Food

మిరియాలు వాటి ఔషధ గుణాలు

The health benefits of pepper

క్వీన్ ఆఫ్ స్పైసెస్‌ గా పిలవబడే నల్ల మిరియాలను మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికి వీటిని వాడతారు. దీంతోపాటు సుస్తీ చేస్తే ఔషధంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మిరియాలను వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మిరియాల్లో కేవలం నల్లవే కాదు, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ ఇవి లభిస్తున్నాయి. వీటితో ఉపయోగాలు ఏమిటో చూద్దాం.
1. మిరియాలను నూర్చేటప్పుడు వెలువడే పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా ఉపయోగిస్తారు. దీంతో తలనొప్పి వంటి దీర్ఘవ్యాధులు నయం అవుతాయి.
2. జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడం, ఘాటైన వాసనను కలిగి ఉండడం వంటి గుణాల కారణంగా ఇవి శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి. ఒక గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. దీంతో జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరమవుతాయి.
3. లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి నెట్టి వేసే శక్తి మిరియాలకు ఉంది. రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు కూడా ఇవి తోడ్పడుతాయి.
4. కొవ్వు రుకోకుండా ఉంటుంది. శరీరంలో స్వేద ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి.
5. అజీర్ణ సమస్యతో బాధపడుతున్న వారు మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
6. ఉదరంలో వాయువులు ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
7. కండరాలు, నరాలు నొప్పిగా అనిపించినప్పుడు చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు భోజనానికి గంట ముందు అరగ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకుని వేడి నీళ్లు తాగితే గుణం కనిపిస్తుంది.
8. అధిక దప్పిక ఉన్నవారు కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే మంచిది. పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి.
9. చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు, నోటి నుంచి రక్తం రావడం వంటివి తగ్గుతాయి.
10. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టు కడితే నొప్పి, వాపు తగ్గుతుంది. చర్మవ్యాధులు, గాయాలు ఉన్నప్పుడు మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇవే కాకుండా మొటిమలు తగ్గేందుకు, యాంటీ బయోటిక్‌గా, అసిడిటీ సమస్యకు, శరీరంలో అధిక వేడికి మిరియాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. అయితే వీటిని తగినంత మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది.