DailyDose

మోడికి ముద్రగడ లేఖ – తాజా వార్తలు – 08/13

Mudragada Writes To Modi-Telugu Breaking News Today-Aug132019

*ప్రధాని నరేంద్ర మోడీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 02.12.2017న అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన 33/2017 కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. గత యాభై సంవత్సరాలుగా ఆంధ్రాలో రాజకీయ పక్షాలు తమ ఓట్లు పొంది రిజర్వేషన్ విషయంలో మోసం చేశారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5% బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. తక్షణం బిల్లును ఆమోదించి కాపు రిజర్వేషన్ అమలుకు కేంద్రం సహకరించాలని లేఖలో మోడీకి ముద్రగడ విజ్ఞప్తి చేశారు.
* భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌2 ఈ నెల 20వ తేదీన చంద్రుడిని సమీపించనున్నది. సెప్టెంబర్‌ 7వ తేదీన చంద్రుడిపై దిగనున్నదని ఇస్రో ఛైర్మన్‌ కె శివన్‌ చెప్పారు. చంద్రయాన్‌ ఈ నెల 20వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేరుతుందని, తద్వారా చంద్రుడికి సమీపంలోకి వెళుతుందని ఆయన అన్నారు. సెప్టెంబర్‌ 7వ తేదీన చంద్రుడిపై దిగుతుందని, ఇది తమ పూర్తి ప్రణాళిక అని ఆయన చెప్పారు. ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున మూడున్నర గంటలకు చంద్రయాన్‌2 ట్రాన్స్‌ లూనార్‌ ఇంజెక్షన్‌ అనే ప్రక్రియకు లోనవుతుందని, తద్వారా భూమిని పూర్తిగా వదిలి చంద్రుడివైపు దూసుకుపోతుందని ఆయన చెప్పారు.
* కృష్ణమ్మ వరదలో 400 గొర్రెలు, నలుగురు కాపరులు చిక్కుకున్నారు. ఎగువ నుంచి వచ్చిన వరదతో కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం మునుగోడు లంక జలదిగ్బంధమైంది. గొర్రెలను మేపేందుకు వెళ్లిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కాపరులు వరద నీరు ముంచెత్తడంతో సంగళ్లపాలెం సమీపంలోని కృష్ణా లంకభూముల్లో చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని కాపాడాలంటూ స్థానికులు పోలీసులను కోరారు. అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ అధికారులు కాపరులను కాపాడడానికి ప్రత్యేక పడవల్లో లంకకు వెళ్లారు.
* పులిచింతల ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తడం తో భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ వైపు పరవళ్లు తొక్కుతుంది.అర్ధరాత్రి సమయంలో పులిచింతల ప్రాజెక్టును సందర్శించి అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను.జగ్గయ్యపేట మండలంలోని రావిరాల, వేదాద్రి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
* కృష్ణానది వరద ధాటికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రవాహంలో కొట్టుకొచ్చిన మొసళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న విషయం తెలిసిందే. బెళగావి జిల్లా రాయభాగ తాలూకా చించళి పట్టణం అజిత్‌నగర్‌లో ఓ ఇంటిపైకి మొసలి చేరింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన మొసలి ఇంటిపైకి చేరింది. సుమారు 10 అడుగుల పొడవు కల్గిన మొసలిని చూసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పాములు, తేళ్ళు, విషపూరిత జంతువుల తాకిడి అధికమైంది. వీటికితోడు ఏకంగా మొసళ్ళు కనిపిస్తుండడంతో భయపడుతున్నారు.
*దేశ రాజధాని దిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల నాటి శ్రీ గురు రవిదాస్‌ ఆలయాన్ని కూల్చివేయడంపై పంజాబ్‌లోని రవిదాసియా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయం కూల్చివేయడాన్ని నిరసిస్తూ పంజాబ్‌ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. బంద్‌ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. పలు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి.
*ఎగువ పులిచింతల నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పైకెత్తారు. బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం ఉంది. తొలుత నీటి మట్టం 12 అడుగులకు చేరితే గేట్లు తెరవాలని అధికారులు భావించినప్పటికీ వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ముందుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
*నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనార్దన్‌ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తెదేపా నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చివేస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని తెదేపా నేతలు అంటున్నారు. తెదేపా నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
*చెదురుమదురు నిరసనలు మినహా ఈద్-అల్-అదా ప్రార్థనలు సోమవారం జమ్మూ-కశ్మీర్లో శాంతియుతంగానే సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా పరిస్థితులు ఉండటంతో పండుగ ఉత్సాహం మాత్రం ఎక్కడా కనిపించలేదు.
*కశ్మీర్కు చెందిన కొన్ని ఖాతాలను మూసేయాలని ట్విటర్కు కేంద్రప్రభుత్వం లేఖరాసింది. ఇవి వదంతులను, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ లోయలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని, అందువల్ల వీటిని మూసేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు.
*రెండు తెలుగురాష్ట్రాలకు వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో పదేళ్ల తర్వాత సోమవారం మొత్తం గేట్లు అన్నింటినీ ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మొదట ఉదయం 7.25 గంటలకు 4 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల ప్రారంభించారు.
*భారీ వర్షాలు, వరదల కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే పలు రైళ్లలో కొన్నింటిని రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పాక్షికంగా రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
*బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారానికి మరింత తీవ్రం కానుంది. దీనికితోడు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
* ద్వైపాక్షిక విభేదాలేవీ వివాదాలుగా మారకూడదని చైనాకు భారత్ స్పష్టంచేసింది. జమ్మూ-కశ్మీర్పై భారతదేశ నిర్ణయాలు తమ అంతర్గత వ్యవహారమని, వాటి ప్రభావం భారత సరిహద్దులపై గానీ, వాస్తవాధీన రేఖపై గానీ ఉండబోవని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయ్శంకర్ తేల్చిచెప్పారు.
*ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలవారిని వరద భయం వెన్నాడుతోంది. కృష్ణా, భీమా, తుంగభద్రలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో చాలాచోట్ల తీర ప్రాంత ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
* తిరుపతిలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఐఐటీ) మొదటి బ్యాచ్ విద్యార్థి సాకేత్ రూ.22 లక్షల వార్షిక ప్యాకేజీతో ప్రాంగణ నియామకం పొందాడు. మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన సాకేత్ కంప్యూటర్ సైన్సు విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు.
*ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించారు. వెబ్ ఆప్షన్ల గడువు సోమవారంతో ముగిసినా, డిగ్రీలో కొన్ని సెమిస్టర్ల ఫలితాలు ఇంకా విడుదల కాలేదు.
*ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, సర్వీసు నిబంధనలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్ (ఏపీఏటీ)కి కాలం చెల్లనుంది.
*కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో డీఎస్పీగా పనిచేస్తున్న బండి పెద్దిరాజుకు 2019 సంవత్సరానికిగానూ ‘కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ లభించింది. విచారణలో ఉన్నత ప్రమాణాలు పాటించిన వారికి ఈ మెడల్ అందజేస్తారు.
*వ్యవసాయ మిషన్ రెండో సమావేశం 14న సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనుంది. వైస్ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సభ్యులు దీనికి హాజరు కానున్నారు. రైతుల సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు.