Politics

మోడీతో జగన్ భేటీ

AP CM YS Jagan Meets PM Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్న జగన్ పార్లమెంట్‌ కార్యాలయానికి వెళ్లి ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించి తమకు సహకరించాలని ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే ముందు జగన్‌ ప్రధానిని కలిసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసిన ప్రతిసారీ తాము ప్రత్యేక హోదా డిమాండ్‌ను వారి ముందు ఉంచుతామని జగన్‌ గతంలో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్నీ ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వానికి నరేగా, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధుల్ని మంజూరు చేయాలని కోరే అవకాశం ఉంది. పోలవరం టెండర్ల రద్దుతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపైనా జగన్‌ ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం. మోదీతో భేటీకి ముందు జగన్‌ పీఎంవో కార్యాలయానికి వెళ్లి అక్కడ కార్యదర్శులతో సుమారు 40నిమిషాల పాటు సమావేశమైన విషయం తెలిసిందే.