Sports

ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు

BCCI Summons Rahul Dravid Over Disclosure Agreements...ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు

జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. బోర్డు అంబుడ్స్‌మన్‌–ఎథిక్స్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ డి.కె.జైన్‌ మంగళవారం ఈ నోటీసు జారీ చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని బీసీసీఐ నోటీసులో పేర్కొంది.ద్రవిడ్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగానూ పనిచేస్తున్నాడు. ఈ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఫ్రాంచైజీ ఉంది.ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాల్సిందిగా ఎథిక్స్‌ ఆఫీసర్‌ నుంచి ద్రవిడ్‌కు నోటీసు జారీ అయింది. గతంలో క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన దిగ్గజాలు సచిన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లపై కూడా గుప్తా ఫిర్యాదు చేశారు. తదనంతర పరిణామాలతో ఈ దిగ్గజాలు సీఏసీ నుంచి వైదొలగడంతో కొత్తగా సీఏసీకి విఖ్యాత మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌లను నియమించారు.