Devotional

14నుండి మంత్రాలయంలో ఆరాధనోత్సవాలు

Manthralaya Aaraadhanotsavam 2019 From Aug 14th

1. 14నుండి మంత్రాలయంలో ఆరాధనోత్సవాలు –ఆద్యాత్మిక వార్తలు – 08/12
మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. స్వామి జీవితం, బృందావనం మాత్రమే కాదు మరికొన్ని విశేషాలూ ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి.
**పాదోదకం…పావనం: రోజూ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు. బృందావనాన్ని హరి మందిరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ 700 సాలిగ్రామాలను ప్రతిష్ఠించారు. ఎందరో మహానుభావులూ ఇక్కడే కొలువై ఉన్నారనీ భక్తులు నమ్ముతారు. ఒక్కసారి రాఘవేంద్రస్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు, సాలిగ్రామాలకు అభిషేకాలు చేసినట్లు అవుతుంది. అలాంటి జలం అత్యంత పవిత్రమైందని… చాలా వ్యాధులను ఇది నివారిస్తుందని చెబుతారు. ఈ పాదోదకాన్ని తాగడానికి మాత్రమే కాకుండా భక్తులపై ప్రోక్షణం కూడా చేస్తారు. దీని వల్ల పిశాచి వంటి పీడలు తొలిగిపోతాయని విశ్వసిస్తారు.
**మంత్రాక్షితలు: రాఘవేంద్రస్వామి దర్శనం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షితల కోసం బారులు తీరుతారు. ఈ అక్షితల్లో పసుపు, సున్నం కలుపుతారు. అందుకే అవి ఎర్రగా ఉంటాయి. రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులకు అక్షితలను ఇచ్చే సంప్రదాయం రాఘవేంద్రస్వామి కాలం నుంచి కొనసాగుతోంది. ఆనాడు ఆ యతీంద్రులు వాడిన పాత్రలోనే నేటికీ వాటిని తయారుచేసి భక్తులకు ఇస్తుండడం విశేషం. మఠంలో ఆ పాత్ర పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నారు.
**మృత్తిక మహిమ: రాఘవేంద్రస్వామి బృందావనంపై ఉంచే మృత్తిక చాలా విశిష్ఠమైందని నమ్మకం. దీన్ని విషయంలో ఓ కథ ఉంది. గురు రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్నప్పుడు.. ఓ బ్రాహ్మణ భక్తుడు స్వామి దగ్గరకు వెళ్లి స్వామీ నా కుమారుడి ఉపనయనానికి ధనం కావాలని అడిగాడు. ఆ సమయంలో స్వామి తుంగభద్ర నది ఒడ్డున స్నానం కోసం ఉన్నారు. రోజూ మృత్తికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చారు. దానిని తీసుకొని వెళ్తూ ఆ భక్తుడు దారితప్పి మరో గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ గురు రాఘవేంద్రులు ఇచ్చిన మృత్తిక సాయంతో ఓ ధనవంతుడి సంతానాన్ని హరిస్తున్న పిశాచిని సంహరిస్తాడు. అప్పుడా ధనవంతుడు సంతోషంతో పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. అంతటి మహిమ ఉన్న ఆ మృత్తికను నేటికీ మంత్రాలయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్రస్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం ఏర్పాటుచేశారు. ఏటా ఆషాఢమాసంలో గురుపౌర్ణమి రోజు స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుతో తెచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు. ఇతర ప్రాంతాల్లో రాఘవేంద్రస్వామి ఆలయాల స్థాపనకు ఈ మృత్తికను వినియోగిస్తారు. అలాగే ఈ మృత్తికను భక్తులు తీసుకెళ్లి ఇళ్లల్లో ఉంచుకుంటారు.
**మంచాలమ్మ దర్శనం: రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా మఠం ముందు ఉండే గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో బృందావనం ప్రవేశం చేయక ముందు అమ్మవారిని దర్శించి నేను ఇక్కడే కొలువై ఉంటాను. ముందుగా నీకు నైవేద్యం, దర్శనం అయిన తర్వాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారని చెప్పినట్లు మఠం పండితులు చెబుతారు.
***ఉత్సవాలు ఇలా…:
* 14(బుధవారం): పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.
* 15: శాఖోత్సవం, ధాన్యపూజలు చేస్తారు.
* 16: పూర్వారాధన నిర్వహిస్తారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం ఉంటుంది.
* 18: ఉత్తరారాధన రోజున స్వామివారి ఉత్సవమూర్తిని మహా రథంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగిస్తారు.
* 19: సుజ్ఞానేంద్ర ఆరాధన జరుగుతుంది.
* 20: ఆరాధనోత్సవాలు ముగుస్తాయి.
2. అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు
తమిళనాడులోని కాంచీపురంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కంచిలో గల అత్తి వరద రాజు స్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తదితరులు పాల్గొన్నారు.
3. కనులపండువగా శ్రీశైల మల్లన్న కల్యాణం
దిల్లీలోని తితిదే బాలాజీ మందిర్లో శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి కల్యాణోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. దేవస్థాన ప్రధాన అర్చకులు బి.వి.ఎస్.శాస్త్రి నేతృత్వంలోని 15 మంది అర్చకులు కల్యాణం నిర్వహించారు.
4. 13 నుంచి తొండమనాడులో పవిత్రోత్సవాలు
