* తెలుగు రాష్ట్రాలకు, గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ చేసిన సేవలకు బ్రేక్ పడనుందా? వరుసగా పది సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఆయనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులై.. అటుపై రాష్ట్రం విడిపోయాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగారు. ఇక ఆయన బదిలీ కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ నాటికి గవర్నర్‌గా నరసింహన్‌కు పది సంవత్సరాలు నిండనున్నాయి. ఆయన స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులు కానున్నారని సమాచారం. ఈ నెలాఖరులోగా నరసింహన్ బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఆ లోగా రాష్ట్ర విభజన సమస్యలకు మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆయనను ఆదేశించినట్టు తెలుస్తోంది.దీంతో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విభజన అంశాలపై వరుస భేటీలు చేశారు.
* నా ఒక్కడి ఆరాటం-పోరాటం సరిపోదు: పవన్ కళ్యాణ్
ప్రజల్లో ఆవేశం, కోరిక లేకపోతే తానొక్కడినే ఏమీ చేయలేనన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ . సోమవారం భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో పవన్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు కోరుకున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా నిలబడతానన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తన ఒక్కడి ఆరాటం – ఒక్కడి పోరాటం సరిపోదని అన్నారు. ఏపీకి స్పెషల్ స్టాటస్ సాధించుకునే విషయంలో తెలంగాణ ప్రజలని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు పోరాడిన తీరు ఆదర్శమన్నారు.
*జనసంఘ్ కాలం నుంచే చెబుతున్నాం: నిర్మలా సీతారామన్
ఆర్టికల్ 370 రద్దు ఏకపక్షమని ప్రతిపక్షాలు అనడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన నిర్మలా సీతారామన్.. జనసంఘ్ కాలం నుంచి ఇదే విషయం పదే పదే ప్రస్తావిస్తున్నామని గుర్తుచేశారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాకే.. కశ్మీర్ అంశంలో నిర్ణయం తీసుకోవాలన్నది బీజేపీ మూల సిద్ధాంతం అని పేర్కొన్నారు. ఇది చారిత్రక ఘట్టం అని పేర్కొన్నారు.
*టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు చెంప చెళ్లుమంది: అరవింద్
కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగ వాతావరణం నెలకొందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 370 ఆర్టికల్ రద్దు సందర్భంగా దేశ యువత సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి కలిగిన రోజు ఇది అని పేర్కొన్నారు. వేల మంది కశ్మీర్ పండితుల ఆత్మలు, సైనికుల ఆత్మలకు శాంతి కలుగుతుందన్నారు. భారత్‌లో జమ్మూకశ్మీర్ అంతర్భాగం కాదన్న టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నేతలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో చెంప చెళ్లుమందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చేతకాని ప్రధాని వల్ల 70 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
* కేంద్రానిది సాహసోపేత నిర్ణయం: దత్తాత్రేయ
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని కేంద్రం రద్దుచేయడంపై భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ స్పందించారు. కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు కట్టుబడే భాజపా నిర్ణయాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఒకే దేశం – ఒకే రాజ్యాంగం అనే నినాదాన్ని భాజపా అమలుచేస్తోందన్నారు.
* పోలవరం ప్రాజెక్టును ఆపడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిల్లర రాజకీయాలతో అసలు ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోతారన్నారు. టీడీపీ చేసిన విధానంలో తప్పులుంటే సరిదిద్దాలని పవన్‌కల్యాణ్ సూచించారు.
* టీఆర్‌ఎస్ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ
జమ్మూకశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తున్నట్లు సోమవారం రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని రద్దు చేయటం తన చిన్నప్పటి కల అని, దీన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి వేగవంతం అవుతుందని, అనేక కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రావణమాస సోమవారం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండగ వాతావరణం నెలకొందని అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వేలమంది సైనికుల ఆత్మలకు ఈ రోజు శాంతి కలుగుతుందన్నారు. అసలు జమ్మూ కశ్మీర్ భారతదేశంలో లేకుండా ఉండే అన్న టీఆర్‌ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులకు చెంప చెళ్లుమన్నట్లు అయ్యిందని మండిపడ్డారు.
