* జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ తగిలనుందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ… జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ఆయన భావించారు. కానీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, లక్ష్మి నారాయణ కూడా గెలవలేదు. వచ్చే ఎన్నికల సమయానికి కూడా పార్టీ పుంజుకుంటుందనే నమ్మకం చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో జేడీ పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది.జేడీ లక్ష్మి నారాయణ, ఆయన స్నేహితుడు గంపల గిరిధర్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే..గత కొంతకాలంగా ఇద్దరూ… పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ జేడీ లక్ష్మి నారాయణ జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీచేయగా… అతని స్నేహితుడు గంపల గిరిధర్.. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గా పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. ఇదిలా ఉండగా… మరో వైపు బీజేపీ కూడా రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మి నారాయణతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఆయన కూడా బీజేపీలో చేరేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే జేడీ దీన్ని ఖండించారు.
* వైకాపా కేంద్ర కార్యాలయం ప్రారంభం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శనివారం ఉదయం నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ చేత రిబ్బన్ కట్ చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. కార్యాలయంలోని తన ఛాంబర్‌లోకి విచ్చేసిన ముఖ్యమంత్రికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.
*ప్రధానిమోడీకి రాహుల్ ఫోన్ కాల్
కేరళలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే కేరళలో 14 జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. వయనాడ్, ఇడుక్కి, కన్నూర్, పాలక్కాడ్, కూర్గ్, మలప్పుళ, కోజికోడ్ జిల్లాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, పోటెత్తుతున్న వరదలతో 5 జిల్లాలు జలదిగ్బంధమయ్యాయి. ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యా యి. చెట్లు, కరెంట్ స్తంభా లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కేరళలో మణిమాల, మీనాచల్, మూవత్తుపుళ, చలియార్, వలపట్టణం, పంబ నదులు ప్రమాదరకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పెరియార్ నది ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచేసింది. పెరియార్ నది ఒడ్డున ఉన్న ప్రముఖ శివాలయం నీట మునిగింది. మున్నార్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి రాకపోకలు ఆగిపోయాయి. ఇంట ర్నేషనల్ ఎయిర్‌పోర్టులోకి భారీగా నీరు చేరడంతో విమానాశ్రయాన్ని మూసివేశారు.
*కాంగ్రెస్ కు కొత్త చీఫ్ ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. నేడు సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో రాష్ట్రాల నేతలతో పార్టీ అధిష్టానం విస్తృత సంప్రదింపులు అనంతరం ముగిసింది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలతో పార్టీ పెద్దలు చర్చించారు. పార్టీ నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఏఐసీసీ అధ్యక్షుడిని ఎంపికపై ఓ నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ నిర్దేశించారు. అలాగే నూతన అధ్యక్షుడి ఎన్నికలో తాము భాగస్వామ్యం కాబోమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. సమావేశం మధ్యలోనే వారద్దరూ బయటకు వెళ్లిపోయారు. దీంతో పార్టీ పీసీసీలే కొత్త చీఫ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
*గన్ పాలనలో ఆత్రమే తప్ప ప్రగతి లేదు: కన్నా
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో ఆత్రమే తప్ప ప్రగతి కనపడటం లేదని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నేడు కన్నా మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19 తర్వాత వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా వలసలుంటాయని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్డీయే డోర్లు మూసుకుపోయాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లులు చరిత్రలో నిలిచిపోతాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
* టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్ ….
