* పిడుగురాళ్ల R&B బంగ్లాలో విలేఖరుల సమావేశం నిర్వహించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పల్నాడులో శాంతి భద్రతల సమస్యలపై పర్యటనకు రావడాన్ని ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పల్నాడులో అక్రమ మైనింగ్,పేకాట క్లబ్బులు, అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఈ బీజేపీ నాయకులు ఎందుకు ఖండించలేదు,పర్యటనలు చేయలేదని ప్రశ్నించారు.తెలుగుదేశం నాయకులతో అంతర్గత ఒప్పందాలు చేసుకుని వారికి మద్దతుగా నిలిచిన విషయం విదితమే అన్నారు. మీరు కూడా ప్రజల్లోకి వెళ్లి నిజానిజాలు తెలుసుకోవాలని ఏ ఒక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు కానీ, అక్రమ కేసులు పెట్టడం లేదని స్పష్టం చేసారు.
* వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే
వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు లను ఖరారు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ,
మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి.
* టీఆర్ఎస్ నుంచి నాకు ఆఫర్లు, పార్టీ నుంచి పంపాలనుకుంటున్నారు: విహెచ్……….
తనది కాంగ్రెస్ రక్తమన్నారు. పార్టీలో పొమ్మనలేక తనకు పొగబెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని తనకు ఆఫర్లు వచ్చాయని ఆయన చెప్పారు. తనను కొనే శక్తి ఎవరికి లేదన్నారు.బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తాననే కారణంగానే తనను పార్టీ నుండి బయటకు పంపేందుకు యత్నిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ తనను బయటకు వెళ్తే రాజీవ్ కాంగ్రెస్ పేరుతో పార్టీని పెడతానని ఆయన ప్రకటించారు.
* ఇప్పుడు తత్వం బోధపడిందా.. కేటీఆర్?: విజయశాంతి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ వ్యవహారం తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదన్నట్లు ఉందని విజయశాంతి అన్నారు. తమతో కలవని వాళ్లను దేశద్రోహులుగా ముద్రవేస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందన్న కేటీఆర్ కామెంట్లకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఐదేండ్లలో టీఆర్‌ఎస్ చేసిందేంటని నిలదీశారు. టీఆర్‌ఎస్‌తో కలిస్తే తెలంగాణవాదులు.. లేదంటే వ్యతిరేకులుగా ముద్ర వేయలేదా? అని ఫైర్ అయ్యారు. బీజేపీ పట్ల కేటీఆర్ కు కలిగిన అభిప్రాయమే.. టీఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలకు కలిగిందన్నారు. అదే అంతర్మథనంతో ప్రతిపక్షాలు కొట్టుమిట్టాడుతున్నా యన్నారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ హైక మాండ్కు తత్వం బోధ పడినందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనైనా టీఆర్‌ఎస్ నేతలు వైఖరి మార్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
* పాలన ఎలా చేయాలో నేర్చుకోండి:చంద్రబాబు
పోలవరంలాంటి ప్రాజెక్ట్ నిర్మాణమంటే కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్‌లు నిర్వహించినంత సులభం అన్నట్టుగా కొందరు మేధావులు మాట్లాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారని పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ టెక్నికల్ కమిటీలు ఉంటాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుందన్నారు.
*టీఆరెస్లో చేరితేనే తెలంగాణా వాదులా?
తమతో ఉంటె దేశ భక్తులు లేకపోతె దేశ ద్రోహులు అనే పద్దతి దేశంలో పెరిగిపోయిందన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేతీఆర్ కు ఏఐసీసి అధికార ప్రతినిధి దసోజు శ్రవణ్ ప్రశ్నలు సందించారు. దేశం గురించి మాట్లాడే కేటీఆర్ కు రాష్ట్ర ప్రజల విషయానికి వచ్చే సరికి ఆసోయి ఎటు పోయిందని నిలదిస్తున్నారు. టీఆర్ఎస్ లో చేతిలోనే చేరితేనే తెలంగాణా వాదులా? టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించేవారిని తెలంగాణ ద్రోహులుగా మీరు ముద్రవేయలేదా అని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
*సొంత ప్రభుత్వం నుంచి మమతకు ఝలక్ !
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సొంత ప్రభుత్వంలోని వ్యక్తులే ఊహించని ఝలక్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలను, రాజకీయ వ్యూహాలను తృణముల్ అమలు చేయనుంది. తృణముల్‌తో కలిసి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ టీం తాత్కాలిక ఆఫీస్ కోసం గ్రీవెన్స్ సెల్‌లో కొంత భాగాన్ని పంచుకోవాలనుకుంది. అయితే.. గ్రీవెన్స్ సెల్‌లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అందుకు నిరాకరించారు. ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు.
* బీజేపీలోకి ప్రముఖ క్రీడాకారిణి
ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫొగాట్ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజు సమక్షంలో ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులైన బబిత, మహావీర్ బీజేపీ గూటికి చేరారు.
*త్వరలో భాజపా గూటికి మోత్కుపల్లి
సీనియర్ నాయకుడు, తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు త్వరలో కమలం గూటికి చేరనున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి శనివారం రాత్రి మోత్కుపల్లితో హైదరాబాద్లో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. భాజపాలో చేరాలని ఆయన్ను ఆహ్వానించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో అపాయింట్మెంట్ ఉంటుందని భాజపా నేతలు వివరించినట్లు సమాచారం. దీంతో భాజపాలో చేరేందుకు మోత్కుపల్లి అంగీకరించారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం భాజపాయేనని మోత్కుపల్లి అన్నారు. ‘‘మా కార్యకర్తలతో మాట్లాడుతున్నా. భాజపాలో చేరాలని ఆహ్వానించారు. అమిత్షా అపాయింట్మెంట్ ఇచ్చాక పార్టీలో చేరుతా’ అని నర్సింహులు చెప్పారు.