* పోలవరంపై టీడీపీవి అసత్య ప్రచారాలు: అనిల్ కుమార్
పోలవరం ప్రాజెక్ట్ పనులను నిలిపివేశామని టీడీపీ అసత్య ప్రచారాన్ని నీటి పారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఖండించారు. శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పోలవరంపై పూర్తి స్పష్టత ఇచ్చారని ఆయన తెలిపారు. పోలవరం ఒక్కటే కాదని, నిబంధనలకు విరుద్దంగా అంచనాలు పెంచి ఖరారు చేసిన ప్రతి ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ‘తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అసలు పోలవరం ఊసే ఎత్తలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహోన్నత ఉద్దేశంతతో పోలవరానికి శ్రీకారం చుట్టారు.
*కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా 7న దేశవ్యాప్త ఆందోళన: మధు
జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు భారత దేశ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బజారులో పణంగా పెట్టినట్టుగా భావించాలని సీపీఎం సీనియర్ నేత మధు అన్నారు. ఈ బిల్లుపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ దేశంలో వివిధ జాతులు, రాష్ట్రాలు, ప్రాంతాలు.. అందరూ కలిసి ఉన్న ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థకు బీజేపీ సవాల్ విసిరినట్లుగా ప్రజానీకం భావిస్తోందని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఉన్న ప్రజలు.. భారత దేశంలో కలిసి ఉండడం కోసం ఆనాడు ప్రత్యేకమైన ప్రతిపత్తిని కలిగించారని అన్నారు. దాన్ని రద్దుచేయడం ద్వారా మైనారిటీలు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలను ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో బలం చూసుకుని, బలప్రయోగంతో జమ్మూకశ్మీర్ ప్రజలను అణిచిపెట్టి.. పరిపాలన చేయాలని చూస్తోందని మధు ఆరోపించారు.
* కశ్మీర్‌పై కేంద్రం ప్రకటనకు బీఎస్పీ మద్దతు
కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుగా నిలిచింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా రాజ్యసభలో మాట్లాడుతూ.. కేంద్రం ఈరోజు ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఎస్పీ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. అధికరణ 370రద్దుతో పాటు ఇతర ఏ బిల్లులనూ వ్యతిరేకించమని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం భాజపాపై గుర్రుగా ఉన్న ఈ పార్టీ అనూహ్యంగా కేంద్రానికి మద్దతుగా నిలవడం గమనార్హం.
* హోదా అడిగిన వారే తూట్లు పొడుస్తున్నారు-జనసేన అధినేత పవన్‌కల్యాణ్
జమ్మూకశ్మీర్‌లాంటి సమస్యకు పరిష్కారాలు వెతుకుతున్నప్పుడు.. కాపుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించడం చాలా సులభమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కాపుల రిజర్వేషన్ జగన్ రాజకీయ కోణంలో చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో పోలవరం ప్రాజెక్టును ఆపడం సరైనది కాదు. గత ప్రభుత్వ హయాంలో ఏమైనా తప్పులు, అవినీతి జరిగి ఉంటే వాటిని ఎత్తిచూపాలి, అంతేకానీ ప్రాజెక్టులు ఆలస్యం చేయటం సరికాదు. అలాంటి చర్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి. అవినీతిని వెలికి తీస్తామంటున్న విషయంలో జనం నష్టపోకూడదు. అమరావతిలో పనులు ఆపడం వల్ల విదేశీ పెట్టుబడులపై విశ్వసనీయత పోతుంది. ఇది సరైన నాయకులు చేసే పని కాదు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగిన వారే తిరిగి నేడు తూట్లు పొడుస్తున్నారు. నాయకుల్లో ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏపీ ప్రజల్లో లేదు’’అని అన్నారు.
* కశ్మీర్‌లో ఇక శాంతి నెలకొంటుంది: మాజీ ఎంపీ కవిత
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్‌లో స్పందించారు. జమ్ము కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దుతో చారిత్రక మార్పులు చోటుచేసుకోనున్నాయని ఆమె తెలిపారు.జమ్ము కశ్మీర్ ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంత ప్రజలంతా సురక్షితంగా ఉంటారని, కశ్మీర్‌లో త్వరలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఇక నుంచి భారత చట్టాలన్నీ జమ్ము కశ్మీర్‌లో అమలవుతాయి. రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు కశ్మీర్‌కు వర్తిస్తాయి.
*ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందించడమే ధ్యేయం: నారాయణస్వామి
అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందించడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్య మంత్రి కె.నారాయణస్వామి స్పష్టం చేశారు. వెదురుకుప్పం మండలం భారత మిట్ట వద్ద నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ వెదురు కుప్పం మండల కేంద్రంలో జరిగే ఈ స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ప్రతి అర్జీ తప్పక పరిష్కరించబడుతుందని తెలియ జేశారు.
*ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు: ఆజాద్
కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభలో విపక్ష సభ్యులు మరికాసేపట్లో పార్లమెంటులోని ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ ఛాంబర్‌లో భేటీ కానున్నారు. కశ్మీర్ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఈ అంశంపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు మంతనాలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ‘‘జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఎన్నికలు సజావుగా సాగాయి. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో పరిస్థితులు బాగానే ఉన్నాయి. పర్యాటకులు సైతం ప్రశాంతంగానే ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
*రాజకీయాలకే వన్నె తెచ్చిన జైపాల్రెడ్డి
రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడేందుకు శ్రమించిన నేత జైపాల్రెడ్డి అని పలువురు ప్రముఖులు కొనియాడారు. సోషలిస్ట్ నాయకుడు డి.శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని గాంధీ సెంటినరీహాలులో సంస్మరణ సభ నిర్వహించారు.కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు. జైపాల్రెడ్డి లేని లోటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నటికీ తీరేది కాదని వీహెచ్ అన్నారు. ఆయన జీవితం ఆదర్శప్రాయమని రమణ తెలిపారు. తన వ్యక్తిత్వంతో రాజకీయాలకే వన్నె తెచ్చారని సురవరం కొనియాడారు. కార్యక్రమంలో జైపాల్రెడ్డి సోదరుడు పద్మారెడ్డి పాల్గొన్నారు.
*నాటి విలువలే ఉన్నతస్థాయికి చేర్చాయి
గురువులు నేర్పిన విలువలు, వారు కలిగించిన ప్రేరణలే విద్యార్థి జీవితాన్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయని తమిళనాడు మాజీ గవర్నర్-గుంటూరు హిందూ కళాశాల పూర్వ విద్యార్థి కొణిజేటి రోశయ్య అన్నారు. అక్కడ నేర్చుకున్నవే రాజకీయంగా తనను అంచెలంచెలుగా ఎదిగేలా చేశాయని..ఆదివారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఏర్పాటైన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తెలిపారు. చదువుల దశలో ఉన్నప్పుడు కొందరు స్నేహితులు చెప్పిన మంచి మాటలు ఇప్పటికీ తీపిగుర్తులుగా మిగిలాయన్నారు. కళాశాల ప్రస్తుత ఛైర్మన్ ఎస్.వి.ఎస్.సోమయాజులు మాట్లాడుతూ, హిందూ కళాశాల పలు అధునాతన విభాగాలతో, పదివేలమంది విద్యార్థులతో అలరారుతోందన్నారు. మరిన్ని కొత్తకోర్సులు ప్రవేశపెట్టేందుకు పూర్వ విద్యార్థుల సూచనలు కోరారు.
*కాళేశ్వరం నష్టాలకు సీఎందే బాధ్యత
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సవ్యంగా వ్యవహరించడం లేదని, సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎత్తిపోసిన నీళ్లు తిరిగి మళ్లడం నష్టం కలిగించే అంశమని ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వరకు ఎత్తిపోసిన నీళ్లను మళ్లీ వెనక్కి వదలాల్సి వస్తోందని; మానేరుకు వరదనీటి వల్ల అన్నారం గేట్ల నుంచి నీటిని వృథాగా వదిలేయడంతో..రూ.80 వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలూ అందవని తెలిపారు. ఈ నష్టాలన్నింటికీ కేసీఆరే బాధ్యత వహించాలన్నారు.
*అరవై రోజుల ప్రణాళికపై దృష్టి సారించండి
రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీల్లోని వివిధ రకాల పోస్టులు త్వరలో భర్తీకాబోతున్నాయి. అర్హులకు పదోన్నతులూ లభించనున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు నియమితులు కానున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసిన 60 రోజుల ప్రణాళికను వెంటనే అమల్లోకి తేవాలన్నారు.
*కాళేశ్వరం నష్టాలకు సీఎందే బాధ్యత
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సవ్యంగా వ్యవహరించడం లేదని, సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎత్తిపోసిన నీళ్లు తిరిగి మళ్లడం నష్టం కలిగించే అంశమని ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వరకు ఎత్తిపోసిన నీళ్లను మళ్లీ వెనక్కి వదలాల్సి వస్తోందని; మానేరుకు వరదనీటి వల్ల అన్నారం గేట్ల నుంచి నీటిని వృథాగా వదిలేయడంతో..రూ.80 వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలూ అందవని తెలిపారు. ఈ నష్టాలన్నింటికీ కేసీఆరే బాధ్యత వహించాలన్నారు.
