Devotional

అసలు నాగపంచమి అంటే ఏంటి?

What is nagapanchami and its importance

భారతీయ సంప్రదాయంలో నాగారాధనకు సముచిత స్థానం ఉంది. వేదకాలం నుంచీ నాగపూజ ఉంది. నాగేంద్రుడు శివుడికి హారమైతే, కేశవుడికి తల్పమయ్యాడు. మన పురాణేతిహాసాల్లో చాలా సందర్భాల్లో నాగుల ప్రస్తావన కనిపిస్తుంది. కద్రువ నాగమాత. మహా భారతంలో అసంఖ్యాకంగా నాగుల పేర్లు కనిపిస్తాయి. జనమేజయుడి సర్పయాగం ప్రముఖమైన ఘట్టం. హైందవ సంప్రదాయంలోనేగాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. ధ్యానముద్రలో ఉన్న జినుడు, బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగవిప్పి ఉన్న ప్రతిమలు కొన్నిచోట్ల లభించాయి. మొహంజొదారో శిథిలాల్లో అధఃకాయం నాగం, ఊర్ధ్వకాయం మానవుడుగల చిత్రాల ముద్రలు, యోగి పక్కనే పడగఎత్తి ఆడుతున్న సర్పాల ముద్రలు లభ్యమైనట్లు కొన్ని చరిత్ర గ్రంథాలు పేర్కొన్నాయి.శ్రావణ శుద్ధపంచమిని నాగపంచమిగా, కార్తిక శుద్ధచవితిని నాగులచవితిగా పరిగణిస్తారు. నాగపంచమి గరుడ పంచమిగానూ ప్రసిద్ధం. భవిష్య పురాణంలో నాగపంచమి ప్రస్తావన ఉంది. నాగద్రష్ట, గరుడ పంచమీవ్రతాల వివరణ ఉంది. గరుడ పంచమీవ్రతాన్ని సోదరులు కలిగిన స్త్రీలు ఆచరించాల్సిన వ్రతంగా చెబుతారు. చతురస్రాకార మండపంలో బియ్యంపోసి సర్పప్రతిమను ఉంచాలి. దాని పడగకింద గౌరీదేవిని ఏర్పాటు చేసుకోవాలి. గౌరీదేవిని, నాగదేవతను శక్తిమేరకు పూజించి నైవేద్యం సమర్పించి కథ చెప్పుకోవాలి. ఈ వ్రతాన్ని పది సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేస్తే విశేష ఫలదాయకమని విశ్వాసం. చతుర్థినాడు ఉపవసించి పంచమినాడు పంచముఖ సర్ప ప్రతిమను పూజించాలని స్కంద పురాణం చెబుతోంది. వ్రతాచరణకు సంబంధించి ప్రాంతీయ భేదాలు కనిపిస్తాయి.నాగపంచమిని గరుడ పంచమిగా వ్యవహరించడానికి పౌరాణిక నేపథ్యం ఉంది. ఉచ్చైశ్రవమనే అశ్వం పాలసముద్ర మథనంలో ఉద్భవించింది. అది శ్వేతవర్ణం గలది. కశ్యపుడి భార్యలైన కద్రువ, వినతలు సముద్ర తీరాన విహరిస్తూ దూరంనుంచి గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోకమాత్రం నల్లగా ఉందని పలికింది. వినత దానికి అంగీకరించక దేహమంతా తెల్లగానే ఉందని చెప్పింది. కద్రువ నలుపు చూపితే వినత ఆమెకు దాసి అయ్యేటట్లు, చూపలేకపోతే కద్రువే దాసి అయ్యేట్లు పందెం కుదిరింది. కద్రువ కపటబుద్ధితో తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరింది. వారు దానికి ఒప్పుకోలేదు. కద్రువ వారిని సర్పయాగంలో నశించాలని శపించింది. కర్కోటకుడనే కుమారుడు తల్లి శాపానికి వెరచి అశ్వరాజంపై వేలాడాడు. మర్నాడు దూరంనుంచి గుర్రం తోక నల్లగా కనిపించగానే వినత ఓటమిని అంగీకరించి కద్రువకు దాసి అయింది. నాగులపై ద్వేషంతో వినత కుమారుడు గరుత్మంతుడు నాగులను హింసించి భక్షిస్తుంటాడు. పాముల ప్రాణభయాన్ని తగ్గించడంకోసం వాసుకి రోజుకు ఒక్కొక్క సర్పాన్ని ఆహారంగా పంపడానికి గరుడుడితో ఒప్పందం చేసుకుంటాడు.జీమూతవాహనుడు విద్యాధర యువకుడు. పర్వత ప్రాంతంలో విహరిస్తూ సర్పాల మృత అవశేషాలను చూశాడు. ఆ రోజున ఖగరాజుకు ఆహారంగా శంఖచూడుడనే పన్నగ కుమారుడు వచ్చాడు. కరుణాళువైన జీమూతవాహనుడు తానే గరుడుడికి ఆహారమై శంఖచూడుడి ప్రాణాలు కాపాడదలచాడు. ఎర్రటి వస్త్రం ధరించి వధ్యశిలపైకి ఎక్కాడు. గరుత్మంతుడు అతణ్ని భక్షించబోయేసరికి జీమూతవాహనుడి తల్లిదండ్రులు, భార్య వచ్చి అతణ్ని బతికించమని ప్రార్థించారు. గరుత్మంతుడు తప్పు గ్రహించి అతణ్ని వదిలిపెట్టాడు. జీమూతవాహనుడి కోరికపై సర్పజాతిని హింసించనని మాట ఇచ్చాడు. ఆ రోజును గరుడ పంచమిగా జరుపుకొంటారు.నాగుల్ని పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. నాగదోష పరిహారార్థం పూజలు చేస్తారు. పాములు పంటలను అభివృద్ధి చేస్తాయనీ నమ్ముతారు. ఇతర దేశాల్లోనూ సర్పజాతిని గురించి అనేక నమ్మకాలున్నాయి.

1.2న ఆన్లైన్లో వరలక్ష్మీవ్రతం టిక్కెట్లు: టీటీడీ జేఈవో
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 9న వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన టిక్కెట్లను 2వ తేది ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ జేఈవో బసంత్కుమార్ తెలిపారు. వరలక్ష్మీవ్రతం ఏర్పాట్లపై బుధవారం ఉదయం ఆయన తిరుచానూరులోని ఆస్థాన మండపంలో టీటీడీ, పంచాయతీ, పోలీసు అధికారులతో సమీక్షించారు. 9వ తేది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. రూ.500 టిక్కెట్తో ఇద్దరు భక్తులు వరలక్ష్మీవ్రతంలో పాల్గొనవచ్చన్నారు. దీనికి 500 టిక్కెట్లను భక్తులకు ఇస్తున్నామని, సాధాసాధ్యాలను పరిశీలించి మరో వంద ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ 500 టిక్కెట్లలో 300ను 2వ తేది ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వివరించారు. మరో 200 టిక్కెట్లను 8వ తేది అమ్మవారి ఆలయ వద్ద ఆర్జిత కౌంటర్లో విక్రయిస్తామని చెప్పారు. ఈ ఏడాది తోళప్ప గార్డెన్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్ర్కీన్ల వద్ద భక్తులు వరలక్ష్మీవ్రతాన్ని వీక్షించవచ్చన్నారు. డీపీపీ ద్వారా గాజులు, పసుపు, కంకణాలను అందజేస్తామన్నారు. వరలక్ష్మీవ్రతం రోజున ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామన్నారు. అన్నప్రసాద వితరణకూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడా తొక్కిసలాటకు చోటు లేకుండా బారికేడ్లు, ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఆగమ సలహాదారుల శ్రీనివాసాచార్యులు, టీటీడీ అధికారులు రవి, శేషారెడ్డి, అశోక్కుమార్గౌడ్, రమణప్రసాద్, వేణుగోపాల్, సత్యనారాయణ, శ్రీనివాసులు, ఏవీఎస్వో నందీశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి జనార్దన్రెడ్డి, సీఐ చిరంజీవి, సూపరింటెండెంట్లు కుమార్, గోపాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
2. అమరనాథుడి దర్శనానికి…
భారతీయ పర్యాటకులను ఆకర్షించే వైవిధ్యభరితమైన టూర్ ప్యాకేజీలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) అందిస్తోంది. తాజాగా జమ్మూ-కశ్మీర్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరనాథ్ యాత్ర కోసం సరికొత్త ప్యాకేజీతో ముందుకు వచ్చింది. అమరనాథ్లో గుహాలయంలో హిమ శివ లింగం దర్శనమిస్తుంది. వేసవికాలం మినహా మిగిలిన కాలాల్లో ఈ గుహలు మంచుతో కప్పి ఉంటాయి. జమ్ము- కశ్మీర్ రాజధాని శ్రీనగర్కు సుమారు 141 కి.మీ. దూరంలో అమరనాథ్ గుహాలయం ఉంది. ఈ యాత్ర కోసం ఐఆర్సిటిసి ఆఫర్ చేస్తున్న ప్యాకేజీ ఇది.