*కాంగ్రెస్లో వృద్ధనేతలదే పైచేయి
కాంగ్రెస్ అధ్యక్షుడి నియామక వ్యవహారం కొలిక్కి రాకపోవడం, సోనియాగాంధీకే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద రాజకీయమే నడిచింది. ఇది యువ, వృద్ధనేతల మధ్య పోరుగా పరిణమించగా, పెద్దతరం వారే మాట నెగ్గించుకున్నారు. పార్టీలో యువకులకు ప్రాధాన్యం పెంచాలని తొలుత రాహుల్గాంధీ భావించినా వృద్ధనేతలు పడనీయలేదు. 1969లో ఇందిరాగాంధీ పాతనేతలను తప్పించి, కొత్తవారికి అవకాశం ఇవ్వడాన్ని గుర్తుచేసుకున్నారు.
*సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం: రావుల
సంక్షేమ పథకాల అమలులో తెరాస ప్రభుత్వం విఫలమైందని తెలుగు దేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల తెరాస పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ కాలేదన్నారు. వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ గ్రామీణ పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ బిల్లులను చెల్లించకపోవడంతో ఈనెల 15 నుంచి వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రులు ప్రకటించాయని గుర్తుచేశారు.
*యురేనియం వ్యతిరేక ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు: వీహెచ్
నల్లమల అడవిలో యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు చెప్పారు. అమ్రాబాద్ పులుల అభయారణ్యం దేశంలోనే రెండో అతి పెద్దదని, 22 పులులు ఆవాసం ఉన్నాయని ఓవైపు చెబుతూనే.. యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నల్లమలలో యురేనియం సర్వేకు అనుమతుల నేపథ్యంలో ఆదివారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో పర్యటించారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి లోతట్టు అటవీ ప్రాంతంలో ఉన్న మల్లాపూర్ చెంచుపెంటను సందర్శించి, చెంచులతో సమావేశమయ్యారు. అడవులు పెంచాలి, వర్షాలు కురవాలని చెబుతున్న సీఎం కేసీఆర్ యురేనియం సర్వేకు కేంద్రం ఇచ్చిన అనుమతులను ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
*కార్మిక సంఘం ఎన్నికల్లో కూన శ్రీశైలంగౌడ్ విజయం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చింతల్ ఐడీపీఎల్ పారిశ్రామికవాడలోని హెచ్ఎంటీ ప్రాగాటూల్స్ సంస్థలో ఆదివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అభ్యర్థిగా పోటీ చేసిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ విజయం సాధించారు. 65 ఓట్లు సాధించిన శ్రీశైలంగౌడ్.. టీఆర్ఎస్కేవీ అభ్యర్థిగా పోటీ చేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై 2 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
*ఓట్లేయకపోతే ఇళ్లు కూలుస్తారా?: చంద్రబాబు
నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం జనార్దనరెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తెదేపా కార్యకర్తల ఇళ్లను కూలుస్తున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కేవలం వైకాపాకు ఓటు వేయలేదన్న కారణంతో తెదేపా సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకోవడం గర్హనీయమని ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. ఇకనైనా అప్రజాస్వామిక చర్యలను ఆపాలని కోరారు.
*సోనియా నాయకత్వం ఎంతో అవసరం: రఘువీరా
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎంపిక చేస్తూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. సోనియా నాయకత్వం ఎంతో అవసరమని, పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని ఆదివారం విడుదల చేసిన వీడియో సందేశంలో తెలిపారు.
*2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
నవంబరులో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలు, 2024లో శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైకాపా సామాజిక మాధ్యమ వాలంటీర్లు పని చేయాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైకాపా అధికారంలోకి రావడానికి సామాజిక మాధ్యమ విభాగం అందించిన మద్దతు మరువలేనిదని పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలో ‘వైకాపా సామాజిక మాధ్యమ వాలంటీర్ల ఆత్మీయ సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు.
*వైఎస్ హయాంలోనూ ఇంతలా దాడులు లేవు: కళా
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన దశ, దిశా లేకుండా సాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంస్కృతి కాదని అభిప్రాయపడ్డారు. వై.ఎస్ పాలనలోనూ ఇంత దారుణం లేదని పేర్కొన్నారు.
*బేరాలు కుదరకే ఇసుక కొరత: దేవినేని
ఉచిత ఇసుకపై ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పెద్దపెద్ద మాటలు చెప్పారని, 3 నెలలు గడిచినా ఇసుకను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ఆయన సమర్థత ఏమిటో ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బస్తాకు రూ.5 చొప్పున ఇవ్వాలని వైకాపా నేతలు సిమెంటు కర్మాగారాలను డిమాండు చేశారని, బేరాలు కుదరక ఇసుక కొరతను సృష్టించారని ఆరోపించారు. వైకాపా నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, గంగిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నారు.
*దేవినేని ఉమా జైలుకెళ్లడం ఖాయం: కృష్ణప్రసాద్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని, రాబోయే రోజుల్లో ఆయన జైలుకెళ్లడం ఖాయమని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. మైలవరం నియోజకవర్గంలో నీరు-చెట్టు పనుల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా నేతలు సిమెంటు కంపెనీలతో లాలూచీ పడ్డారంటూ దేవినేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్ష్యాలు చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. లేదంటే రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సిద్ధమేనా అని దేవినేనికి సవాలు విసిరారు.
కన్నా పై కాసు ఫైర్-రాజకీయ–08/12
Related tags :