ఇంట్లో, జిమ్‌లో రోజూ చేసే వ్యాయామాలు విసుగు తెప్పించాయా… అలాంటి వారు ఈసారి ట్రెక్కింగ్ ప్రయత్నించి చూడండి. పూర్తి శరీరానికి వ్యాయామం అందుతుంది. మరెన్నో ప్రయోజనాలూ ఉంటాయి. అవేంటో తెలుసుకోండి మరి.
* ట్రెక్కింగ్ అంటే… భారీ పర్వతాలే ఎక్కాలని లేదు. మీకు దగ్గర్లో ఉండే కొండ ప్రాంతాలు ఎంచుకున్నా చాలు. పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు శరీరానికి కావాల్సిన ప్రాణవాయువు అందించడానికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. దానివల్ల కండరాలకు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. గుండె కండరాలు దృఢంగా మారుతాయి. జీవక్రియల రేటు పెరుగుతుంది. ఎక్కువ కెలొరీలూ ఖర్చవుతాయి.
* ఎత్తైన కొండలు ఎక్కడానికి, మరికొన్ని అడ్డంకులను దాటడానికి ఎన్నో రకాల స్ట్రెచెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు పరుగెత్తాల్సి రావొచ్చు. వీటన్నింటితో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలోని అధిక నీరూ పోతుంది. ట్రెక్కింగ్‌ను 12 వారాల పాటు సాధన చేస్తే సులువుగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు నిపుణులు.
* కొండలపై పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
* కొండలు ఎక్కే సమయంలో చేసే వ్యాయామాలు ఎముకలు, కండరాలను దృఢంగా మారుస్తాయి. శరీరం సౌకర్యంగానూ మారుతుంది.
* ట్రెక్కింగ్‌లో భాగంగా క్లిష్టమైన దారుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. వాటిల్లో సరైన తోవను గుర్తించడంపైనే ధ్యాస మొత్తం కేంద్రీకరిస్తారు. ఇతర ఆలోచనలు దరిచేరవు. ఏకాగ్రతనూ పెంచుతాయి.
* చాలామందిని కుంగుబాటు, ఒత్తిడి వేదిస్తుంటాయి. దీంతో పనులపై శ్రద్ధ పెట్టలేరు. ఇలాంటివారికి ట్రెక్కింగ్ సరైన పరిష్కారం అంటారు నిపుణులు. దీనివల్ల హ్యాపీ హార్మోను ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది ఆందోళనను దూరం చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెదడు పనితీరూ బాగుంటుంది.