*ప్యాకేజీ వివరాలు
ఆగస్టు 4 నుంచి 8 వరకూ మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు ఈ టూర్ ఉంటుంది. ఆగస్టు నాలుగో తేదీ తెల్లవారు జామున 5.40 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి శ్రీనగర్కు విమానంలో తీసుకువెళ్తారు. ఆ రోజు మధ్యాహ్న భోజనం తరువాత షాపింగ్, రాత్రి భోజనం, బస ఉంటాయి. రెండవ రోజున నీల్గ్రాత్కూ, అక్కడి నుంచి హెలికాఫ్టర్లో పంచతరణికి తీసుకువెళ్తారు. పంచతరణి నుంచి యాత్రికులకు ట్రెక్కింగ్ మార్గంలో అమరనాథ్ దర్శనం చేయిస్తారు. అనంతరం పంచతరణిలోని గుడారాలలో బస ఉంటుంది. మూడవ రోజున పంచతరణి నుంచి నీల్గ్రాత్కు హెలికాఫ్టర్లో తీసుకువస్తారు. తరువాత శ్రీనగర్లో సైట్ సీయింగ్ ఉంటుంది. నాలుగో రోజు ఉదయం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకువస్తారు.
3. వేములవాడ ఆలయంలో లడ్డూ, ప్రసాదాల రేట్లు పెంపు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయంలో లడ్డూ, ప్రసాదాల రేట్లు పెరిగాయి. 100 గ్రాముల లడ్డూ ప్రసాదం ధర రూ. 20కి, 250 గ్రాముల పులిహోర ప్రసాదాలు రూ. 15కు, 500 గ్రాముల అభిషేకం లడ్డూ ధర రూ. 100, కిలో పరిమాణం కల్యాణం లడ్డూ ధర రూ. 200లకు పెంచారు. పెరిగిన ప్రసాదం ధరలు ఆగస్టు 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
4. సెప్టెంబరు 10 నుంచి 14 వరకు రొట్టెల పండుగ
సెప్టెంబరు 10 నుంచి 14వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుందని, ఈ పండుగను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఈ పండుగపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా ప్రకటించిందని, ఐదు రోజులు ఈ పండుగ జరుగుతుందన్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. లక్షలాది భక్తులు బారాషాహీద్ దర్గా, స్వర్ణాల చెరువుకు వచ్చే అవకాశం ఉన్నందున పండుగ రోజులలో తొక్కిసలాట జరుగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యాత్రికులకు భద్రత కల్పించటంతో పాటు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. బోటింగ్ వద్ద లైఫ్ జాకెట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య సదుపాయం కల్పించాలన్నారు. జిల్లా చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కార్యక్రమాలు వివరించే ఛాయాచిత్ర పదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాలలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. పండుగ రోజులలో గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వీరభద్రరావు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
5. సత్యదేవుడికి 500 కిలోల సురుచి లడ్డూ
తూర్పుగోదావరిజిల్లా అన్నవరం సత్యన్నారాయణస్వామివారి ఉత్సవాలకు మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ఆధ్వర్యంలో 500 కిలోల లడ్డూ తయారు చేశారు. శుక్రవారం ప్రత్యేక వాహనంలో లడ్డూను అన్నవరానికి తరలిస్తామని సంస్థ యాజమాని పోలిశెట్టి మల్లిఖార్జునరావు(మల్లిబాబు) తెలిపారు.
