ఇండియా మార్కెట్లో సోమవారం బంగారం మెరిసింది. చైనా–యూఎస్‌ల ట్రేడ్‌వార్ టెన్షన్ మళ్లీ మొదలవడంతో బులియన్ మార్కెట్లో పుత్తడి ధర పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ. 800 పెరిగి ఆల్‌టైం గరిష్టం రూ. 36,970 కి చేరింది. వెండి ధరా కిలోకి రూ. వెయ్యి పెరిగి రూ. 43,100 అయింది. రూపాయి మారకపు విలువ పతనమై డాలర్‌కు రూ. 70.50 కి చేరడం కూడా ఇండియా మార్కెట్లో బంగారం పెరగడానికి కారణమైంది. ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు కొత్త ఎత్తులకు చేరాయి. ఎంసీఎక్స్‌లో ఆగస్టు గోల్డ్ కాంట్రాక్టులు (10 గ్రాములు) 2 శాతం పెరిగి రూ. 36,250 కి, అక్టోబర్ కాంట్రాక్టులు 2 శాతం పెరిగి రూ. 36,977 కి చేరాయి. ఈ రెండూ కూడా అత్యధిక స్థాయిలే. గ్లోబల్ మార్కెట్లలోనూ బంగారం ధర ఔన్సుకు 1,450 డాలర్లకు పైనే (ఆరేళ్ల గరిష్ట స్థాయి) నడుస్తోంది. జియోపొలిటికల్, ట్రేడ్ టెన్షన్లతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో భద్రతకు మారుపేరైన బంగారంలో పెట్టుబడికే ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. చైనా దిగుమతుల మీద టారిఫ్ విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ ట్రేడ్‌వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భద్రతకు ఎక్కువ అవకాశం వుండే యెన్, బాండ్స్, గోల్డ్‌లలో పెట్టుబడులకు ఇష్టపడుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు, సెంట్రల్ బాంకుల కొనుగోళ్లకు ఇప్పుడు ఇన్వెస్టర్లూ తోడవడంతో గోల్డ్ ధరలు మరింత పెరిగే సూచనలున్నాయి. ఇన్వెస్టర్ల రాకతో జూన్, జూలై నెలల్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. గ్లోబల్‌గా ఈక్విటీ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. దీంతో రక్షణ కోసం బంగారంలో పెట్టుబడి పెట్టడం సాధారణమైనదేనని, వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడమూ మరో కారణమని శాంకో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకపు విలువ ఆరేళ్ల కనిష్టానికి పతనమైంది. ఏకంగా 113 పైసలు తగ్గి అయిదు నెలల్లో ఎప్పుడూ లేనంతగా రూ. 7.73 వద్ద ముగిసింది. చైనా–యూఎస్ ట్రేడ్‌వార్ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు డబ్బు వెనక్కి తీసుకోవడంతోపాటు, చైనా కరెన్సీ యువాన్ విలువ క్షీణించడమూ రూపాయి విలువ పతనానికి కారణాలుగా నిలుస్తున్నాయి. వరసగా గత మూడు సెషన్స్‌లోనూ రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. మూడు సెషన్స్‌లోనూ కలిపి మొత్తం 194 పైసలు బలహీనపడింది. యువాన్ పతనంతో రూపాయి మారకపు విలువ తగ్గడానికి కారణమైందని, డిసెంబర్ నుంచి ఈ స్థాయిలో రూపాయి మారకపు విలువ పతనమవడం ఇదే మొదటిసారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెడ్ కాపిటల్ మార్కెట్స్ వీ కే శర్మ తెలిపారు. యూఎస్–చైనా ట్రేడ్‌వార్ టెన్షన్‌తోపాటు, కాశ్మీర్‌లో పరిస్థితులూ రూపాయి పతనానికి కారణాలేనని ఎంకే గ్లోబల్ కరెన్సీ రిసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా విశ్లేషించారు. యువాన్ విలువను మరింత పడనిచ్చేలా చైనా నుంచి సంకేతాలుండటంతో ఫారెక్స్ మార్కెట్లలో ఎమర్జింగ్ కరెన్సీల పొజిషన్స్‌ను కాపాడుకోవడానికి ఫారెక్స్ ట్రేడర్లు పరుగులు పెడతారని వాలిడస్ వెల్త్ సీఐఓ రాజేష్ చెరువు చెప్పారు. చైనా కరెన్సీ యువాన్ పతనం, ఇండియా నుంచి ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం కలగలసి రూపాయి ఇప్పట్లో బలపడే అవకాశాలు కనబడటం లేదని పేర్కొన్నారు.
భారత్‌లో బంగారం ధర వింటే భయపడతారు
Related tags :