Food

బాలింతలు తప్పక తీసుకోవాల్సిన ఆహారం ఇది

Must eat foods for lactating mothers-telugu health news today - బాలింతలు తప్పక తీసుకోవాల్సిన ఆహారం ఇది

పాలిచ్చే ప్రతి తల్లికీ బోలెడు సందేహాలు. పాపాయికి సరిపడా పాలు పడాలంటే… ఏం తినాలి, ఏం తినకూడదు… ఇలా ఎన్నో ఉంటాయి. ఈ సమయంలో ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అదనంగా కెలొరీలు అందేలా చేసుకోవాలి. అదెలాగో తెలుసుకుందామా…

బాలింతకు ప్రత్యేకించి ఇనుము, క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌ ఎ, డి వంటి పోషకాలు అవసరం అవుతాయి .ఇవి తల్లిపాల ఉత్పత్తిని పెంచుతాయి. అదనంగా 600 కిలో కెలొరీలు అవసరం. అసలు ఏ పదార్థాలు తీసుకోవాలంటే…
* ఓట్‌మీల్‌: ఇందులో అధికమొత్తంలో ఇనుము లభిస్తుంది. ఇది ప్రసవం అయ్యాక వచ్చే రక్తహీనతను నిరోధించడానికి చాలా అవసరం. రక్తహీనత ఉంటే పాల ఉత్పత్తి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇనుము రక్తంలోని ఎర్రరక్తకణాల ఉత్పత్తినీ పెంచుతుంది. ఇది క్రమంగా తల్లిపాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇనుము కోసం బెల్లం, ఖర్జూరాలూ తీసుకోవడం మంచిది.

* వెల్లుల్లి: బాలింతల్లో పాలు పెరిగేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. దీంతో ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. సాధారణంగా పసిపిల్లల్లో గ్యాస్‌ సమస్య వల్ల కడుపు నొప్పి వస్తుంది. దీనిని నివారించడంలో వెల్లుల్లి కీలకంగా పని చేస్తుంది.
* పచ్చి బొప్పాయి: ఇది శరీరంలో ఆక్సిటోసిన్‌ ఉత్పత్తిని పెంచి పిల్లలకు సరిపడా పాలు వృద్ధి చెందేలా చేస్తుంది. దీన్ని ఉడికించి కూర రూపంలో తిన్నా, అలానే సలాడ్‌ రూపంలో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. థాయ్‌ రెస్టారంట్‌లలో దీన్ని ఎక్కువగా వాడతారు.
* పండ్లు: వీటిల్లో అధికమొత్తంలో పోషకాలు లభిస్తాయి. ఇవి మలబద్ధకాన్ని నిరోధిస్తాయి. రోజూ కనీసం రెండు కప్పుల పండ్ల ముక్కలను తినగలిగితే మంచిది. అరటి, మామిడి, తర్బూజా వంటి పండ్లను తీసుకోవడం వల్ల పొటాషియం, విటమిన్‌ ఎ అధికమోతాదులో లభిస్తాయి.
*కూరగాయలు, ఆకుకూరలు: బాలింత తన ఆహారంలో కూరగాయల మోతాదుని పెంచాలి. వీటిల్లో కీలకమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు…ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, ఇతర ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడదుంప, గుమ్మడి, టొమాటోలు, తృణధాన్యాల వంటివి పాల ఉత్పత్తిని పెంచుతాయి. పాలకూరలో ఎక్కువగా ఇనుము ఉంటుంది. దీన్ని ఉడికించి తినడం మంచిది. పాల ఉత్పత్తిని పెంచడంలో క్యారెట్‌ ఒకటి. దీనిలో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్‌ ఎ పాపాయి ఎదుగుదలలోనూ కీలకంగా పనిచేస్తుంది.
*మెంతులు: ఈ గింజల్ని నీటిలో మరిగించి టీలా తాగడం మంచిది.
* నట్స్‌: వీటిని తినడం వల్ల శరీరంలో సెరటోనిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఇది తగినన్ని తల్లిపాలు తయారవడానికి సాయపడుతుంది.
* పాలిచ్చేటప్పుడు శరీరానికి అదనంగా ఇరవైఐదు గ్రాముల వరకూ మాంసకృత్తులు ప్రతిరోజూ అవసరం అవుతాయి. అందుకోసం బీన్స్‌, బఠాణీలు, నట్స్‌, గింజలు, పాలు వంటివి తీసుకోవాలి. మాంసాహారులైతే చేపలు, కీమా వంటివి తినొచ్చు. సముద్ర ఆహారం తీసుకోవడం వల్ల పాపాయి మెదడు చక్కగా వృద్ధి చెందుతుంది. అందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీలకంగా పనిచేస్తాయి.

ఇవి వద్దు

పిల్లలకు పాలిచ్చే సమయంలో తీసుకోకూడని పదార్థాలూ ఉన్నాయి. అవేంటంటే…!
* కృత్రిమ తీపిని అందించే పదార్థాలను, చాక్లెట్లను తినకూడదు. మసాలా దినుసులకు ఈ సమయంలో దూరంగా ఉండటమే మంచిది.
* పుల్లటి పండ్లను తీసుకోకూడదు. నీ అధికమోతాదులో టీ, కాఫీలు తాగడం వల్ల వాటిల్లో ఉండే కెఫీన్‌ పాపాయి నిద్రకు భంగం కలిగిస్తుంది. సోడాలు, టీలకూ దూరంగా ఉండాలి.