సవరణల బిల్లు 2019కి పార్లమెంటు ఆమోదం లభించింది. గత సోమవారమే రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు, గురువారం లోక్సభ ఆమోదముద్ర లభించింది.
*గుండె జబ్బులను అదుపు చేసేందుకు సంయుక్తంగా కృషి చేయాలని అపోలో హాస్పిటల్స్, మైక్రోసాఫ్ట్ ఇండియా నిర్ణయించాయి. దీనికి అనుగుణంగా ఈ రెండు సంస్థలు కలిసి జాతీయ క్లినికల్ సమన్వయ కమిటీ (ఎన్సీసీసీ) ఏర్పాటు చేశాయి.
*హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సెస్మిక్ సేవల కంపెనీ ఆల్ఫాజియో ఇండియా లిమిటెడ్పై ఆదాయపు పన్ను శాఖ బృందాలు దాడులు నిర్వహించాయి.
*హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మ్యాక్స్క్యూర్ హాస్పిటల్స్ను స్వీడన్కు చెందిన మెడికవర్ సొంతం చేసుకుంది.
*జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సిటీలో అమెజాన్ ఇండియా తన కార్యకలాపాలు విస్తరించనుంది. ఈ సంస్థ ఇక్కడ ప్రస్తుతం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సరకు నిర్వహణ కేంద్రాన్ని ప్రస్తుతం నిర్వహిస్తోంది.
*టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) ధరను రూ.80,000 వరకు టాటా మోటార్స్ తగ్గించింది. తక్షణమే ధరల తగ్గింపు అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.
*ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న జీఎస్టీలో ఓ వింత చోటుచేసుకొంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన 2017 జులై 1 నుంచి 2018 ఆగస్టు 8 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్ను చెల్లింపుదారులంతా కలిసి రూ.8.19 లక్షల కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్కు దరఖాస్తు పెట్టుకోగా అందులో రూ.6.49 లక్షల కోట్ల క్లెయిమ్లు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చినట్లు కాగ్ గుర్తించింది.
*ఇండియాపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)ను చిన్న రుణ బ్యాంకుగా మార్చాలని తపాలా విభాగం నిర్ణయించింది.
*సహజ వనరుల నుంచి నీటిని సేకరించి, శుద్ధి చేసిన నీటిని విక్రయించే కొమిన్ నేచురల్ మినరల్ వాటర్ హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.
*రిటైల్ దుకాణాలకు వెళ్లి నేరుగా కొనుగోలు చేసినప్పుడు రివార్డు పాయింట్లను అందించే మ్యాజిక్పిన్ వచ్చే ఏడాది చివరికల్లా నెలకు రూ.2,000 కోట్ల స్థూల వ్యాపార విలువ (జీఎంవీ) సాధించాలని లక్ష్యంగా విధించుకుంది.
*డెయిరీ ఉత్పత్తుల సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.18.1 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఆదాయం రూ.721.2 కోట్లు ఉంది.