*దేశవ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ తదితర జీవనశైలి వ్యాధులు ఇందులో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రజల్లో ఆరోగ్యకర అలవాట్లను పెంపొందించడంపై విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
*వయో వృద్ధులకు తక్షణ సమాచార సేవల కోసం 14567 టోల్ఫ్రీ నంబరు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టాటా ట్రస్ట్స్.. విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్(వీసీఎఫ్) ద్వారా ఈ ఏర్పాటు చేసింది.
*తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం నేపథ్యంలో తాత్కాలిక సచివాలయమైన బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే)భవన్లో శుక్రవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలోని ప్రధాన శాఖలు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం మంచిరోజు కావడంతో కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు బీఆర్కే భవన్లో కార్యకలాపాలను చేపట్టనున్నారు.
*త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు జనాభా ప్రాతిపదికన 50 శాతం టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
*రాష్ట్రంలో వానాకాలం పంటలకు (ఖరీఫ్) భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కింద 26 లక్షల ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద మరో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయించింది.
*శ్రీశైలం జలాశయానికి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రోజుకు దాదాపు అయిదు అడుగుల మేర నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం మధ్యాహ్నానికి 875.70 అడుగులకు చేరుకుంది.
*ఒప్పందంలో పేర్కొన్న గడువు ప్రకారం నిర్మాణపని పూర్తిచేసి ఫ్లాట్ ఇవ్వకపోవడం సేవాలోపమేనని, అది నిర్లక్ష్య ఫలితమని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ పేర్కొంది. ఫ్లాట్ను అప్పగించనందున సొమ్ము తిరిగి ఇచ్చేయాలని, ఫిర్యాదు దాఖలు చేసినప్పటి నుంచి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.
*బీమా సేవల్లో లోపం కారణంగా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ (యూఐసీ)కి హైదరాబాద్ వినియోగదారుల ఫోరమ్-1 మొత్తం రూ.25,000 జరిమానా విధించింది. పాలసీ ప్రకారం డబ్బును చెల్లించాల్సిందేనని ఆదేశించింది.
*సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీసెస్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల ఫోరమ్-1 మొత్తం రూ.2,50,000 జరిమానా విధించింది. అనుకున్న ప్రకారం గమ్యానికి చేర్చాల్సిన పార్సిల్ బాక్సులను కంపెనీ పట్టించుకోలేదంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) వరంగల్ శాఖ హైదరాబాద్ ఫోరమ్ను ఆశ్రయించింది.
*ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే రైల్వే టికెట్ల ధరలు పెరగనున్నాయి. పెద్దనోట్ల రద్దు సమయంలో తొలగించిన సేవా పన్నును మళ్లీ విధించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది.
*భారీ వర్షాల ధాటికి కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెప్పాడిలోని పుథుమలా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఓ దేవాలయం, కూలీలకు చెందిన రెండు శిబిరాలు ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో కొట్టుకుపోయారు.
*యువత కోసం అక్టోబరు 7వ తేదీ నుంచి 17 వరకు కరీంనగర్లో అంబేడ్కర్ మైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు.
*బోర్డుల నిర్వహణ, నీటి పంపిణీ తదితర అంశాలపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు శుక్రవారం వేర్వేరుగా సమావేశం కానున్నాయి.
* రాష్ట్రంలోని 24 వేల నీటి వనరుల్లో 80 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను ఈ నెల 16న విడుదల చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు.
*ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి అమరులైన మాలల సంస్మరణ సభను 11న నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య తెలిపారు. గురువారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ, 23ఏళ్ల కిందట వర్గీకరణను వ్యతిరేకిస్తూ ‘చలో సెక్రటేరియట్’ చేపట్టగా అప్పటి సీఎం పోలీసులను రంగంలోకి దింపడంతో శేషయ్య, నారాయణ, సత్యనారాయణ, సుదర్శనం మరణించారన్నారు.
*జాతీయ ఓబీసీ మహసభ విజయవంతమైందని మహాసభల ఆహ్వాన కమిటీ ఛైర్మన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సభలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
*బందరు పోర్టుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టు నిర్మాణానికి మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ (ఎంపీపీఎల్)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. భూ కేటాయింపుల్నీ రద్దు చేసింది.
*హైదరాబాద్లో ఎమ్మార్కు భూ కేటాయింపుల వ్యవహారంలో నష్టపోయినవారికి వెంటనే న్యాయం చేయాలని ఎమ్మార్ ప్లాట్ల యజమానుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కడియాల రాజేంద్ర డిమాండ్ చేశారు.
ముస్లింలకు 50% టికెట్లు-తాజావార్తలు-08/09
Related tags :