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వలన కొంత మంది కి లభ్డి చేకూరు0దనీసాక్షి లో పనిచేస్తున్న ప్రముఖ పదవుల్లో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం లో కీలక పదవులు ఇవ్వడం జరిగిందనీసజ్జల రామకృష్ణ రెడ్డి కి ప్రభుత్వ సలహదారులుగా నియమించడం పట్ల జీ వీ డీ కృష్ణ మోహన్ సాక్షి ఏడోటిరాయల్ కి సమాచార శాఖ లో కీలక మైన పదవి ఇచ్చారనీకావాలనే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇష్టం వచ్చినట్లు పదవులు ఇచ్చారనీ ఆగ్రహం వ్యక్తంచేశారుదేవేందర్ రెడ్డి అనే వ్యక్తి కి సమాచార శాఖ డిజిటల్ విభాగంలో ముఖ్య పదవి ఇచ్చారనీ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూర్వకంగా కొన్ని పత్రికలకు మాత్రమే యాడ్స్ ఇవ్వడం జరిగిందని. నమస్తే తెలంగాణ దిన పత్రికకు యాడ్స్ ఇవ్వడం లో అంతర్యం ఏంటని ప్రశ్నించారు
* ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న రాపాక
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఏపీ శాసనసభ వేదికగా ప్రశంసల వర్షం కురిపించి దేవుడితో పోల్చిన రాపాక వరప్రసాద్ మాట మార్చారు. సభలో పలు అంశాలపై జరుగుతున్న చర్చ సందర్భంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండాదండా అన్నీ జగనేనని, దేవుడని ఓ రేంజ్ లో పైకి ఎత్తేసిన ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఇక తాజాగా ఏపీలో ప్రభుత్వ పాలనపై మాట మార్చిన రాపాక జగన్ సర్కార్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వ్యాఖ్యానించారు.
*ఉద్యమంతో బందరు పోర్టు సాధిస్తాం: కొల్లు
మళ్లీ ఉద్యమాల బాటపట్టి బందరు పోర్టును సాధించుకుంటామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రకటించారు. పోర్టు పనులు ప్రారంభించేలా పార్టీలకు అతీతంగా ప్రజలు ఆందోళనలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు. బందరు పోర్టు నిర్మాణ పనులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం అమానుషమని పేర్కొన్నారు. విజయవాడలోని జిల్లా తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోర్టు పనులు జరుగుతున్న సమయంలో ఈ విధంగా రద్దు చేయడం ఎవరి కోసమని ప్రశ్నించారు. మళ్లీ బందరు పోర్టును వాన్పిక్కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని భావిస్తున్నారా? అని నిలదీశారు.
*కియాపై జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఉమా
‘రాష్ట్రానికి కియా కారు వచ్చేసింది, నాన్న కల సాకారమైంది’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కియా పరిశ్రమ కోసం చంద్రబాబు అనేక సమస్యలు ఎదుర్కొని, పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తేనే రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. కియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. ‘స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచుతాం’ అని వైకాపా ఎంపీ మాధవ్ మాట్లాడితే ముఖ్యమంత్రి కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు.
*14 నుంచి జనసేన సమావేశాలు
జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు ఈ నెల 14 నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 14న ఏలూరు, 16న ఉదయం విజయవాడ, మధ్యాహ్నం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ సమావేశమవుతారు.
*కార్మికులను రోడ్డున పడేసిన ప్రభుత్వం: కన్నా
ప్రభుత్వం ఇసుక కొరతను కల్పించి భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వీరి పనితీరు అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని పరిశీలించడానికి శుక్రవారం విజయనగరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెడతామని ఊకదంపుడు ప్రకటనలు చేసి ఒక్కటీ నిరూపించలేకపోయారని తెలిపారు. ఇది చేతల ప్రభుత్వం కాదని మాటలకే పరిమితమని రెండు నెలల్లోనే తెలిసిపోయిందన్నారు.
*రిజర్వ్డ్ అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాల కౌన్సెలింగ్ తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు శుక్రవారం లేఖ రాశారు. ఈ ఏడాది కౌన్సెలింగ్లో అధికారులు ఉద్దేశపూర్వకంగా నిబంధనలు మార్చారని, దీంతో మొదటి, రెండు విడతల కౌన్సెలింగ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 262 సీట్లు కోల్పోయారని చెప్పారు. మూడో దశ కౌన్సెలింగ్లో రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు మాత్రమే సీట్లుకేటాయించాలన్నారు. ఓపెన్ కేటగిరీలో ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారిని రిజర్వ్డ్ కేటగిరీగా పరిగణించరాదని కోరారు.
*విద్యా వాలంటీర్ల బకాయిలు విడుదల చేయండి: జీవన్రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్న విద్యా వాలంటీర్లకు చెల్లించాల్సిన 5 నెలల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.
*ఎస్సీ వర్గీకరణకు సహకరించండి
ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డితో కలిసి రక్షణ మంత్రిని దిల్లీలో శుక్రవారం ఆయన కలిశారు. వర్గీకరణ లేకపోవడంతో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రక్షణ మంత్రికి వివరించారు. ఎస్సీ వర్గీకరణకు తొలి నుంచి భాజపా అండగా ఉందని, పలు తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే భాజపా మాదిగలకు ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు అవుతుందని చెప్పారు. ఈ అంశంపై ప్రధానితో చర్చిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంద కృష్ణ తెలిపారు.