6. తిరుమలలో అధునాతన బూందీ పోటు
తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అధునాతన వంటశాల తిరుమలేశుడి ఆలయానికి కానుకగా సమకూరనుంది. ప్రస్తుతం గుడి బయట ఉన్న బూందీపోటు స్థానంలో ఈ సువిశాల వంటశాలను ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ భూరి విరాళంగా ఆలయానికి అందచేయనున్నారు. దాదాపు 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నెల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. 2020 జూలై నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇది అందుబాటులోకి వస్తే బూందీ పోటులో తరచూ చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చని టీటీడీ భావిస్తోంది.
7. 69,254 ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి నవంబరు మాసానికి 69,254 టికెట్లను శుక్రవారం విడుదల చేసినట్లు ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. వీటిలో ఆన్లైన్ డిప్ విధానంలో 10,904 టికెట్లలో సుప్రభాతం 7,549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 చొప్పున ఉన్నాయి. వీటిని ఈనెల 6న ఉదయం పదింటి వరకు నమోదు చేసుకోవచ్చు. అదే రోజు భక్తులను తితిదే ఎంపిక చేస్తుంది. ఈవో సింఘాల్ శుక్రవారం తిరుమల నుంచి డయల్ తితిదే ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
8. వారి లడ్డూ ఇక జూట్ బ్యాగుల్లో..
ఈ నెల మూడో వారం నుంచి తిరుమల లడ్డూ వితరణశాలలో జూట్ బ్యాగ్స్ (జనపనార సంచులు)ను విక్రయించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ప్లాస్టిక్ను అరికట్టే చర్యల్లో భాగంగా లడ్డూ కవర్లకు బదులు జూట్ బ్యాగులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీతో సంప్రతించగా గత నెలలో మూడురోజులు 5రూపాయల విలువ చేసే జూట్ బ్యాగులను విక్రయించి భక్తుల నుంచి సలహాలు స్వీకరించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే జూట్బ్యాగ్స్ విక్రయాలను ప్రారంభించనుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. 11వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయని చెప్పారు. వచ్చేనెల 30న ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇంజనీరింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. గరుడసేవకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం మాడవీధులకు పైకప్పు ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
10. ఆదిశ్రీరంగ క్షేత్రం శ్రీరంగపట్నం
పవిత్ర కావేరీ తీరంలో వెలసిన మూడు శ్రీరంగనాథ క్షేత్రాలలో మొదటిది శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథ ఆలయం. కావేరీ నది మొదట్లో వెలసిన శ్రీరంగపట్నం క్షేత్రాన్ని ఆది శ్రీరంగంగా, కావేరీ ప్రవాహానికి కాస్త ముందుకు వెళితే శివసముద్రం వద్ద వెలసినది మధ్య శ్రీరంగ క్షేత్రంగా, తమిళనాడులోని శ్రీరంగంలో వెలసినది అంత్య శ్రీరంగ క్షేత్రంగా విరాజిల్లుతున్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, పురాతనం.శ్రీరంగపట్నంలో వెలసిన క్షేత్రం ఏనాటికి చెందినదో తెలిపే కచ్చితమైన ఆధారాలేవీ లేవు. అయితే, అంబ అనే భక్తురాలు క్రీస్తుపూర్వం 3600 సంవత్సరంలో ఇక్కడ శ్రీరంగనాథునికి చిన్న గుడి కట్టించినట్లు ప్రతీతి. తర్వాతి కాలంలో గంగ, హొయసల, విజయనగర రాజుల కాలంలో ఆలయం వివిధ కళారీతుల్లో విస్తరించింది. తొలుత చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దిలో గంగ వంశపు రాజులు భారీ స్థాయిలో పునర్నిర్మించారు. తర్వాత హొయసల, విజయనగర రాజులు అభివృద్ధిపరచారు. ఇక్కడి గర్భగుడి గంగవంశీయుల నాటి శిల్పశైలిలోను, ఆలయ అంతర్నిర్మాణాలు హొయసల శైలిలోను, ఆలయంలోని రంగమండపం, గోపురం విజయనగర శైలిలోను కనువిందు చేస్తాయి.
11. ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్

ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: endow-eokadiri@gov.in, ac_eo_kadiri@yahoo.co.in 05.08.2019 వతేది, *సోమవారము ఆలయ సమాచారం*
*_శ్రీస్వామి వారి దర్శన వేళలు_* ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండునుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును. స్వామి వారికి ఆర్జిత అభిషేకము సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…దేవస్థానమునకు అనుభంద ఆలయము శ్రీఉమామహేశ్వర స్వామి (శివాలయము) ఉదయము 7.30 గంటలకు రూద్రాబిషేకము, పంచామృత అభిషేక సేవా, ప్రసాద వితరణ కార్యక్రము ప్రారంభమగును తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును..రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..
తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
05.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్:35
05.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 6*_
12. శ్రీరస్తు శుభమస్తు
*తేది : 5, ఆగష్టు 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఇందువాసరే (సోమవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(నిన్న రాత్రి 6 గం॥ 49 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 55 ని॥ వరకు పంచమి తిధి తదుపరి షష్ఠి తిధి)నక్షత్రం : హస్త
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 47 ని॥ వరకు హస్త నక్షత్రం తదుపరి చిత్త నక్షత్రం)
యోగము : (సిద్ధం ఈరోజు రాత్రి 8 గం ll 16 ని ll వరకు తదుపరి సాధ్యం రేపు సాయంత్రం 5 గం ll 20 ని ll వరకు)
కరణం : (బాలువ ఈరోజు సాయంత్రం 3 గం ll 55 ని ll వరకు)
(బవ ఈరోజు సాయంత్రం 5 గం ll 19 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 22 ని ll )
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 6 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 29 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 59 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 33 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 22 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 56 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : కన్య
నాగపంచమి
గరుడపంచమి
13. మన ఇతిహాసాలుగుహుడి నిలువెత్తు సంస్కారం*
ధర్మరక్షణ కోసం తరతరాలుగా, యుగయుగాలుగా ఎందరో మహానుభావులు జన్మిస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. కానీ బిందువూ బిందువూ కలిస్తేనే సింధువుగా మారినట్లు ప్రత్యక్ష పరోక్ష పాత్రల్లో ధర్మ సంస్థాపనకు సహకరించిన వారెందరో.. అది తమ విద్యుక్త ధర్మమని తలంచి ప్రపంచమనే వేదికపైకి రాకుండా తెరవెనుక ఆణిముత్యాలై చరితార్థులయ్యారు. అందులో ప్రత్యేకమైన స్థానం నిషాదరాజైన గుహుడికి దక్కింది. మంచితనం, విలువలు గుహుడి వ్యక్తిత్వ స్వరూపాలుగా మారి ధర్మరక్షణ సభ్య సమాజ రక్షణేనని తెలుపకనే తెలిపాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో కారణం లేకుండా ఏ పనీ జరుగదు. మరి మనిషి పుట్టుక వెనుక ఉన్న మహోన్నత కారణం అసలు సిసలైన మనిషిగా బతకడమేననీ, ఆ బతుకుబాట ఒంటరిగా కొనసాగదనీ, వ్యక్తి కుటుంబం వ్యవస్థ దిశగా విలువలే వారధిగా సాగిపోతుందనీ తెలియజెప్పిన వ్యక్తి గుహుడు. మంచి వ్యక్తిగా మంచి రాజుగా, రామసేవాంకితుడిగా చరిత్రలో నిలిచిపోయిన గుహుడి వ్యక్తిత్వం సాధారణ వ్యక్తిని అసాధారణ మానవత్వంతో పరిమళించేలా చేసింది.వనవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు పాపం అంటని పావన నది గంగాతీరంలోని శృంగిబేరపురం దగ్గర ఆగుతారు. ఆ ప్రాంతం గుహుడి రాజ్యపరిధి లోనిది. మహాబలవంతుడైన గుహుడు స్థిపతి బిరుదుతో రాజ్యమేలుతున్నాడు. బోయజాతివాడు. అందమైన మనసున్న వాడు. రాముని రాకను తెలుసుకుని గంగా తీరానికి చేరుకుని శ్రీరామునికి అతిథి మర్యాదలు చేయసాగాడు. సంతోషంగా స్నేహహస్తం అందించిన గుహుడిని ఆర్తితో పలుకరించాడు రాముడు. గుహుడి మంచితనంలోని పారదర్శకతే దానికి నిదర్శనం.గుహుడికి రాముడంటే ప్రాణం. రాముని వల్లనే రాజ్యాన్నీ, ధర్మజ్ఞానాన్నీ పొందానని బలంగా నమ్మే వ్యక్తి గుహుడు. సీతారాములు కటిక నేలమీద నిద్రించడాన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మణుని బాధను సహృదయంతో ఆలకించి చలించిపోయిన గుహుడు రాముడెక్కడుంటే అదే వైకుంఠమని సాంత్వన పరుస్తాడు. సీతారామ లక్ష్మణులు గంగను దాటడానికి అందమైన నావను సిద్ధం చేసి, రాముని కోరిక మేరకు మర్రిపాలను ఏర్పాటు చేసి, వనవాస దీక్షలో రామలక్ష్మణుల జుట్టు జడలుగా చేసుకునేందుకు సహకరించాడు.గుహుడు ఏర్పాటు చేసిన నావను ఎక్కుతూ అరణ్యంలోనే వనవాసం చేయాలని నా తండ్రి ఆజ్ఞ. అందుకే నీ జన సంచార సంజనితమైన రాజ్యంలో ఉండలేకపోతున్నాననీ, రాముడన్నాడు. దానికి నీ మాటే నాకు వేదవాక్కు. రామా! నీవెక్కడున్నా నా మనసు నీ చెంతనే ఆనందంతో తేలియాడుతుందని చెప్పి వీడ్కోలు చెబుతాడు. రాముడు కనుమరుగయ్యేంత వరకూ తన చూపు మరల్చక చూస్తుండిపోయిన గుహుని నిస్వార్థ ప్రేమ అద్వితీయమైంది. గంగాతీరంలో మరోసారి అయోధ్య పురమంతా దాదాపుగా మజిలీ చేసినట్టు తెలుసుకున్న గుహుడు భరతుని సారథ్యంలో ఇదంతా సాధ్యమైందని గమనించి కైకేయీ భరతులు అడవికెళ్లినా రామున్ని వదిలిపెట్టరా! రాజ్యం ముందు రక్తసంబంధాలు అంత అల్పమైనవా! అని బాధపడి, అంతలోనే తేరుకున్నాడు. భరతుడి ఉద్దేశం రాముని ప్రశాంతతకు భంగం కలిగించేదే అయితే గంగను దాటనీయక పోరాడుదామనీ, సదుద్దేశమే అయితే ఆహ్వానం పలుకుదామనీ చతురంగా బలాలనూ పురమాయించిన గుహుడు యుద్ధ తంత్రంలో తొందరపాటు చూపలేదు. సరికదా అసలు భరతుని మనసులో ఏముందో తెలుసుకుందామని భరతుని గుడారానికి వెళతాడు.భరతుడితోపాటు సమస్త బలగానికీ ఆతిథ్యాన్ని ఆహ్వానంగా అందిస్తాడు.రాముని జాడ తెలుపమని అడిగిన భరతునితో గుహుడు వినయం తగ్గని స్వరంతోనే సూటిగా ప్రశ్నిస్తాడు. రాముడు క్షత్రియుడైనా సాధుజీవి. ఎవ్వరికీ అపకారం తలపెట్టని వాడు. ఇంత సైన్యంతో ఆయుధాలతో రామదర్శనం ఎందుకో తెలుసుకోవచ్చా? అని నిర్భయంగా అడుగుతాడు. గుహుని సందేహాన్ని తప్పుబట్టని భరతుడు అయోధ్యకు రామున్ని తిరిగి రమ్మని అడిగేందుకే ఈ తపన అంటూ సమాధానపరుస్తాడు. అధర్మంగా వచ్చిన రాజ్యాన్ని తృణీకరించిన భరతునిపై పెరిగిన ఒకింత గౌరవాన్ని వ్యక్త పరుస్తూ సమస్త బలగానికీ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా సీతారామ లక్ష్మణులు ఆ ప్రాంతంలో గడిపిన కొన్ని ఘడియలనీ మధురమైన జ్ఞాపకాలుగా భరతునికి వినిపిస్తాడు. చెదిరిన భరతుని మనసును తృప్తి పరుస్తాడు. రామదర్శనమే నా తక్షణ కర్తవ్యమని భరతుడు చెప్పగానే ఐదువందల నావలను సిద్ధం చేసి, స్వస్తికం అనే ప్రత్యేక నావను భరత శత్రుఘ్నులకూ రాజమాతలకూ ఏర్పాటు చేస్తాడు. విశాలమైన గంగానదిలో గుహుడు ఏర్పాటు చేసిన నావలు అద్భుతమై ఆగుపించాయి. ఇంతటి గుహుడు తన సామర్థ్యాన్ని ఎక్కడా ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. రామకార్యంలో నిశ్చలమై ఒదిగిపోయింది.సీతాన్వేషణలో భాగంగా సీత ఉత్తరీయంలోని చిన్న ముక్కను సుగ్రీవుడు గుహుడికివ్వగా దానిని రామునికి అందించి ఆణగారి పోయిన రాముని ఆశలకు ప్రాణం పోశాడు గుహుడు. ఇలా.. రామునిపై అకుంఠిత విశ్వాసం, రాముని సేవా ధర్మ పరిరక్షణేనని భావించే తత్తం, రామకార్యానికి అడ్డు పడేందుకు ప్రయత్నించిన వారిని నిర్భయంగా ప్రశ్నించే భావ వ్యక్తీకరణ, నిగ్గు తేలిని ధైర్యం, నిరాడంబరత, మనుషులను అర్థం చేసుకుని మనసులకు సాంత్వన చేకూర్చే పరిపక్వత, తన గాథనే రాముని చరితంగా మలుచుకుని మురిసిపోయిన అమాయకత్వం.. బోయవాడైన గుహు.
14. చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 5*
1908 : ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత మరియు దర్శకుడు చక్రపాణి జననం (మ.1975).
1912 : ఆరుసార్లు లోక్‌సభ కు ఎన్నికైన తెలుగు మేధావి కొత్త రఘురామయ్య జననం (మ. 1979).
1930 : చంద్రునిపై మొట్టమొదట కాలుమోపిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జననం (మ.2012).
1962 : నెల్సన్ మండేలా ని నిర్బంధించి, చెఱసాల లో బంధించారు.
1962 : మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి మరణం (జ.1926).
974 : ప్రముఖ రతీయ సినీ నటి కాజోల్ జననం.
1982 : ప్రముఖ తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ సినిమా నటి జెనీలియా జననం.
1991 : హోండా కంపెనీ ని స్థాపించిన సొయిఛిరో హోండా, కాలేయ కేన్సర్ తో 84వ యేట మరణం (జ.1906)
15. రాఘవేంద్రరావు ఉన్నా విచారణ తప్పదు: పృథ్వీ
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ)లో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తానని సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఛానల్‌లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇక అవినీతి అక్రమాల విషయంలో గత ఛైర్మన్‌ రాఘవేంద్రరావు ఉన్నా విచారణ తప్పదని వ్యాఖ్యానించారు. ‘‘కొండపై రాజకీయాలు చేయను. కొండపై పార్టీలు, జెండాల గురించి మాట్లాడను. కేవలం అజెండాలపైనే మాట్లాడతా. ఎస్వీబీసీ ఉద్యోగులను కుటుంబంలా భావించి, నేను కూడా ఐడీ కార్డు ధరించా. ఛైర్మన్‌ సంస్కృతిని మార్చా. ఎందుకంటే ఏకలవ్య శిష్యుడిలా స్వామివారిని కాపాడుకోవడమే నా కర్తవ్యం. అక్రమాల విషయంలో రాఘవేంద్రరావు ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా నాకు అనవసరం. నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. ఒక వేళ పృథ్వీరాజ్‌ అక్రమాలకు పాల్పడినా జగన్మోహన్‌రెడ్డి విచారణ జరిపిస్తారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి జగన్‌గారి కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటా. కార్మికులు బాగుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. వారి హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోవాలని నా కోరిక’’ అని చెప్పుకొచ్చారు.
16. తెలుగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు
వాగ్దేవతలు:

తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :
“అ నుండి అః” వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని “చంద్ర ఖండం” అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత “వశిని” అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.
“క” నుండి “భ” వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని “సౌర ఖండం” అంటారు.
“మ” నుండి “క్ష” వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని “అగ్ని ఖండం” అంటారు.

ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండంలోని “క” నుండి “ఙ” వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.
“చ” నుండి “ఞ” వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత “మోదిని” అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.
“ట”నుండి “ణ”వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి “విమల” అంటే మలినాలను తొలగించే దేవత.
“త” నుండి “న” వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత “అరుణ” కరుణను మేలుకొలిపేదే అరుణ.
“ప” నుండి “మ” అనే ఐదు అక్షరాలకు అధిదేవత “జయని” జయమును కలుగ చేయునది.
అలాగే అగ్ని ఖండంలోని “య, ర,ల, వ” అనే అక్షరాలకు అధిష్టాన దేవత “సర్వేశ్వరి”. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

ఆఖురులోని ఐదు అక్షరాలైన “శ, ష, స, హ, క్ష లకు అధిదేవత “కౌలిని” ఈ అధిదేవతలనందరినీ “వాగ్దేవతలు” అంటారు.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం,
ఒక దేవతాశక్తి ఉంది.
ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.
అంటే బ్రహ్మమే శబ్దము.
ఆ బ్రహ్మమే నాదము.
మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.
అదే మంత్రాలు,
వేదం అయితే
ఇంకా లోతుగా
ప్రభావం చూపుతుంది
భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.
కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా,
వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం
ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.
మనం చది స్తోత్రం
ఎక్కడో వున్న
దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు,
మనం చదివే స్తోత్రమే
ఆ దేవత.
మనం చేసే శబ్దమే
ఆ దేవత
మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.
ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.
ఎంత అద్భుతం.
ఇది సనాతన ధర్మం.
ఇది మనకు మాత్రమే పరిమితమైన
అపూర్వ సిద్ధాంతం.