Sports

నాకు సెలెక్టర్ కావాలని ఆశగా ఉంది

Sehwag wants to become member of indian cricket team selection committee

తనకు భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ ప్యానల్‌లో సభ్యుడు కావాలని ఉందని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు సెలక్టర్‌ కావాలని ఎంతో ఆశగా ఉందని, కానీ ఆ చాన్స్‌ ఎవరిస్తారని ట్వీట్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్‌.. ఆలోచింప చేసే ట్వీట్లు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా సోమవారం సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో ‘నాకు సెలక్టర్‌ కావాలనుంది. కానీ అవకాశం ఇచ్చేదెవరు’ అంటూ కామెంట్ పోస్టు చేశాడు. సాధారణంగా సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎక్కువగా సరదా సందేశాలే పెడుతుంటాడు కాబట్టి.. ఈ ట్వీట్‌ ఉద్దేశమేంటన్నది అతనే చెప్పాలి మరి.తనకు సెలక్టర్‌ కావాలని ఉందంటూ సెహ్వాగ్‌ చేసిన ట్వీట్‌పై అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. ‘మీకు బీసీసీఐ సెలక్షన్‌ ప్యానల్‌ పని చేసే అవకాశం రావాలి’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘ సెహ్వాగ్‌కు సెలక్టర్‌గా చేసే అవకాశం ఇవ్వాలి’ అని మరొకరు కోరారు. ‘ మీరు సెలక్టరైతే భారత క్రికెట్‌ జట్టులో కొత్త ఉత్సాహం వస్తుంది’ అని మరొక అభిమాని ట్వీట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన సెహ్వాగ్ తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించాడు. 2001లో దక్షిణాఫ్రికాతో జరిగిన అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా భారత తరుపున ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్‌గా నిలిచాడు. తన టెస్టు కెరీర్‌లో 104 టెస్టులు ఆడి 8,586 పరుగులు సాధించాడు. అందులో 23 సెంచరీలు, 32 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో సెహ్వాగ్‌ అత్యధిక స్కోరు 319. ఇక వన్డేల్లో 251 మ్యాచ్‌లు ఆడి 8,273 పరుగులు సాధించాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 219. 19 అంతర్జాతీయ టీ20ల్లో 394 పరుగులు చేశాడు.