Sports

పాక్ క్రికెట్ ప్రక్షాళన ప్రారంభం

Pakistan cricket team to be reformed totally

పంచకప్‌లో చెత్త ప్రదర్శన, వరుస ఓటములు, జట్టులో సంక్షోభం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును గాడిలో పెట్టేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. స్వయంగా క్రికెటర్ కావడం, సుధీర్ఘ అనుభవం రీత్యా క్షేత్ర స్థాయిలో చర్యలకు ప్రధాని శ్రీకారం చుట్టారు.మొన్నటి వరకు కోచ్‌గా వ్యవహరించిన మికీ ఆర్ధర్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. జట్టు పరిస్థితి దృష్ట్యా మరో రెండేళ్ల పాటు ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని పీసీబీ పెద్దలు భావించినప్పటికీ ఇమ్రాన్ జోక్యం చేసుకుని ఆర్ధర్‌ను తప్పించాలని సూచించినట్లుగా తెలుస్తోంది.దీంతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేయడానికి కూడా ఇమ్రాన్ ఖాన్ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. జట్టు కోచ్‌గా విదేశీ కోచ్ కంటే స్వదేశానికి చెందిన వ్యక్తినే కోచ్‌గా ఎంపిక చేయాలని పీసీబీ భావిస్తోంది.విదేశాలకు చెందిన మికీ ఆర్ధర్ మార్గదర్శకత్వంలో పాకిస్తాన్ జట్టు మెరుగైన ఫలితాలు సాధించకపోవడంతో పాక్‌కు చెందిన వ్యక్తే కోచ్‌గా వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లుగా టాక్. ఇక కొత్త కోచ్ రేసులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మొహిసిన్ ఖాన్, మిస్బావుల్ హక్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.