1. సెప్టెంబరు 5 నుంచి జియో ఫైబర్ సేవలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. సోమవారం జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ మాట్లాడుతూ.. 1600 నగరాల్లోని 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
2. రిలయన్స్‌లో సౌదీ కంపెనీ భారీ పెట్టుబడులు
సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరమ్‌కో తమ కంపెనీలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలిపారు. రిలయన్స్ ఆయిల్ టు డివిజన్‌లో సౌదీ అరమ్‌కో 20శాతం వాటాల కోసం పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యమని అన్నారు.
3. తెరుచుకున్న నాగార్జునసాగర్ 26 గేట్లు
కర్ణాటక మరాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ కళకళలాడుతున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున శ్రీశైలంలో 10 గేట్లు, నాగార్జున సాగర్‌లో 26 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
4. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకటరమణతోపాటు పార్టీ నేతలు మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేస్తూ వైకాపా నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోపిదేవి ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు మంత్రి పదవి అప్పగించారు.
5. కాంచీపురం బయల్దేరిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురం బయల్దేరి వెళ్లారు. దైవదర్శనార్థం కుటుంబసభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పయనమయ్యారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో కంచి వెళ్తారు. కాంచీపురంలో అత్తివరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం తిరుమల చేరుకొని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
6. మా ఉద్యోగాలు మాకే.. గళమెత్తిన నటుడు ఉపేంద్ర
కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు.
7. రెండు గుడ్ల ధర రూ.1700
ఇటీవల రెండు అరటిపండ్లకు చండీగఢ్‌లోని ఓ రెస్టారెంట్ వాళ్లు రూ.442 వసూలు చేసిన ఉదంతం మరువక ముందే దానికి మించిన ఘటన మరొకటి చోటుచేసుకుంది. ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్‌లో రెండు ఉడకబెట్టిన గుడ్లకు ఏకంగా రూ.1700 వసూలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ బిల్లు కట్టిన బాధితుడే పంచుకున్నాడు. సాక్ష్యంగా రశీదును సైతం ట్విటర్‌లో షేర్ చేశాడు. దీనిపై ఇప్పటివరు హోటల్ యాజమాన్యం మాత్రం స్పందించలేదు.
8. మువ్వన్నెల జెండా.. రికార్డు మురిసిపోయేలా
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో అతి పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వేలాది మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మానవహారంలా ఏర్పడి 15 కిలోమీటర్ల మువ్వెన్నల జెండాను ప్రదర్శించారు. రాయ్‌పూర్‌లోని రవిశంకర్ శుక్లా యూనివర్శిటీ నుంచి అమపరా చౌక్ వరకు ఈ ప్రదర్శన సాగింది.
9. కోహ్లీ వ్యాఖ్యలను వ్యతిరేకించిన సన్నీ
నాలుగోస్థానంలో యువ కీపర్ రిషబ్‌పంత్‌ను కొనసాగించడానికి టీమిండియా భావిస్తోందని కెప్టెన్ విరాట్‌కోహ్లీ చేసిన వ్యాఖ్యలను సునీల్‌గావస్కర్ వ్యతిరేకించాడు. యస్ అయ్యర్ రెండో వన్డేలో తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, నాలుగోస్థానంలో పంత్ కన్నా అతడే సరిగ్గా సరిపోయాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లాగే పంత్ కూడా ఐదు, ఆరు స్థానాల్లోనే మ్యాచ్ ఫినీషర్‌గా పనికొస్తాడని, ఆ స్థానాలే అతడి ఆటశైలికి సరిపోతాయని చెప్పాడు.
10.తిరుపతి తిరుమల కంచిలలో దైవదర్శనాలు పూర్తీ చేసిన కేసీఆర్.
నేటి ప్రధాన వార్తలు-08/12
Related tags :