*10న సీడబ్ల్యూసీ సమావేశం
నూతన అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఈ నెల పదో తేదీన సమావేశం కానుంది. అధ్యక్షునిగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత పార్టీలో స్పష్టత కరవయిందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా తదుపరి అధ్యక్షుని విషయమై పార్టీ నేతల నుంచి పలు సూచనలు వస్తున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడిని నియమించి, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ శశిథరూర్ సూచించారు. యువనేతలైన సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియాల్లో ఒకరికి ఈ పదవి ఇవ్వాలని ముంబయికి చెందిన మాజీ ఎంపీ మిళింద్ దేవ్రా అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వంటివారు భావిస్తున్నారు.
*రూ.204 కోట్లకు పరువు నష్టం దావా
తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడారంటూ విజయపుర శాసనసభ్యుడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్పై కర్ణాటక మాజీ మంత్రి డి.కె.శివకుమార్ రూ.204 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కనకపుర న్యాయస్థానంలో తాను దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని, యత్నాళ్కు సమన్లు జారీ చేశారని శివకుమార్ వెల్లడించారు. తదుపరి విచారణను సెప్టెంబరు 18కి వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి శివకుమార్ కోర్టులో రూ.1.04 కోట్లు ధరావతు చెల్లించారు. శివకుమార్ తనపై నమోదైన ఈడీ, ఐటీ కేసుల నుంచి విముక్తి పొందేందుకు సహకరించాలని భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కొందరు కేంద్ర మంత్రులతో బేరసారాలకు దిగారని…జూన్ 23న యత్నాళ్ ఆరోపించారు. కేసుల నుంచి తప్పిస్తే కర్ణాటకలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని, శివకుమార్ హామీ ఇచ్చినట్టు చెప్పారు.
*పీసీసీ అధికార ప్రతినిధిగా అయోధ్యరెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా సమన్వయకర్తగా బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం ఆయనకు నియామకపు ఉత్తర్వులను అందజేశారు.
*రాజకీయాలు హుందాగా ఉండాలి
‘రాజకీయాలు హుందాగా ఉండాలని జనసేన కోరుకుంటోంది. మా పార్టీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. సభను హుందాగా నడపాల్సిన బాధ్యత వైకాపా, తెదేపాకు ఉంది.’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు రోజుల పర్యటన నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం, భావి కార్యాచరణ, గడచిన రెండు నెలల్లో కొత్త ప్రభుత్వ పాలన తీరుపై రెండు రోజులపాటు జరిగే పర్యటనలో చర్చిస్తామని పవన్ పేర్కొన్నారు.
*మనకు ఓటు వేయనివారూ మెచ్చుకునేలా పని చేయండి
ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలని, సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ మన పార్టీకి ఓట్లు వేయనివారు కూడా మెచ్చుకునేలా మంచి నడవడికతో పని చేయాలని ప్రధాని మోదీ.. తమ పార్టీ ఎంపీలకు ఉద్బోధించారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ మీ నియోజకవర్గాల్లో మళ్లీ మీరే గెలిచేలా కృషిచేయాలన్నారు. 380 మందికిపైగా భాజపా ప్రజాప్రతినిధులకు దిల్లీలో నిర్వహించిన రెండురోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ప్రధాని ఆదివారం ప్రసంగించారు.
*రూ.204 కోట్లకు పరువు నష్టం దావా
తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడారంటూ విజయపుర శాసనసభ్యుడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్పై కర్ణాటక మాజీ మంత్రి డి.కె.శివకుమార్ రూ.204 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కనకపుర న్యాయస్థానంలో తాను దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని, యత్నాళ్కు సమన్లు జారీ చేశారని శివకుమార్ వెల్లడించారు. న్యాయమూర్తి నోటీసులు జారీ చేసిన తదుపరి విచారణను సెప్టెంబరు 18కి వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి శివకుమార్ కోర్టులో రూ.1.04 కోట్లు ధరావతు చెల్లించారు.
*దాడులను నిరసిస్తూ 7న ఆందోళనలు: సీపీఐ
దేశంలో మహిళలపై అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడుల్ని నిరసిస్తూ ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. ఆరెస్సెస్, భాజపా అనుబంధ సంస్థల హింస దేశంలో నానాటికీ పెరిగిపోతోందని ఆదివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
నరసింహన్‌కు వీడ్కోలు! కశ్మీర్ గవర్నర్‌గా బదిలీ?-రాజకీయ–08/05
Related tags :