*ఏచూరి, రాజాల అరెస్టును ఖండిస్తున్నాం’
సీపీఎం, సీపీఐ అగ్రనేతలు సీతారాం ఏచూరి, డి.రాజాలను శుక్రవారం శ్రీనగర్ విమానాశ్రయంలో అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయా పార్టీలు పేర్కొన్నాయి. భాజపా నియంతృత్వ చర్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి పిలుపునిచ్చారు.
*వేలూరు లోక్సభ ఎన్నికల్లో డీఎంకే గెలుపు
వేలూరు లోక్సభ స్థానానికి హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ 8,141 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయనకు 4,85,340 ఓట్లు రాగా… సమీప ప్రత్యర్థి, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి ఏసీ షణ్ముగం 4,77,199 ఓట్లు పొందారు. తపాలా ఓట్లు, తొలి ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఏసీ షణ్ముగం ఆధిక్యంలో కొనసాగినా… తర్వాత డీఎంకే అభ్యర్థిదే పైచేయి అయ్యింది. ఈ ఎన్నికల్లో 28 మంది పోటీ చేయగా… వీరిద్దరు మినహా మిగిలిన అందరూ డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.
*కమలం గూటికే మాజీ ఎంపీ వివేక్
పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ భాజపాలో చేరిక దాదాపుగా ఖాయమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో హైదరాబాద్లో బుధవారం సమావేశమైన ఆయన కమలదళంలో చేరికకు సుముఖత తెలిపినట్లు తెలిసింది. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు భాజపాలోకి వస్తారని తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సమక్షంలో వివేక్ చేరిక ఉంటుందని భాజపా వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న కమలదళం.. దళిత, గిరిజన సామాజిక వర్గాల్లో బలమైన నేతలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే గిరిజన సామాజికవర్గానికి చెందిన ఓ మాజీ ఎంపీతోనూ సంప్రదింపులు జరిపింది. ఇది కొలిక్కి రాలేదని సమాచారం. మరోవైపు తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని భాజపా నేత ఒకరు తెలిపారు.
*అమిత్షాపై ఉత్తమ్ది విషప్రచారం
తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా జరగలేదంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పార్లమెంట్లో మాట్లాడినట్లుగా ఉత్తమ్ విషప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పీసీసీ అధ్యక్షుడికి భాజపాను విమర్శించే అర్హత లేదన్నారు. భాజపా హయాంలో ఎలాంటి సమస్య లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామని.. భాజపా మద్దతివ్వకుంటే తెలంగాణ ఏర్పడేదా? అని ప్రశ్నించారు.
*విధేయులను తరిమేసేందుకు కుట్ర
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీవ్గాంధీ విధేయులను తరిమేసేందుకు కుట్ర జరుగుతోందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్గాంధీ మరణించిన దగ్గర నుంచి ఆయన జయంతి రోజుల్లో ఏటా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్లోకి కొప్పుల రాజు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదని… ఆయన కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ పాతవారిని పార్టీ నుంచి పంపే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏమైనా తప్పులు చేసి ఉంటే విచారించాలని కోరారు.
*కాళేశ్వరం’లో అవినీతిపై చర్యలు తీసుకోండి
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటి ఎత్తిపోత సామర్థ్యాన్ని రోజుకు 3 టీఎంసీలకు పెంచేందుకు అవసరమైన పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి టెండర్లు ఆహ్వానించకుండా పాత గుత్తేదారులకే కాంట్రాక్టు అప్పగించిందన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రధాని మోదీని కోమటిరెడ్డి లేఖలో కోరారు.
