గ్రేటర్‌వాసుల కలల మెట్రో జర్నీకి సిటీజన్ల నుంచి ఆదరణ పెరుగుతోన్న విషయం విదితమే. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్(29కి.మీ.), నాగోల్–హైటెక్‌సిటీ(28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు రూట్లలో నిత్యం సుమారు మూడు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వీరిలో కొందరు కొత్తవారు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో జర్నీలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెట్రో అధికారులు ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆ వివరాలివీ.
*స్టేషన్లు, రైలులో చేయాల్సిన పనులివీ..
మీ చేతిలో లేదా బ్యాగులోని చెత్త, చెదారాన్ని విధిగా చెత్తకుండీలోనే వేయాలి. స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిదీ. మెట్రోస్టేషన్ పరిసరాలకు చేరుకున్న తరవాత మీ ప్రయాణానికి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వినిపించే అనౌన్స్‌మెంట్లను జాగ్రత్తగా వినాలి. మీకేదైనా సహాయం కావాలంటే కస్టమర్ సర్వీస్ బృందం, స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి. మెట్రో స్టేషన్ లేదా భోగీలో నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలున్నట్లు అనుమా నిస్తే సిబ్బందికి వెంటనే తెలియజేయాలి. స్టేషన్‌లోపలికి వెళ్లే సమయంలో వ్యక్తిగత, బ్యాగేజీ తనిఖీ విషయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలి. తోటి ప్రయాణీకులు,మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్‌తో మర్యాదగా ప్రవర్తించండి. మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లపై వెళుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీరు దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోవాలి. ఎస్కలేటర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎడమవైపున మాత్రమే ఉండాలి.
భోగీలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిలబడాలి. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూర్చునేందుకు మీ వంతుగా సహకరించాలి. చిన్నారులను తీసుకొచ్చే బేబీ బగ్గీస్, వీల్‌చైర్లలో వచ్చేవారు విధిగా ఎలివేటర్లలో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లాలి. ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా జరగాలి. టిక్కెట్ కౌంటర్, టిక్కెట్ విక్రయ యంత్రాలు, ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్‌లో నిలబడాలి. ప్రయాణిస్తున్నప్పడు సిబ్బంది టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపమని తనిఖీ చేసినపుడు వారికి సహకరించాలి. టిక్కెట్ లేని ప్రయాణీకులపై కఠిన చర్యలు తప్పవు. అత్యవసర అనౌన్స్‌మెంట్ వినిపించినపుడు హడావుడిగా రైలు దిగాలి. రైలు ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే భోగీలోనికి ప్రవేశించాలి. రైలు కోసం పరుగెత్తరాదు. రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఉండే సందులో ఎలాంటి వస్తువులు, కాళ్లను పెట్టరాదు.
**చేయకూడని పనులివీ..
స్టేషన్‌లు, భోగీలు, పరిసరాల్లో ఉమ్మివేయడం, చూయింగ్‌గమ్ ఊయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలరాదు. రైలులోనికి ప్రవేశించిన తరవాత ఫొటోలు తీయడం నిషిద్ధం.
నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు. మీ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం..
ప్రమాదకర వస్తువులు, అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాలు, భోగీల్లోకి తీసుకురావద్దు. ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోరాదు. ప్లాట్‌ఫాంపై వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు. మీ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టరాదు.
హైదరాబాద్ రైళ్లల్లో దయచేసి ఇవి చేయవద్దు
Related tags :