తితిదేకి అనుబంధంగా శ్రీకాళహస్తి మండలం తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 12న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 13న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిత్య ఆరాధన, కుంభప్రోక్షణ చేపడుతారు. 15న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలను ఆర్జితసేవగా తితిదే ప్రవేశపెట్టింది. ఇందులో పాల్గొనదలచిన గృహస్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
5. వరసిద్ధుడికి వెండి కిరీటం కానుక
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి కాణిపాకం పంచాయతీ అగరంపల్లెకు చెందిన అరుణకుమారి, కిషోర్కుమార్ సుమారు రూ.లక్ష విలువ చేసే 1.750 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ఆలయ ఏఈవో విద్యాసాగర్రెడ్డికి శనివారం ఉదయం అందించారు. ఆలయ మర్యాదల ప్రకారం దాత, కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలను ఏఈవో అందించారు. మూషిక మండపంలో వేదపండితులు వారిని ఆశీర్వదించారు. ప్రాంగణంలోని వీరాంజనేయస్వామి, నవగ్రహాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.
6. నేడు కంచి, తిరుమలకు సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కాంచీపురం, తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం 8.55కి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట నుంచి కుటుంబ సమేతంగా బయల్దేరుతారు. 9.55కి తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి వెళతారు. అక్కడ అత్తి వరదర్ స్వామీ వారిని దర్శించుకుని అనంతరం తిరుపతికి వస్తారు. ఒంటిగంటకు తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హైదరాబాద్కు చేరుకుంటారు.
7. పవిత్రోత్సవం.. వైభవోపేతం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం, భక్తులవల్ల జరిగే దోషాల నివారణార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ముందుగా అర్చకులు మండపంలో 7 హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేసి ఆగమోక్తంగా హోమాలు నిర్వహించారు. అనంతరం పండితుల వేదఘోష నడుమ స్నపన తిరుమంజనం కనువిందుగా సాగింది.సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించారు.
8. యాదాద్రిలో శ్రీవారికి లక్షపుష్పార్చన
శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి లక్షపుష్పార్చనను కన్నుల పండువుగా నిర్వహించారు..ఏకాదశి కావడంతో శ్రీవారికి లక్ష పుష్పాలతో కొలుస్తూ అపురూపంగా పూజాకైంకర్యాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో పవిత్రోత్సవాలు కూడా సంప్రదాయ పద్దతిలో జరగుతున్నాయి. ఏడాది పాటు జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. ఆదివారం కావడంతో తరలివచ్చిన భక్తులతో యాదాద్రి కిటకిటలాడింది. ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం శ్రీలక్ష్మీనరసింహునికి లక్ష తులసీపుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. లక్ష పుష్పాలతో శ్రీవారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన చేయడం ఆనవాయితి. శ్రీవారి ఖజానాకు రూ 26, 29, 576 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
9. జగన్మాత సేవలో సినీ నటుడు శ్రీకాంత్‌
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌, కాకినాడ పార్లమెంట్‌ సభ్యులు వంగా గీత, రాష్ట్ర పర్యటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులతోపాటు, దేవస్థానం ఉద్యోగులు నటుడు శ్రీకాంత్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారికి ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అమృతరావు, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్‌ పాల్గొన్నారు.
10. ఘనంగా ధర్మరాజు స్వామి వారి తిరునాళ్ళు…
చిత్తూరు జిల్లా నారాయణవనం లో ధర్మరాజు స్వామి జాతరను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధర్మరాజుల తిరునాళ్ళు జరుపుకోవడం మా ఆనవాయితీ అన్నారు.. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న భక్తులు స్వామికి అభిషేకం, నైవేద్యం, పుష్ప అలంకరణ చేస్తూ అగ్ని గుండం లో దిగుతూ ధర్మరాజు స్వామి దర్శించుకుంటారు. అనంతరం గ్రామంలో ఉన్న భక్తులు అర్జునుడు, భీముడు, అనేక వేషాలతో గ్రామంలో తిరునాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది అన్నారు.అనంతరం వివిధ పుష్పాలతో పుష్పాలంకరణ చేసి మహా దీపారాధనలు చేస్తూ ధర్మ రాజులస్వామి ఊరేగింపు జరుగుతుంది అన్నారు.
11. శ్రీకాళహస్తిశ్వర దేవస్థానంలో వరుసశెలవులతో గణనీయంగ పెరిగిన భక్తజనం
దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఐన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజులు సెలవులు రావడంతో శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు రాహుకేతు పూజలు చేసుకుని అనంతరం రుద్రాభిషేకం పాలాభిషేకం పూజలు చేసుకున్నారు. అనంతరం స్వామి అమ్మవారిని విశేషంగా వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామస్వామి ఇతర అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే జాగ్రత్తపడి మెరుగైన సౌకర్యాలు సామాన్య భక్తుడికి దర్శన భాగ్యం కల్పించారు.