Movies

మల్టీస్టారర్ ఇష్టపడట్లేదు

మల్టీస్టారర్ ఇష్టపడట్లేదు-akshay kumar on multi starrers

ఇప్పటి నటీనటులు మల్టీస్టారర్‌లో నటించేందుకు ఆసక్తిచూపించడం లేదని బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ అన్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల హవా నడిచింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సోలో హీరో సినిమాలు ఎక్కువైపోయాయి. కేవలం కొందరు స్టార్స్‌ మాత్రమే తమ తోటి స్టార్‌తో నటించడం సౌకర్యంగా భావిస్తున్నారు. అక్షయ్‌తోపాటు విద్యా బాలన్‌, తాప్సి, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, శర్మన్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిషన్‌ మంగళ్‌’. జగన్‌ శక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా అక్షయ్‌ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. స్క్రిప్టును బట్టి ఒకే సినిమాలో ఇద్దరు స్టార్స్‌ నటించడంలో తప్పులేదని చెప్పారు. ‘గొప్ప కథలో నా భాగస్వామ్యం ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంటా. ఓ మంచి సినిమాలో చిన్న పాత్రలో నటించడానికి కూడా నేను సిద్ధమే. నా పాత్ర కన్నా పక్క నటుడి పాత్ర నిడివి ఎక్కువని నేనెప్పుడూ బాధపడలేదు. స్క్రిప్టు బాగుంటే చాలు అనేది నా అభిప్రాయం. ఒక్క సినిమాలో ఇద్దరు హీరోలు ఉండటాన్ని ఇప్పటి స్టార్స్‌ ఇష్టపడటం లేదు. నేను పేరు బయటపెట్టను కానీ.. మీకు ఓ హీరో గురించి చెబుతా. అతడు మల్టీస్టారర్‌లో నటించారు. ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. కానీ పోస్టర్‌లో అతడి ఫొటో మాత్రమే వేయాలని నిర్మాతలకు చెప్పాడు. సినిమాలో కేవలం తనే మెయిన్‌ హీరో అని చెప్పుకోవడానికి ఇలా చేశాడు. ఈ విషయం తెలుసుకుని నేను షాక్‌ అయ్యా. సూర్యవంశీ’ సినిమాలో నాతోపాటు చాలా మంది స్టార్స్‌ నటిస్తున్నారు. నేను కూడా గతంలో సునీల్‌ శెట్టి, సైఫ్‌ అలీ ఖాన్‌ వంటి హీరోలతో కలిసి నటించా. కానీ ఇప్పుడు జనాలు ఎందుకు ఇలా ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసి.. అభద్రతా భావంతో ఇలా ప్రవర్తిస్తుంటారు. బడ్జెట్‌ అసలు విషయమే కాదు. అందరూ ఇద్దరు, ముగ్గురు హీరోలున్న స్క్రిప్టులు ఎంచుకోవాలని నేను సూచిస్తున్నా. స్క్రిప్టు, పాత్ర మీకు నచ్చితే మిగిలిన విషయాల గురించి ఆలోచించొద్దు. కానీ ఇప్పటి స్టా్ర్స్‌ను అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యా. ‘జానీ దుస్మాన్‌‌’ సినిమా కోసం నేను ఏడు మంది స్టార్స్‌తో కలిసి నటించా’ అని ఆయన చెప్పారు.