Business

తెలంగాణాలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు

Six New Airports In Telangana

తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న ప్రయాణ అవసరాల దృష్ట్యా ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెంలలో విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్‌ కింద వీటిని నిర్మించాలని యోచిస్తోంది. పెద్దపల్లి, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో ఇప్పటికే ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉన్నాయి. వరంగల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ను సైనిక అవసరాలకు నిర్మించారు. పెద్దపల్లి, ఆదిలాబాద్‌లలో బిర్లా సంస్థ తమ పరిశ్రమల అవసరాల కోసం నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రతిపాదించిన 6 ప్రాంతాల్లో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించింది. ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలపై సెప్టెంబరు చివరికి నివేదిక అందజేయనున్నారు. దాని ఆధారంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందిస్తాయి.

ఈ నెల 19 నుంచి 3 రోజుల పర్యటన
అధ్యయనంలో భాగంగా గత నెలలో అధికారుల బృందం వరంగల్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లలో ప్రతిపాదించిన ప్రాంతాలను పరిశీలించింది. రెండో దశలో ఈ నెల 19 నుంచి 3 రోజులపాటు ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌లలో పర్యటించనుంది.

ఈ అంశాలపై పరిశీలన
* ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయాల అవసరం ఉందా?
* ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ డిమాండ్‌ ఏ స్థాయిలో ఉంటుంది?
* ఇప్పటికే ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉన్న ప్రాంతాల్లో స్థలం ఎంత ఉంది? అది సరిపోతుందా?
* పూర్తిస్థాయిలో నిర్మించాల్సిన ప్రాంతాల్లో ఎంత స్థలం అవసరం?
* ఆయా ప్రాంతాల్లో గడిచిన 5-6 దశాబ్దాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలమా? కాదా?