*రేపు తెవిస రాష్ట్ర మహాసభలు
తెలంగాణ వికాస సమితి (తెవిస) రాష్ట్ర మూడో మహాసభలు పదో తేదీ ఉదయం 10.30 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో మొదలవుతాయి. మతతత్వ రాజకీయాల నిర్మూలనలో ప్రజాస్వామ్య శక్తుల పాత్ర, సమాఖ్య స్ఫూర్తికి ఎదురవుతున్న సవాళ్లు, తెలంగాణ సామాజిక ఐక్యత వంటి అంశాలపై చర్చలు నిర్వహిస్తామని సంస్థ అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యఅతిథిగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారు. దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నీరాచందోక్ ప్రారంభోపన్యాసం చేస్తారు. వక్తలుగా సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పాల్గొంటారు. ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు పాపిరెడ్డి, గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ శ్రీధర్, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందినిసిధారెడ్డితో పాటు ఆచార్యవినయ్బాబు, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవీప్రసాద్, టీఎన్జీవో నేత కారెంరవీందర్రెడ్డి, పారిశ్రామికవేత్తలసమాఖ్యనేత సుధీర్రెడ్డి పాల్గొంటారు.
*పార్టీ చెబితే సారథ్యానికి సై: శైలజానాథ్
పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశిస్తే ఏపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శైలజానాథ్ ప్రకటించారు. నెల్లూరులో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్ష పదవిలో రఘువీరారెడ్డి ఉన్నారని, ఆయన రాజీనామాను పార్టీ ఇంకా ఆమోదించలేదని తెలిపారు.
*వైకాపా దాడులు అనాగరికం
వైకాపా దాడుల్లో బాధితుడయిన తెదేపా కార్యకర్త ఆనంగి శ్రీహరి కుటుంబానికి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రూ. 50వేల ఆర్థికసాయం ప్రకటించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరానికి చెందిన పలువురు కార్యకర్తలు గురువారం గుంటూరులోని తెదేపా రాష్ట్రపార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వైకాపా దాడులతో గ్రామాల్లో నివసించలేని పరిస్థితి నెలకొందని చంద్రబాబుకు వివరించారు. ‘తెదేపాకు ఓట్లేశామని మా ఇంటిని కూల్చేశారు. కరెంట్ మీటర్ పీకి స్తంభానికి కట్టారు. ఎండలకు ఎండుతూ వానలకు తడుస్తూ ఇద్దరు బిడ్డలతో గేదెల పాకలో తలదాచుకుంటున్నాం’ అంటూ శ్రీహరి కన్నీరుమున్నీరయ్యారు. చంద్రబాబు బాధితులను ఓదార్చారు. ఇటువంటి దాడులు అనాగరికం, బాధాకరం అన్నారు.
*లేని అవినీతిని చూపి దోషిగా చేస్తున్నారు: సోమిరెడ్డి
విద్యుత్తు పీపీఏల విషయంలో వైకాపా ప్రభుత్వానికి కేంద్ర ఇంధనశాఖ మంత్రి, ఇంధన శాఖ కార్యదర్శి, హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గురాకపోవడం బాధాకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. పీపీఏల కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా అవినీతి జరిగిందంటూ తెదేపాను దోషిగా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వ హయాంలో విద్యుత్తు నిర్వహణలో రాష్ట్రానికి 156 అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. అజయ్కల్లం లాంటి అధికారులు తెదేపా ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
*ఆ వ్యాఖ్యలు బాబుకే వర్తిస్తాయి: రామచంద్రయ్య
‘అనుభవం ఉన్న నేత ..పాలిచ్చే ఆవు అని భ్రమించి ప్రజలు 2014లో పట్టం కట్టారు. అయిదేళ్ల అనుభవంలో ఆ ఆవు దున్నపోతు అని తేలటంతో విడిచిపెట్టారు. ఈ సత్యాన్ని గ్రహించకుండా తానేదో పాలిచ్చిన ఆవుగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు’అని వైకాపా అధికార ప్రతినిధి రామచంద్రయ్య విమర్శించారు.
*కశ్మీర్లో నూతన అధ్యాయం: జి.వి.ఎల్.
జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి అడ్డుగా ఉన్న 370 అధికరణం రద్దుతో కశ్మీర్లో నూతన అధ్యాయం ప్రారంభమైందని భాజపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి.ఎల్.నరసింహారావు పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. 370 అధికరణం రద్దుతో అక్కడ పారిశ్రామిక అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గతంలో సాధ్యం కావని చెప్పిన అంశాలనే మళ్లీ.. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అడగటం విడ్డూరంగా ఉందన్నారు.
వైకాపా కేంద్ర కార్యాలయం ప్రారంభం-రాజకీయం-08/10
Related tags :